
భువనగిరిలో వైఎస్ రాజశేఖరరెడ్డి విగ్రహానికి తిలకం దిద్దుతున్న కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి
సాక్షి, యాదాద్రి: టీఆర్‌ఎస్‌తో పాటు చాలా పార్టీల నుంచి ఆఫర్లు వస్తున్నా, కాంగ్రెస్ నుంచి మారే ఆలోచన లేదని ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. వైఎస్సార్ జయంతి సందర్భంగా గురువారం భువనగిరికి వచ్చిన ఆయన కొద్దిసేపు విలేకరులతో మాట్లాడారు. అన్ని అర్హతలు ఉన్న తనకు పీసీసీ అధ్యక్ష పదవి దక్కకపోవడంతో సీనియర్ నేతగా బాధతో ఆ రోజు అలా మాట్లాడానే తప్ప.. వేరే ఉద్దేశం లేదన్నారు.
తనకు పార్టీ మారడం, గ్రూపులు కట్టే అవసరం లేదన్నారు. ఎన్నికలకు సంవత్సరం ముందే అసెంబ్లీ స్థానాలకు టికెట్లు కేటాయించాలని సోనియా గాంధీని కోరుతానన్నారు. కొత్తగా పీసీసీ పదవులు చేపట్టిన నాయకులంతా వారి నియోజకవర్గంలోకి వెళ్లి ప్రజలతో కలసి వారి స్థానాలను గెలుచుకోవాలని కోరారు. వై.ఎస్. రాజశేఖరరెడ్డి మాదిరిగా ఇతరులను గెలిపించే దమ్మున్న నాయకుడు తనతో సహా ఎవరూ తెలంగాణలో లేరని అన్నారు.