బొందబెట్టే దాకా పోరు ఆగదు | Komati Reddy and Sampath fires on TRS | Sakshi
Sakshi News home page

బొందబెట్టే దాకా పోరు ఆగదు

Published Fri, Mar 16 2018 1:04 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Komati Reddy and Sampath fires on TRS - Sakshi

గురువారం గాంధీభవన్‌లో కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్‌ కుమార్‌లతో దీక్ష విరమింపజేస్తున్న ఉత్తమ్‌ కుమార్‌రెడ్డి, జానారెడ్డి తదితరులు

సాక్షి, హైదరాబాద్‌: అధికార టీఆర్‌ఎస్‌ను గద్దె దింపి బొందబెట్టేంత వరకు తమ పోరాటం ఆగదని కాంగ్రెస్‌ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎస్‌.సంపత్‌ కుమార్‌ ప్రకటించారు. శాసనసభ నుంచి తమను బహిష్కరించినందుకు నిరసనగా గాంధీభవన్‌లో చేపట్టిన 48 గంటల ప్రజాస్వామ్య పరిరక్షణ నిరాహార దీక్షను గురువారం సాయంత్రం విరమించారు. టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్‌కుమార్‌రెడ్డి, సీఎల్పీ నేత జానారెడ్డి, పీఏసీ చైర్మన్‌ గీతారెడ్డి తదితరులు నిమ్మరసం ఇచ్చి దీక్షను విరమింపజేశారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి, సంపత్‌ భావోద్వేగంతో మాట్లాడారు. ‘గతంలో ఇదే గవర్నర్‌ను చేయిపట్టి గుంజి, ఆయన టేబుల్‌ ఎత్తుకెళ్లి, బెంచీలు ఎక్కి, మైకు విరిచిన వ్యక్తి హరీశ్‌రావు. కానీ మేం ఏమీ చేయకున్నా మమ్మల్ని సభ నుంచి బహిష్కరించే తీర్మానాన్ని ఆయన ప్రవేశపెట్టారు. ప్రజాస్వామ్యయుతంగా పనిచేసిన మమ్మల్ని టీఆర్‌ఎస్‌ ప్రభుత్వం దిగజారి బహిష్కరించింది. అందుకే ఆ పార్టీని అంతమొందించేంత వరకు పోరాడతాం’అని శపథం చేశారు. 

నా కుటుంబంపై పగబట్టారు: సంపత్‌ 
మరో ఎమ్మెల్యే సంపత్‌ మాట్లాడుతూ, కేసీఆర్‌కు దళితులు, బీసీలు, రెడ్లు అంటే భయం పట్టుకుందని, అందుకే వారి పట్ల విపరీత ధోరణితో వ్యవహరిస్తున్నారని విమర్శించారు. ‘టీఆర్‌ఎస్‌లో చేరాలని, డబ్బులు ఇస్తామని నాపై చాలాసార్లు ఒత్తిడి తెచ్చారు. నా భార్య ఉద్యోగంపై విచారణ జరిపారు. నా తమ్ముడి కాంట్రాక్టులను రద్దు చేశారు. అయినా వినకపోవడంతో ఎమ్మెల్యే సభ్యత్వాన్ని రద్దు చేశారు’అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. దేశంలో ఎక్కడా లేనంత దుర్మార్గ రాజకీయాలకు కేసీఆర్‌ పాల్పడుతున్నారని ధ్వజమెత్తారు. ప్రాణమున్నంత వరకు కాంగ్రెస్‌లోనే ఉంటానని, తాను మరణిస్తే కాంగ్రెస్‌ జెండా కప్పాలని కోరుకుంటున్నట్లు ఆవేశంగా మాట్లాడారు. సమావేశంలో మండలిలో విపక్ష నేత షబ్బీర్‌ అలీ, కాంగ్రెస్‌ కార్యనిర్వాహక అధ్యక్షుడు భట్టి విక్రమార్క, ఎమ్మెల్యేలు రేవంత్‌రెడ్డి, పద్మావతి, దొంతి మాధవరెడ్డి, రామ్మోహన్‌ రెడ్డి, చిన్నారెడ్డి, వంశీచంద్‌ రెడ్డి, పార్టీ నేతలు బలరాంనాయక్, మల్లు రవి తదతరులు పాల్గొన్నారు. కాంగ్రెస్‌ పార్టీ దీక్షకు టీజేఏసీ చైర్మన్‌ కోదండరాం, సీనియర్‌ పాత్రికేయులు దేవులపల్లి అమర్‌ సంఘీభావం ప్రకటించారు.

నోటీసులు ఇవ్వకుండా ఎలా బహిష్కరిస్తారు?: కోమటిరెడ్డి 
సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ, ‘కేసీఆర్‌కు తెలంగాణ సమాజం అంటే గిట్టదు. కేవలం ఒక సామాజిక వర్గం మనుషులు, తన కుటుంబం, కొంతమంది తప్ప రాష్ట్రంలోని 4 కోట్ల మంది అంటే ఆయనకు పడదు. గజ్వేల్‌ నియోజకవర్గంలో జనం చచ్చిపోతున్నా ఏనాడు వారి వంక చూడని కేసీఆర్‌.. నల్లగొండకు వచ్చి పోటీ చేయాలని ప్రయత్నిస్తున్నట్టు ప్రచారం జరుగుతోంది. అక్కడ కేసీఆర్‌ మొహానికి ఎవరూ ఓట్లేయరు. ఇటీవల నేను గజ్వేల్‌కు వెళ్లాను. అప్పటి నుంచి నాపై సీఎం కక్ష కట్టారు’అని ఆరోపించారు. ఓ సర్పంచ్‌ను సస్పెండ్‌ చేయాలంటేనే మూడుసార్లు నోటీసులిస్తారని, అలాంటిది ఓ ఎమ్మెల్యేలను ఎలాంటి నోటీసులు లేకుండా ఎలా బహిష్కరిస్తారని నిలదీశారు. తామంటే కేసీఆర్‌కు భయమని ఎద్దేవా చేశారు. కేసీఆర్‌కు దమ్ముంటే నల్లగొండకు వచ్చి తనపై పోటీ చేయాలని కోమటిరెడ్డి సవాల్‌ చేశారు. కేసీఆర్‌ అయినా ఆయన కుటుంబ సభ్యులైనా తనపై పోటీకి దిగితే ఓడిపోవడం ఖాయమన్నారు. మంత్రులంతా కలసి నల్లగొండలో తిష్ట వేసినా తనను అడ్డుకోలేరని, తాను ఓడిపోతే గాంధీభవన్‌ మెట్లు కూడా ఎక్కనని, రాజకీయాల నుంచి శాశ్వతంగా తప్పుకుంటానని స్పష్టం చేశారు. తన దీక్షకు మద్దతిచ్చిన ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు తెలిపారు. 

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement