
సాక్షి ప్రతినిధి, సూర్యాపేట: రాష్ట్రంలో ఈ సారి కంది పంట బాగా పండిందని, కానీ వీటిని కొనే దిక్కులేకపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారని సీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కందులకు గిట్టుబాటు ధర లేక రైతులకు పంట సాగు ఖర్చు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు.
కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో తమ బతుకులు బాగు పడతాయని రైతులు ఆశించారని, వారి ఆశలు అడియాసలయ్యాయన్నారు. కేవలం కేసీఆర్ కుటుంబంలోని నలుగురి బతుకులు మాత్రమే బాగున్నాయని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రైతులకు ఒకే సారి రూ.లక్ష రుణమాఫీ అయ్యిందని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం రూ.లక్షను ఆరు విడతలుగా మాఫీ చేయడంతో అది వడ్డీకే సరిపోలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.2 లక్షల వరకు ఒకే సారి రుణ మాఫీ చేస్తామన్నారు.
జగదీశ్‌రెడ్డిని మంత్రిగా గుర్తించడం లేదు..
జగదీశ్‌రెడ్డిని మంత్రిగా జిల్లా ప్రజలు గుర్తించడం లేదని, ఆయనకు జిల్లా మీద ఏమాత్రం అవగాహన లేదని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆరే జగదీశ్‌రెడ్డిని మంత్రిగా గుర్తించడం లేదన్నారు. విద్యుత్ శాఖకు అవార్డులు వస్తే సీఎం ఆ శాఖ సీఎండీ ప్రభాకర్‌రావుకు స్వీట్లు తినిపించడమే ఇందుకు నిదర్శమన్నారు. గతంలో జరిగిన నూకా భిక్షం, మదన్‌మోహన్‌రెడ్డి హత్యకేసుల్లో మంత్రి ఉన్నారని, హత్యా రాజకీయాలను జగదీశ్‌రెడ్డి ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు.
నాగారంలో వార్డు సభ్యుడిని గెలిపించుకోలేని సత్తా లేని వ్యక్తి తనను, జానారెడ్డి, దామోదర్‌రెడ్డి లాంటి సీనియర్ నేతలను విమర్శించే స్థాయి లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో తన అంచనా ప్రకారం జగదీశ్‌రెడ్డికి టికెట్ రాదని, వచ్చినా డిపాజిట్ గల్లంతు అవుతుందని వెంకట్‌రెడ్డి జోస్యం చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment