
సాక్షి, హైదరాబాద్: కాంగ్రెస్ ఎమ్మెల్యేలు కోమటిరెడ్డి వెంకటరెడ్డి, ఎస్.ఎ.సంపత్‌కుమార్‌ల అసెంబ్లీ బహిష్కరణ రద్దు తీర్పుపై అప్పీల్ దాఖలుకు టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలకు అనుమతివ్వాలా, వద్దా అన్న అంశంపై వాదనలు ముగిశాయి. దీనిపై నిర్ణయాన్ని తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్‌రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ కొంగర విజయలక్ష్మిలతో కూడిన ధర్మాసనం వాయిదా వేసింది. కోమటిరెడ్డి, సంపత్‌లను బహిష్కరిస్తూ అసెంబ్లీ చేసిన తీర్మానాన్ని, వారు ప్రాతినిధ్యం వహిస్తున్న అసెంబ్లీ నియోజకవర్గాలు ఖాళీ అయినట్టు జారీ చేసిన నోటిఫికేషన్‌ను రద్దు చేస్తూ సింగిల్ జడ్జి జస్టిస్ శివశంకరరావు ఇటీవల తీర్పునిచ్చారు.
దాన్ని సవాలు చేస్తూ 12 మంది టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు అప్పీల్ దాఖలు చేశారు. సింగిల్ జడ్జి వద్ద దాఖలైన వ్యాజ్యంలో వారు ప్రతివాదులు కాదు గనుక నిబంధనల మేరకు అప్పీల్ దాఖలుకు కోర్టు అనుమతి కోరుతూ అనుబంధ పిటిషన్ దాఖలు చేశారు. అప్పీల్‌కు అనుమతిపై ధర్మాసనం విచారణ జరిపింది. సుప్రీంకోర్టు సీనియర్ న్యాయవాదులు వైద్యనాథన్ టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేల తరఫున, అభిషేక్ మను సింఘ్వీ కోమటిరెడ్డి తరఫున వాదనలు వినిపించారు. సింగిల్ జడ్జి తీర్పుపై స్పీకర్ లేదా అసెంబ్లీ కార్యదర్శి అప్పీల్ దాఖలు చేయాలడం సరికాదని బుధవారం వైద్యనాథన్ వాదించారు.
Comments
Please login to add a commentAdd a comment