నేరేడుచర్ల, న్యూస్‌లైన్ : ప్రజల మనసు గెలిచిన వారే నిజమైన నాయకుడని నల్లగొండ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకటరెడ్డి అన్నారు. గురువారం నేరేడుచర్లలో జరిగిన ఓ శుభకార్యానికి కోమటిరెడ్డి హాజరయ్యారు.
ఈ సందర్భంగా పట్టణ కూడలిలో కార్యకర్తలనుద్ధేశించి ఆయన మాట్లాడారు. తెలంగాణ కోసం ప్రాణాలను త్యాగం చేస్తున్న విద్యార్థి అమరులను చూసి చలించి తన మంత్రి పదవిని తృణప్రాయంగా వదలి 11రోజులు ఆమరణ నిరాహార దీక్ష చేశానన్నారు. తాను వదలివేసిన మంత్రి పదవిని తీసుకున్న వారు రౌడీలతో తనను అడ్డుకునే ప్రయత్నం చేయడం ఎంతవరకు సమంజసమన్నారు. సొంత పార్టీకి చెందిన నాయకులు వివాహానికి హాజరయ్యేందుకు వస్తే రౌడీలతో అడ్డగించడం చూస్తే మనం హుజుర్‌నగర్ నియోజకవర్గంలో ఉన్నామా.. పాకిస్తాన్‌లో ఉన్నామా.. అన్నది అర్థం కావడం లేదన్నారు.
పోలీసులను, రౌడీలను అడ్డుపెట్టుకొని రాజకీయాలు చేసేవారు కనుమరుగు కావడం ఖాయమన్నారు. దాడులు చేయించడం తన నైజం కాదని, పేదవారికి ఆర్థిక సహాయం చేయడం, పేద పిల్లలను చదివించడం, అభివృద్ధి పనులు చేయడం మాత్రమే తనకు తెలుసన్నారు. తనను నేరేడుచర్ల రాకుండా 40మందితోని అడ్డుకుంటే మంత్రి ఉత్తమ్ హైదరాబాద్ పోకుండా 4 లక్షల మందితో అడ్డుకోవడం పెద్ద పనికాదన్నారు.
తాను వదిలేసిన మంత్రి పదవి పొందడం వల్లే నియోజకవర్గంలో పలు అభివృద్ధి పనులు జరిగాయన్నారు. హుజుర్‌నగర్ నియోజకవర్గంలో మంత్రి ఉత్తమ్ నియంతృత్వ పోకడలతో నాయకులు, ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతన్నారన్నారు. రాత్రి వేళ్లలో నాయకులను, అధికారులను బెదిరించడం నాయకుని లక్షణమా అన్నారు. రానున్న ఎన్నికలలో 50 వేల మెజారీటితో గెలుస్తానని గొప్పలు చేప్పుకునే వారిని 50వేల ఓట్ల తేడాతో ప్రజలు ఓడించడానికి సిద్ధంగా ఉన్నారన్నారు. ఇలాంటి నాయకులు ఎన్నుకున్నందుకు ప్రజలు సిగ్గుపడుతున్నారన్నారు.
వచ్చే ఎన్నికలలో ఇలాంటి నాయకులకు తగిన రీతిలో ప్రజలు బుద్దిచెప్పాలన్నారు. దేవుని దయతో తెలంగాణ అమరవీరులు, తాను చేసిన త్యాగాల ఫలితంగా తెలంగాణ రాష్ట్రం సిద్ధించడం తెలంగాణవాదుల విజయమన్నారు. 4కోట్ల తెలంగాణ ప్రజల అకాంక్షను నేరవేర్చేందుకే సోనియాగాంధీ ఇచ్చిన మాట నిలబెట్టుకున్నారన్నారు. కోమటిరెడ్డి వెంట నాయకులు గుమ్ముల మోహన్‌రెడ్డి, చింతకుంట్ల రవీందర్‌రెడ్డి, మోతీలాల్, కొణతం సీతరాంరెడ్డి, గుండ్ర శ్రీనివాస్‌రెడ్డి తదితరులు ఉన్నారు.
ప్రజల మనసు గెలిచినవాడే నాయకుడు
Published Fri, Feb 21 2014 4:01 AM | Last Updated on Sat, Sep 2 2017 3:55 AM
Advertisement
Advertisement