సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో రాజకీయాలు వేడెక్కుతున్నాయి. అసెంబ్లీ ఎన్నికలకు ఇంకా ఏడాదిన్నర గడువు ఉన్నప్పటికీ.. బీజేపీ దూకుడు కారణంగా ప్రధాన పారీ్టలన్నింటి మధ్యా నువ్వా నేనా అన్న ట్టుగా యుద్ధం సాగుతున్న పరిస్థితి మొదలైంది. మునుగోడు ఎమ్మెల్యే రాజగోపాల్‌రెడ్డి కాంగ్రెస్ పారీ్టకి, ఎమ్మెల్యే పదవికి రాజీనామా చేస్తున్నానని, బీజేపీలో చేరుతానని ప్రకటించడం మరింత వేడిని పెంచింది. అసెంబ్లీకి ముందస్తు ఎన్నికలు వస్తాయన్న ఊహాగానాలతోనూ అగ్గి రాజుకుంది. అధికార టీఆర్‌ఎస్‌తోపాటు కాంగ్రెస్, బీజేపీలతో ముక్కో ణపు పోటీ నెలకొంటుండటంతో.. నేతలు తమకు అనుకూలంగా ఉండే రాజకీయ పార్టీల వైపు దృష్టి సారిస్తున్నట్టు రాజకీయ విశ్లేషకులు చెబుతున్నారు. అధికార టీఆర్‌ఎస్‌తోపాటు ప్రతిపక్ష కాంగ్రెస్ నుంచి కూడా గణనీయ సంఖ్యలో నాయకులు బీజేపీలోకి వెళ్లేందుకు సిద్ధమవుతున్నారని అంటున్నారు.
బీజేపీ ఆకర్ష్ వేగవంతం..
తెలంగాణలో ఎట్టి పరిస్థితుల్లోనూ అధికారం సాధించడమే లక్ష్యంగా బీజేపీ ప్రత్యేకంగా ఫోకస్ చేసింది. ఈ క్రమంలోనే హైదరాబాద్‌లో బీజేపీ జాతీయ కార్యవర్గ సమావేశాలు నిర్వహించింది. తెలంగాణలో అధికారం సాధిస్తామని ప్రకటించింది. తర్వాత కూడా వరుస పెట్టి జాతీయ నేతలతో పర్యటనలు చేయిస్తోంది. పార్టీ జాతీయ నేతల దిశానిర్దేశం, మద్దతుతో రాష్ట్ర బీజేపీ ఆపరేషన్ ఆకర్‡్షను వేగవంతం చేసింది. పారీ్టలో చేరేందుకు సిద్ధంగా ఉన్న టీఆర్‌ఎస్, కాంగ్రెస్ నాయకుల జాబితాను పార్టీ చేరికల కమిటీ ఇప్పటికే సిద్ధం చేసుకుందని.. జాతీయ నాయకత్వం ఆమోదం కోసం ఎదురుచూస్తోందని బీజేపీ వర్గాలు చెప్తున్నాయి. బీజేపీ రాష్ట్ర నేతలు సోమవారమే జాతీయ నాయకులతో సమావేశం కావాల్సి ఉన్నా.. పలు కారణాలతో వాయిదా పడినట్టు తెలిసింది. ఒకట్రెండు రోజుల్లోనే పార్టీ చేరికల కమిటీ కన్వీనర్ ఈటల రాజేందర్, జాతీయ ఉపాధ్యక్షురాలు డికే అరుణ, పార్టీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌చార్జి తరుణ్ చుగ్ తదితరులు పార్టీ జాతీయ అధ్యక్షుడు నడ్డాను కలిసి.. చేరికలపై ఆమోదముద్ర వేయించుకోనున్నట్టు సమాచారం.
కాంగ్రెస్‌కు వరుస దెబ్బల నేపథ్యంలో..
కొన్నేళ్ల నుంచి వరుసగా ఎదురుదెబ్బలు తింటున్న నేపథ్యంలో కాంగ్రెస్‌పై నేతల ఆసక్తి తగ్గిపోయిందనే అభిప్రాయం నెలకొంది. ఇటీవలి ఐదు రాష్ట్రాల ఎన్నికల్లో ఓటమితో కాంగ్రెస్ పుంజుకునే అవకాశాలు లేవనే ప్రచారం మొదలైంది. తాజాగా నేషనల్ హెరాల్డ్ కేసులో ఈడీ సోనియా గాం«దీ, రాహుల్ గాం«దీలను విచారించడం ఆ పార్టీ శ్రేణుల్లో నైరాశ్యం నింపింది. దీంతో కాంగ్రెస్‌లో కొనసాగుతున్న నేతల్లో ఊగిసలాట మొదలైందని.. బయటి నుంచి కాంగ్రెస్‌లో చేరేందుకూ ఇతర పార్టీల నేతలు సంశయిస్తున్నారని రాజకీయ వర్గాలు చెబుతున్నాయి. ఈ క్రమంలోనే అధికార టీఆర్‌ఎస్‌లోని అసంతృప్తులు, రాష్ట్రంలో, ఇతర రాష్ట్రాల్లో వ్యాపారాలున్న బలమైన నేతలను చేర్చుకునే దిశగా బీజేపీ పావులు కదుపుతోందని అంటున్నాయి. ఈ క్రమంలోనే రాజగోపాల్‌రెడ్డిని త్వరగా పార్టీలో చేరేలా ఒప్పించినట్టు సమాచారం. పక్షం రోజుల తర్వాత నిర్ణయం చెబుతానన్న రాజగోపాల్‌రెడ్డి.. ఆ మరునాడే రాజీనామా ప్రకటన చేశారని తెలిసింది.
ఇద్దరు ఎంపీలు...
రాజగోపాల్‌రెడ్డి చేరిక తర్వాత ఇదే ఊపును కొనసాగించాలని బీజేపీ భావిస్తోంది. అధికార టీఆర్‌ఎస్ నుంచి ఇద్దరు ఎంపీలను చేర్చుకునేందుకు బీజేపీ ప్రయతి్నస్తోందని, ఆ ఇద్దరూ వ్యాపారవేత్తలేనని రాజకీయ వర్గాల సమాచారం. ఇక గతంలో మంత్రిగా పనిచేసి ప్రస్తుతం ఎమ్మెల్సీగా ఉన్న నాయకుడినీ చేర్చుకునేందుకు కసరత్తు జరుగుతున్నట్టు తెలిసింది. ఉమ్మడి వరంగల్ జిల్లా మంత్రి ఎర్రబెల్లి దయాకర్‌రావు సోదరుడు మంత్రి ఎర్రబెల్లి ప్రదీప్‌రావు కూడా బండి సంజయ్ ప్రజాసంగ్రామ యాత్ర సందర్భంగా జాతీయ నేతల సమక్షంలో కషాయ కండువా కప్పుకోనున్నట్టు సమాచారం. అదే జిల్లాకు చెందిన మాజీ ఎంపీ, ఇటీవల టీఆర్‌ఎస్‌కు రాజీనామా చేసిన రాజయ్య కూడా బీజేపీ తీర్థం పుచ్చుకోనున్నట్టు చెబుతున్నారు. కరీంనగర్ జిల్లాలో దళిత సామాజిక వర్గానికి ఓ మాజీ ఎమ్మెల్యే, ఉమ్మడి మహబూబ్‌నగర్ జిల్లాలోని ప్రస్తుత ఎమ్మెల్యే, మాజీ మంత్రి బీజేపీ వైపు చూస్తున్నట్టు సమాచారం. కాంగ్రెస్ నుంచి కూడా కొందరు నేతలను చేర్చుకోవడంపై దృష్టి పెట్టినట్టు తెలిసింది. బీజేపీ నేతలతో టీఆర్‌ఎస్ నాయకుల భేటీలపై గులాబీ పెద్దలు నిఘా పెట్టిన నేపథ్యంలో గుట్టుగా ఆకర్ష్ ఆపరేషన్ సాగుతున్నట్టు సమాచారం.
మునుగోడు.. 3 పార్టీలకూ కీలకం
రాజగోపాల్‌రెడ్డి రాజీనామాతో మునుగోడు నియోజకవర్గానికి జరిగే ఉప ఎన్నిక మూడు ప్రధాన పార్టీకు కీలకం కానుంది. రాజగోపాల్‌రెడ్డి స్పీకర్‌కు రాజీనామా పత్రం ఎప్పుడిస్తారు? స్పీకర్ వెంటనే ఆమోదిస్తారా, జాప్యం చేస్తారా అన్నదానిపై ఇంకా ఉత్కంఠ నెలకొంది. రాజీనామా ఆమోదం పొందిన తర్వాతే ఉప ఎన్నిక ఎప్పుడు జరగవచ్చనే దానిపై స్పష్టత రానుంది.
- కాంగ్రెస్‌కు ఇది సిట్టింగ్ సీటు, కేడర్ బలంగా ఉన్న నియోజకవర్గం కూడా. అయినా ప్రస్తుతం ఇక్కడ కాంగ్రెస్ పరిస్థితి ఇబ్బందికరంగా ఉన్నట్టు అభిప్రాయం వ్యక్తమవుతోంది. నల్లగొండ జిల్లా కాంగ్రెస్‌కు కంచుకోట అని, ఇక్కడ హుజూరాబాద్ తరహా ఫలితం పునరావృతం కాకుండా చూడాలన్న కృతనిశ్చయంతో ఆ పార్టీ నేతలు ఉన్నారు.
- హుజూరాబాద్, దుబ్బాక ఉప ఎన్నికల తరహాలో మునుగోడులోనూ చరిత్ర సృష్టించాలని బీజేపీ భావిస్తోంది. ఉప ఎన్నికల హ్యాట్రిక్ విజయం ద్వారా వచ్చే అసెంబ్లీ ఎన్నికలకు మార్గం సుగమం చేసుకోవడంతోపాటు, టీఆర్‌ఎస్‌కు ప్రత్యామ్నాయం తామేనన్న ప్రచారాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లడానికి ఇది ఉపయోగపడుతుందని భావిస్తోంది.
- ఎట్టిపరిస్థితుల్లోనూ మునుగోడులో విజయం సాధించాలని.. తద్వారా తమ బలం ఏమాత్రం తగ్గలేదని, బీజేపీది వాపే తప్ప బలుపు కాదనే ప్రచారాన్ని జనంలోకి తీసుకెళ్లాలని అధికార టీఆర్‌ఎస్ భావిస్తోంది.
Comments
Please login to add a commentAdd a comment