సాక్షిప్రతినిధి, నిజామాబాద్: ఉమ్మడి జిల్లాలో జల జగడం కొనసాగుతోంది. రైతుల నీటి కష్టాలను తమకు అనుకూలంగా మార్చుకునేందుకు అన్ని ప్రతిపక్ష పార్టీలు ప్రయత్నిస్తున్నాయి. అన్నదాతలకు మద్దతుగా ఆందోళనలు చేపట్టడం ద్వారా ప్రభుత్వాన్ని ఇరుకున పెట్టే ప్రయత్నం చేస్తున్నాయి. ఎన్నికలు దగ్గర పడుతున్న నేపథ్యంలో ఎంతో కొంత లబ్ధి చేకూరుతుందని భావిస్తున్నాయి. కాకతీయ కాలువకు నీటిని విడుదల చేయాలని రైతు లు పది రోజుల క్రితం ఆందోళన చేపట్టారు. ఒక్క తడి ఇచ్చినా తమ పంటలు గట్టెక్కుతాయని, నీటి ని ఇవ్వాలని కోరుతూ పలుమార్లు ఎస్సారెస్పీ కా ర్యాలయాన్ని ముట్టడించారు. రైతులకు మద్దతు గా ప్రతిపక్ష పార్టీలు రంగంలోకి దిగాయి.
రైతుల సాగునీటి సమస్యను ఒక అవకాశంగా భావించి ప్రభుత్వంపై ఒత్తిడి పెంచుతున్నాయి. వారం రోజులుగా ధర్నాలు, రాస్తారోకోలు నిర్వహిస్తున్నారు. జిల్లాలో అఖిలపక్షంగా ఏర్పడిన కాంగ్రెస్, బీజేపీ, వామపక్ష పార్టీలు శుక్రవారం చలో ఎస్సా రెస్పీ కార్యక్రమానికి శ్రీకారం చుట్టాయి. కాకతీయ కాలువకు అర టీఎంసీ నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కేంద్రం నుంచి ఆయకట్టు రైతుల గ్రామాలకు తరలివెళ్లాలని నిర్ణయించాయి. మరోవైపు ఆయా పార్టీల రాష్ట్ర స్థాయి నేతలు కూడా రైతుల సమస్యలపై స్పందిస్తున్నారు. శనివారం బీజేపీ ఎమ్మెల్యేలు, ముఖ్య నేతలు ఎస్సారెస్పీ ఆయకట్టు రైతులకు మద్దతు తెలిపేందుకు జిల్లాకు వచ్చారు.
బాధిత రైతులను పరామర్శించేందుకు వెళ్తున్న కాంగ్రెస్ పార్టీ కిసాన్ కేత్ రాష్ట్ర నేతలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. ఇ లా పది రోజులుగా జిల్లాలో ప్రతిపక్ష పార్టీల నేత ల ఆందోళనలతో జిల్లాలో రాజకీయం వేడెక్కింది. ప్రతిపక్ష పార్టీల ఆందోళనల నేపథ్యంలో అధికార టీఆర్‌ఎస్ పార్టీ ఆచితూచి వ్యవహరిస్తోంది. రైతులకు సంబంధించిన అంశం కావడంతో ఆ పార్టీ ఎంపీ, ఎమ్మెల్యేలు భారీ నీటి పారుదల శాఖ మంత్రి హరీశ్‌రావుతో సమావేశమయ్యారు. ప్రాజె క్టులో నీటి నిల్వ పరిమితంగా ఉన్న నేపథ్యంలో కాకతీయ కాలువకు నీటి విడుదల ప్రస్తుతానికి వీలు పడదని ఆయన ప్రకటించారు.
నేతల అరెస్టులు
ప్రతిపక్ష పార్టీ నేతల ఆందోళన నేపథ్యంలో జిల్లా లో అరెస్టుల పరంపర కొనసాగుతోంది. ఎస్సా రెస్పీ పరీవాహక గ్రామాల్లో వందలాదిగా పోలీసు బలగాలను మోహరించారు. మరోవైపు జిల్లాలో 144 సెక్షన్ విధించారు. ఆందోళనలు నిర్వహిస్తున్న నేతలను అదుపులోకి తీసుకుని పోలీస్‌స్టేషన్లకు తరలిస్తున్నారు. శనివారం ఎస్సారెస్పీ వెళ్తున్న కాంగ్రెస్ కిసాన్ కేత్ రాష్ట్ర అధ్యక్షుడు కోదండరెడ్డిని డిచ్‌పల్లి పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
కామారెడ్డి జిల్లాలో...
కామారెడ్డి జిల్లాలోనూ సాగునీటి సమస్యపై ఆందోళన చేపట్టారు. సింగూరు జలాశయం నుంచి నిజాంసాగర్ ప్రాజెక్టుకు నీటిని విడుదల చేయాలని డిమాండ్ చేస్తూ ఇటీవల బాన్సువాడలో కాంగ్రెస్ పార్టీ నాయకులు ధర్నా, నిరసన కార్యక్రమాన్ని నిర్వహించారు. ప్రస్తుతం నిజాంసాగర్ ప్రాజెక్టు ఆయకట్టు రైతులు నాట్లు వేసుకున్నారు. సింగూరు నుంచి జిల్లా వాటా కింద రావాల్సిన తొమ్మిది టీఎంసీల నీటిని విడుదల చేసి ఆయకట్టు రైతులకు భరోసా కల్పించాలని కాంగ్రెస్ డిమాండ్ చేస్తోంది. ప్రస్తుతం నిజాంసాగర్‌లో సుమారు రెండున్నర టీఎంసీల నీరుంది. జిల్లా వాటా కింద రావాల్సిన నీటిని విడుదల చేయాలని రైతులు కూడా కోరుతున్నారు. ఈ అంశాన్ని కాంగ్రెస్ ఒక అవకాశంగా భావించి ఆందోళన చేపట్టింది. మొత్తం మీద రెండు జిల్లాల పరిధిలో సాగునీటి అంశంపై ప్రతిపక్ష పార్టీలు ఆందోళనలను కొనసాగించడంతో రాజకీయ వేడి రాజుకున్నట్లవుతోంది.
Comments
Please login to add a commentAdd a comment