సీఎల్‌పీ నేత కె. జానారెడ్డి
సాక్షి, హైదరాబాద్: కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, సంపత్ కమార్ శానససభా సభ్యత్వాల రద్దు విషయంలో కాంగ్రెస్ పార్టీ సరిగా స్పందించలేదన్న వాదనను సీఎల్‌పీ నేత కె. జానారెరెడ్డి తోసిపుచ్చారు. ఈ అంశంలో చేయాల్సిందంతా చేశామని చెప్పుకొచ్చారు. తన నివాసంలో శనివారం జరిగిన కాంగ్రెస్ పార్టీ శాసనసభాపక్ష అత్యవసర సమావేశంలో రాష్ట్రంలో సంభవించిన అకాల వర్షాలు, పంట నష్టం, తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు.
సమావేశానంతరం జానారెడ్డి మీడియాతో ఇష్టాగోష్ఠిగా మాట్లాడారు. ‘రాష్ట్రంలో తాజా పరిణామాలు, అకాల వర్షాలపై సమావేశంలో చర్చించాం. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్‌లను మేము పట్టించుకోవటం లేదన్నది అసత్యం. వారి కోసం అన్ని నియోజకవర్గాల్లో నిరసనలు చేశాం. అదే సమయంలో ప్లీనరీకి వెళ్ళాం. ఆ ఇద్దరు కూడా ప్లీనరీకి వచ్చారు కదా. ఇంకా ఏంచేయాల్సి ఉందో చెప్పండి. అభిషేక్ సింఘ్విని హైకోర్టుకి పిలిచింది పార్టీనే. ఆయనతో మాట్లాడింది కూడా నేనే. ప్లీనరీ కంటే ముందే రాహుల్ గాంధీ దృష్టికి ఈ అంశాన్ని తీసుకెళ్లాం. లా కమిటీ సభ్యుడితో కూడా మాట్లాడి సలహాలు తీసుకున్నాం. అభిషేక్ సింఘ్వితో మాట్లాడిన అంశాన్ని సంపత్, కోమటిరెడ్డికి కూడా వివరించా. రాహుల్ గాంధీ కూడా సింఘ్విని పిలిచి ఎమ్మెల్యేల కేసును చూడమని చెప్పారు.
పార్టీ పట్టించుకోవటం లేదని సంపత్, కోమటిరెడ్డిలు చేసుకునే ప్రచారం మాత్రమే. వాళ్ళ వ్యాఖ్యలు దృష్టిలో పెట్టుకుంటాం.. అనుమానాలు ఉంటే నివృత్తి చేస్తాం. ఫిరాయింపుదారులు రాజ్యసభ ఎన్నికల్లో కాంగ్రెస్‌కి వ్యతిరేకంగా ఓటేశారని సుప్రీంకోర్టులో సాక్ష్యంగా ఇస్తాం. కాంగ్రెస్‌కు 10 ఓట్లే ఉన్నాయని మాకు తెలుసు. గెలుస్తామని పోటీ పెట్టలేదు. పార్టీలో మార్పులు, చేర్పులు గురించి నాకు తెలియదు. తెలంగాణలో ఎన్నికలకు ఏడాది సమయం ఉంది.. పార్టీ కార్యాచరణ మరింత వేగం పెరుగుతుంది. ఎన్నికల నాటికి పార్టీ కార్యక్రమాలు ఉదృతం అవుతాయని నమ్ముతున్నా.
తెలంగాణ రాష్ట్రం ఆరు నెలల ముందే ఇచ్చి ఎన్నికలకు పోతే బాగుండేది అని భావన ఉంది. కానీ కేంద్రంలో 25 మంది ఎంపీలు బయటకు పోతే.. ప్రభుత్వమే పడిపోయేది. అపుడు తెలంగాణ రాకుండా పోయేదన్న చర్చ కూడా ఉంది. రాష్ట్రం ఏర్పాటుకు కాంగ్రెస్ చేసింది కరెక్టు. పార్టీ అధికారంలోకి రావాలని అందరం ప్రయత్నం చేస్తున్నాం. కొన్నిసార్లు టీమ్ లీడర్ సెంచరీ కొట్టినా మ్యాచ్ గెలవరు. కానీ లీడర్ 10 పరుగులు చేసినా ఒక్కొక్కసారి టీమ్ గెలుస్తుంది. మా స్పిరిట్ కూడా అంతే. ఎవరి స్థాయిలో వారు పని చేస్తున్నారు. జానారెడ్డి ముఖ్యమంత్రి కావాలని అనే వారున్నారు. నా కంటే ఎక్కువ అర్హత ఉంది అని ఎవరన్నా అనుకుంటే అందరూ ఒప్పుకోరు. మా అబ్బాయి ఎక్కడ నుంచి పోటీ చేయాలనే దానిపై అధిష్టానం నిర్ణయం తీసుకుంటుంది. ప్రజలు సీరియస్‌గా కాంగ్రెస్ గురించి ఆలోచించాలి. కర్ణాటకలో మళ్లీ మా పార్టీయే గెలుస్తుంద’ని జానారెడ్డి పేర్కొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment