మంగళవారం తిరుమలగిరిలో జరిగిన జనహిత సభలో మాట్లాడుతున్న హరీశ్. చిత్రంలో జగదీశ్‌రెడ్డి, నర్సయ్యగౌడ్ తదితరులు
సాక్షి ప్రతినిధి, సూర్యాపేట: ‘కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉంటే కాళేశ్వరం కట్టేదా, మొబిలైజేషన్ అడ్వాన్సులు, సర్వేలు, డిజైన్ల పేరుతో నిధులను దిగమింగారు. అధికారం ఉన్నా, లేకున్నా వారికి కుర్చీల కోసమే కొట్లాట. ఉత్తమ్‌కుమార్‌రెడ్డిని పీసీసీ పదవి నుంచి దించి తాను పీసీసీ అధ్యక్షుడిని అవుతానని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి, ఎమ్మెల్యే డీకే అరుణ కొట్లాడుతున్నారు. ప్రజలు పచ్చగా ఉండటం వారికి పట్టదు. వారి ఇల్లు, కుటుంబం పచ్చగా ఉండాలన్నదే కాంగ్రెస్ సిద్ధాంతం’అని కాంగ్రెస్‌పై భారీ నీటిపారుదల మంత్రి హరీశ్‌రావు ధ్వజమెత్తారు.
మంగళవారం విద్యుత్‌శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డితో కలసి ఉదయం 10 గంటల నుంచి రాత్రి పొద్దుపోయే వరకు సూర్యాపేట జిల్లాలోని సూర్యాపేట, కోదాడ, తుంగతుర్తి నియోజక వర్గాల్లో ఎస్సారెస్పీ స్టేజ్–2 కాల్వ పనులను పరిశీలించారు. అనంతరం ఎమ్మెల్యే గాదరి కిశోర్ అధ్యక్షతన తిరుమలగిరిలో ఏర్పాటు చేసిన జనహిత సభలో మంత్రి హరీశ్ మాట్లాడారు. ‘కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు నాడు నీలం తుపాన్ వల్ల నల్లగొండ జిల్లాకు నష్టం జరిగింది. అప్పట్లో గుంటూరు, కృష్ణా జిల్లాలకు నీలం తుపాన్ పరిహారం ఇచ్చారు. కానీ నల్లగొండకు ఒక్క రూపాయి కూడా ఇవ్వలేదు. నాడు మంత్రులుగా ఉన్న జానారెడ్డి, ఉత్తమ్‌కుమార్‌రెడ్డి ఈ పంట పరిహారంపై కిరణ్‌కుమార్‌రెడ్డిని అడగలేదు. ఇద్దరు నేతలు ఎస్సారెస్పీ కాల్వ గట్లపై ఏనాడైనా తిరిగారా. నాడు పనులు ఆలస్యం కావడంపై ఎప్పుడైనా అధికారులతో చర్చించారా’అని ప్రశ్నించారు.
కాళేశ్వరంతో సూర్యాపేట సస్యశ్యామలం
కాళేశ్వరం నీళ్లతో తొలి ఫలితం సూర్యాపేట జిల్లాకే దక్కుతుందని మంత్రి హరీశ్‌రావు పేర్కొన్నారు. తొలుత కాళేశ్వరం నుంచి 26 టీఎంసీలు మిడ్‌మానేరుకు అక్కడ నుంచి కరీంనగర్ జిల్లా లోయర్ మానేరుకు అక్కడి నుంచి వరంగల్, సూర్యాపేట జిల్లాలకు ఈ నీళ్లు వస్తాయన్నారు. కోదాడ, సూర్యాపేట నియోజకవర్గాల్లో అవసరమైన చోట్ల రిజర్వాయర్లు కట్టడానికి ఆన్‌లైన్ సర్వే కోసం ఉత్తర్వులు జారీ చేస్తామని తెలిపారు.
‘అసెంబ్లీ అంటే కాంగ్రెస్ పారిపోతుంది’
అసెంబ్లీలో ప్రజా సమస్యలు చర్చించకుండా కాంగ్రెస్ పార్టీ నాయకులు పారిపోతున్నారని, చర్చలకు రమ్మన్నా రావడం లేదని మంత్రి జగదీశ్‌రెడ్డి విమర్శించారు. గ్రామాల్లో కాంగ్రెస్ నాయకులు అసత్యాలను ప్రచారం చేస్తూ ఉత్తమ్ బాబా 48 మంది దొంగల గుంపుతో యాత్రలు చేస్తున్నారన్నారు. ఈ సభలో భువనగిరి ఎంపీ బూర నర్సయ్యగౌడ్, స్థానిక ఎమ్మెల్యే గాదరి కిశోర్‌కుమార్, నకిరేకల్ ఎమ్మెల్యే వేముల వీరేశం, అటవీ అభివృద్ధి సంస్థ చైర్మన్ బండా నరేందర్‌రెడ్డి, గిడ్డంగు సంస్థ చైర్మన్ మందుల సామేలు పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment