నిలదీశారు... నిప్పులు చెరిగారు! | Congress Leaders fires on TRS Govt | Sakshi
Sakshi News home page

నిలదీశారు... నిప్పులు చెరిగారు!

Published Sun, May 6 2018 4:31 AM | Last Updated on Mon, Mar 18 2019 9:02 PM

Congress Leaders fires on TRS Govt - Sakshi

సీఎల్పీ భేటీకి హాజరైన టీపీసీసీ చీఫ్‌ ఉత్తమ్, కాంగ్రెస్‌ నాయకులు భట్టి, జీవన్‌ రెడ్డి, జానారెడ్డి, డీకే అరుణ తదితరులు

సాక్షి, హైదరాబాద్‌ : కాంగ్రెస్‌ శాసనసభా పక్ష సమావేశం(సీఎల్పీ) గరంగరంగా సాగింది. రాష్ట్రంలో పార్టీ అధినేతల తీరుపై ఎమ్మెల్యేలు నిప్పులు చెరిగారు. పలు అంశాలపై వారి వ్యవహారశైలిని నిలదీశారు. అధికార టీఆర్‌ఎస్‌ను ఎదుర్కొనే విషయం, పార్టీ ఎమ్మెల్యేలను అసెంబ్లీ నుంచి బహిష్కరించిన ఘటనలో పార్టీ నాయకత్వం వ్యవహరిస్తున్న తీరుపై అసంతృప్తి వ్యక్తం చేశారు. శనివారం సీఎల్పీ నేత జానారెడ్డి నివాసంలో గంటన్నరపాటు సీఎల్పీ భేటీ జరిగింది. విశ్వసనీయ సమా చారం ప్రకారం... ‘ఇద్దరు ఎమ్మెల్యేలను కాపాడలేకపోయారు. రాష్ట్రాన్ని ఏం కాపాడుతారు. కార్యకర్తల్లో ధైర్యం ఎలా నింపుతారు’ అని సంపత్‌ నిలదీశారు. ఉత్తమ్, జానా, భట్టి, షబ్బీర్‌ లాంటి పెద్ద తలకాయలను అసెంబ్లీ నుంచి గెంటేస్తే ఏమీ చేయలేకపోయారని, పార్టీ నాయకత్వం తీరు మార్చుకోకపోతే కార్య కర్తల్లో నమ్మకం కోల్పోతామన్నారు. ‘మమ్మల్ని కాపాడలేకపోయారు. మిమ్మల్ని మీరు కాపాడుకోలేకపోయారు. ఇక, కార్యకర్తలను ఏం కాపాడతారు’ అని కూడా ఆయన అనడంతో సీఎల్పీ సమావేశం వేడెక్కింది. అయితే, ఉత్తమ్, జానా సర్దిచెప్పేందుకు యత్నించినా సంపత్‌ వ్యాఖ్య లకు మద్దతిస్తూ కొందరు ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు మాట్లాడటం గమనార్హం.
 
నిలువరించలేక పోతున్నాం... 
సీఎం కేసీఆర్‌ అండ్‌ టీం యథేచ్ఛగా వ్యవహరిస్తున్నా ప్రధాన ప్రతిపక్షంగా వారిని నిలు వరించడంలో విఫలమవుతున్నామని పలువురు ఎమ్మెల్యేలు అసంతృప్తి వ్యక్తం చేశారు. ‘రాష్ట్రంలో  రైతులు కష్టాల్లో ఉన్నారు. ఉద్యోగాల్లేవు, డబుల్‌బెడ్‌రూం ఇళ్లు లేవు. ఇసుక మాఫి యా చెలరేగిపోతోంది. ప్రాజెక్టుల పేరుతో వేలకోట్లు దోచుకుంటున్నారు. నల్లగొండ, ఖమ్మం జిల్లాల్లో కాంగ్రెస్‌ కార్యకర్తలు రాజకీయ హత్యలకు గురయ్యారు. ఇవన్నీ ప్రజల్లోకి తీసుకెళ్లడంలో మనం ఎలా వ్యవహరిస్తున్నామన్న దానిపై పునరాలోచన చేయాలి. యుద్ధం పకడ్బందీగా చేయకపోతే కేసీఆర్‌ లాంటి వ్యక్తిని ఎదుర్కోగలమా? ప్రెస్‌మీట్లు పెట్టి తూతూ మంత్రపు హెచ్చరికలు చేస్తే సరిపోతుందా? ఎమ్మెల్యేల సస్పెన్షన్‌ విషయంలో రాష్ట్రాన్ని దిగ్బంధం చేయాల్సింది.  తూతూమంత్రం కార్యక్రమాలతో ఏం సాధిస్తాం.?’అని పలువురు వ్యాఖ్యానిస్తూ నిలదీశారు.
 
నన్నూ అవమానపర్చారు 
ప్రోటోకాల్‌ విషయంలో పార్టీ ఎమ్మెల్యేలకు అడుగడుగునా అవమానాలు జరుగుతున్నాయనే చర్చ సీఎల్పీ సమావేశంలో జరిగింది. అధికార పార్టీ నేతలు ఏకపక్షంగా అభివృద్ధి కార్యక్రమాల్లో పాల్గొంటున్నారని, ఈ విషయంలో స్పీకర్‌ చొరవ తీసుకోవాలని సమావేశం అభిప్రాయపడింది. పార్టీ వర్కింగ్‌ ప్రెసిడెంట్‌ మల్లు భట్టి విక్రమార్క మాట్లాడుతూ తన నియోజకవర్గంలోనూ తనను అవమానపర్చారని, సమాచారం సరిగా ఇవ్వకుండా నలు గురు మంత్రులు వచ్చి మధిరలో అభివృద్ధి కార్యక్రమాలు ప్రారంభించి వెళ్లారని పేర్కొన్నారు. పునర్విభజన చట్టంలోని అంశాలను నెరవేర్చాలంటూ తాను సుప్రీంకోర్టుకు వెళ్లానని, కేసు అడ్మిట్‌ అయి ఇప్పటికి రెండుసార్లు విచారణ జరిగినా పార్టీ పక్షాన ఎందుకు పట్టించుకోవడం లేదని పొంగులేటి ప్రశ్నించినట్టు సమాచారం. కొంతమందికి అసెంబ్లీకి వచ్చే వీలు లేకపోతే గాంధీభవన్‌లో సీఎల్పీ సమా వేశం పెట్టాల్సిందని, జానా నివాసంలో పెట్టి కొత్త సంప్రదాయానికి తెరతీశారని కొందరు వ్యాఖ్యానించినట్టు సమాచారం.  

రైతాంగాన్ని కార్యకర్తలు ఆదుకోవాలి 
అకాల వర్షాల వల్ల నష్టపోయిన రైతాంగాన్ని అన్ని విధాలా ఆదుకునేందుకు కాంగ్రెస్‌ పార్టీ శ్రేణులు ముందుకు రావాలని సీఎల్పీ సమావేశం కోరింది. ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి, సంపత్‌ల వ్యవహారంలో హైకోర్టు తీర్పును వెంటనే అమలు చేయాలని ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేసింది. ప్రోటోకాల్‌ అమలు విషయంలో స్పీకర్‌ చొరవ తీసుకోవాలని, లేనిపక్షంలో తాము వేరే మార్గం వెతుక్కోవాలని సీఎల్పీ నిర్ణయించింది. జానారెడ్డి అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో ఉత్తమ్, షబ్బీర్‌ అలీ, భట్టి విక్రమార్కతోపాటు జీవన్‌రెడ్డి, డి.కె.అరుణ, వంశీచందర్‌రెడ్డి, పద్మావతి, ఎమ్మెల్సీ ఆకుల లలితలు పాల్గొన్నారు.  

అసంతృప్తితో అమెరికాకు కోమటిరెడ్డి
టీఆర్‌ఎస్‌ ప్రభుత్వ వైఫల్యాలను ఎత్తి చూపే క్రమంలో శాసనసభలో మైక్‌ విసిరేసిన ఘటనకు సంబంధించి తనతోపాటు మరో ఎమ్మెల్యే సంపత్‌ను బహిష్కరిస్తే టీపీసీసీ, సీఎల్పీ నామమాత్రంగానైనా పట్టించు కోకపోవడంపై నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తీవ్ర అసంతృప్తితో ఉన్నారు. పీసీసీ, సీఎల్పీ నాయకత్వాల తీరుకు నిరసనగానే ఆయన అమెరికా వెళ్లినట్లు సన్నిహితులు చెప్పారు. తమ గన్‌మెన్‌లను తొలగించినా ఉత్తమ్, జానారెడ్డి కనీసం పట్టించుకో లేదని ఆయన ఆవేదన చెందుతున్నారు. నల్లగొండ మున్సిపల్‌ చైర్‌పర్సన్‌ భర్త శ్రీనివాస్‌ను హతమార్చడం, ఒక టీఆర్‌ఎస్‌ ఎమ్మెల్యే రౌడీలతో నల్లగొండలో రాజకీయం చేయాలని చూడటం వంటి పరిణామాల నేపథ్యంలో తనకు ప్రభుత్వం భద్రతను తొలగించిందని కోమటిరెడ్డి ఆరోపించారు.   

No comments yet. Be the first to comment!
Add a comment

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement