
సాక్షి, నల్లగొండ: ముందస్తు ఎన్నికల ప్రచారంలో జోరుమీదున్న టీఆర్‌ఎస్ పార్టీ గురువారం నల్లగొండ జిల్లాలో భారీ బహిరంగ సభ నిర్వహించబోతోంది. నిజామాబాద్‌లో సభతో పూర్తిస్థాయిలో ఎన్నికల ప్రచారభేరీని మోగించిన కేసీఆర్.. నల్లగొండ సభతో గులాబీ శ్రేణుల్లో మరింత ఊపు తేవాలని భావిస్తున్నారు. ఇందూరు సభలో ప్రతిపక్ష మహాకూటమి, కాంగ్రెస్, చంద్రబాబులపై నిప్పులు చెరిగిన సంగతి తెలిసిందే.
ఒకవైపు నల్లగొండలో టీఆర్‌ఎస్ ప్రజా ఆశీర్వాద సభకు సర్వం సిద్ధమైన నేపథ్యంలో ఆ పార్టీపై కాంగ్రెస్ సీనియర్ నేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శనాస్త్రాలు సంధించారు. కేసీఆర్ చేసేదంతా మోసమేనని, నల్లగొండ సభకు ప్రజలు రారనే ఉద్దేశంతోనే చిన్న గ్రౌండ్‌లో సభ ఏర్పాటు చేశారని విమర్శించారు. నిజామాబాద్ సభలోలాగా పిచ్చిపిచ్చిగా కేసీఆర్ మాట్లాడితే నల్లగొండలోని 12 స్థానాల్లోనూ డిపాజిట్లు కోల్పోవడం ఖాయమని జోస్యం చెప్పారు.