Kandi crop
-
ఉడుకుతున్న పప్పులు
సాక్షి, న్యూఢిల్లీ: దేశ వ్యాప్తంగా పప్పుల ధరలు క్రమంగా పెరుగుతున్నాయి. జూలై రెండో వారం నుంచి పప్పుల ధరల్లో పెరుగుదల ఉంటుందన్న కేంద్రం అంచనాలకు అనుగుణంగానే ధరలు పైపైకి ఎగబాకుతున్నాయి. ఇప్పటికే దక్షిణ భారతంలోని తమిళనాడు, కేరళలో కిలో కందిపప్పు ధర రూ.135–140కి చేరగా, ప్రస్తుత వర్షాలతో జరిగిన పంట నష్టం కారణంగా ధరలు మరింత పెరిగే అవకాశాలున్నాయి. దీనిపై కేంద్రం అప్రమత్తమైంది. వరదలతో పెరిగిన నష్టం.. దేశ వ్యాప్తంగా ఈ ఏడాది పప్పుధాన్యాల సాగు తగ్గినట్లు కేంద్ర నివేదికలు చెబుతున్నాయి. గత ఏడాది ఇదే సమయంలో 1.27 కోట్ల హెక్టార్లలో పప్పుధాన్యాలు సాగు కాగా, ఈ ఏడాది అది 1.18 కోట్ల హెక్టార్లకు తగ్గింది. దేశంలో ఎక్కువగా సాగు చేసే కంది పంట విస్తీర్ణం గత ఏడాది 47 లక్షల హెక్టార్లుంటే అది ఈ ఏడాదికి 41 లక్షల హెక్టార్లకు తగ్గింది. అధికంగా సాగయిన మహారాష్ట్ర, మధ్యప్రదేశ్, కర్ణాటక రాష్ట్రాల్లో ఇటీవల కురిసిన భారీ వర్షాలు, వరదల కారణంగా తీవ్ర పంట నష్టం జరిగింది. ఇలాంటి సమయాల్లో ఎక్కువగా మిల్లర్లు విదేశీ దిగుమతులపై ఆధారపడతారు. ముఖ్యంగా మయన్మార్, దక్షిణాఫ్రికా, సింగపూర్, కెన్యాల నుంచి దిగుమతి చేసుకుంటారు. అయితే అక్కడ సైతం వర్షాభావంతో సాగు తగ్గి దిగుబడులు పడిపోయాయి. ఇదే అవకాశంగా తీసుకొని వ్యాపారులు పప్పుల ధరలను క్రమంగా పెంచుతున్నట్లు కేంద్రం గుర్తించింది. జూలై మొదటి వారంలో కందిపప్పు జాతీయ సగటు ధర కిలో రూ.100 ఉంటే అది ఇప్పుడు రూ.109కి చేరింది. మినప, పెసర, శనగ పప్పులు ధరలు సైతం ఏకంగా రూ.10 మేర పెరిగాయి. కేంద్రం అంచనా వేసిన ధరల కన్నా రూ.10–15 మేర అధికంగా బహిరంగ మార్కెట్లో విక్రయాలు జరుగుతున్నాయి. తమిళనాడు, కేరళ రాష్ట్రాల్లో ప్రస్తుతం గ్రేడ్–1 రకం కందిపప్పు ధర కిలో రూ.135–140మధ్య ఉంది. ఇక్కడ ధరలు నెల రోజుల వ్యవధిలోనే రూ.20–25 వరకు పెరిగాయి. తెలంగాణ, ఏపీ రాష్ట్రాల్లో ధరలు రూ.100 నుంచి రూ.115 మధ్య ఉన్నాయి. ఢిల్లీలోనూ కిలో కందిపప్పు ధర రూ.120 ఉండగా, మినపపప్పు ధర రూ.125గా ఉంది. దేశ వ్యాప్తంగా ప్రస్తుతం పండగల సీజన్ మొదలయింది. ఆగస్టు మొదలు అక్టోబర్ వరకు పండగ సీజన్ నేపథ్యంలో వ్యాపారులు కృతిమ కొరత సృష్టిస్తే ఈ ధరల పెరుగుదల మరింతగా ఉండవచ్చని కేంద్రం అంచనా. ఈ నేపథ్యంలో రాష్ట్రాలను అప్రమత్తం చేసింది. గట్టి నిఘా ఉంచండి.. ధరల కట్టడిలో భాగంగా దేశీయ, విదేశీ మార్కెట్లలో పప్పుల లభ్యత, ధరలను నిశితంగా పరిశీలిస్తున్నట్లు కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. రాష్ట్ర ప్రభుత్వాలు సైతం వ్యాపారుల వద్ద ఉండే నిల్వలపై గట్టి నిఘా ఉంచాలని సూచించింది. పప్పుధాన్యాల స్టాక్ హోల్డర్లు నిల్వలను బహిర్గతం చేసేలా చూడాలని కోరింది. నిల్వల వివరాలను ఆన్లైన్ మానిటరింగ్ పోర్టల్‌లో అప్డేట్ చేసే వివరాలను సమీక్షించాలని తెలిపింది. -
‘కంది’ పోతోంది..
సాక్షి, రెబ్బెన(ఆసిఫాబాద్): ఆరుగాలం కష్టించి పంటలు పండించే అన్నదాతలను ప్రతికూల వాతావరణ పరిస్థితులు కుంగదీస్తున్నాయి. తీవ్ర వర్షాభావ పరిస్థితులు నెలకొనటంతో పంటల్లో ఆశించిన స్థాయిలో దిగుబడి రాక రైతన్నలు నష్టాలు చవిచూడాల్సి వస్తోంది. విత్తనం నాటిన నుంచి పంట చేతికి అందే వరకు దేవుడిపై భారం వేస్తున్నారు. ఈసారి ఖరీఫ్ ప్రారంభం నుంచే వర్షాలు అధికంగా కురవటంతో పంటల్లో ఎదుగుదల లేక నష్టపోగా ఖరీఫ్ చివరి కాలంలో వర్షాలు పూర్తిగా ముఖం చాటేయటంతో పంటలు ఆశాజనకంగా లేవు. ఇప్పటికే జిల్లా వ్యాప్తంగా పత్తిలో దిగుబడి తగ్గి దెబ్బతీయగా కందిపై పెట్టుకున్న ఆశలు సైతం సన్నగిల్లుతున్నాయి. ప్రస్తుతం జిల్లా వ్యాప్తంగా కంది పంట పూత దశలో ఉండగా వర్షాలు లేక ఎదుగుదల పూర్తిగా మందగించి దిగుబడిపై తీవ్ర ప్రభావం చూపేలా కనిపిస్తోంది. దెబ్బతీసిన అధిక వర్షాలు ఖరీఫ్ ప్రారంభంలో జిల్లాలో కురిసిన అధిక వర్షాలు పత్తితోపాటు కంది పంటలను సైతం తీవ్రంగా దెబ్బతీశాయి. భూమిలో తేమశాతం అధికంగా మారటంతో పంటల్లో ఎదుగుదల పూర్తిగా లోపించింది. దాని ప్రభావం ఇప్పటికే పత్తి పంటలపై చూపగా ప్రస్తుతం కందిపై ప్రభావం పడింది. ప్రారంభంలో అధిక వర్షాలతో పంటల్లో పెరుగుదల లోపించగా ఖరీఫ్ చివరి కాలం నాటికి వర్షాలు పూర్తిగా ముఖం చాటేశాయి. దాంతో పంటలపై ఎన్నో ఆశలు పెట్టుకున్న రైతుల ఆశలను ప్రతికూల వాతావరణ పరిస్థితులు అడియాసలు చేశాయి. జిల్లా వ్యాప్తంగా ఈసారి ఖరీఫ్‌లో 12,495 హెక్టార్లలో రైతులు కంది పంటలను సాగు చేశారు. చాలా మంది రైతులు అధిక శాతం పత్తికి అంతర పంటలుగా కందిని సాగు చేయగా మిగిలిన వారు నేరుగా సాగు చేశారు. ప్రస్తుతం కంది పంటలన్ని పూతదశకు చేరుకోగా పంటల్లో పెరుగుదల లేకపోవటంతో కనీసం పెట్టుబడి సైతం దక్కేలా కనిపించటం లేదని రైతులు ఆవేదన చెందుతున్నారు. జిల్లాలో ఈసారి సుమారు 1,56,188 మెట్రిక్ టన్నుల దిగుబడి వస్తుందని వ్యవసాయ శాఖ అధికారులు అంచనా వేసి సగానికి సగం వరకు దిగుబడి తగ్గే అవకాశం ఉందని రైతులు బావిస్తున్నారు. పంటల్లో పెరుగుదల లేక ఆశించిన స్థాయిలో పూత కనిపించటం లేదు. ముందుంది తెగుళ్ల కాలం.. జిల్లాలో ఇప్పుడిప్పుడే పూత పడుతున్న కంది పంటను పచ్చపురుగు, లద్దెపురుగు, మచ్చల పురుగు ఉధృతంగా ఆశిస్తుండడం రైతులను కలవర పెడుతోంది. పూత దశలోనే పురుగు ఉధృతి అధికంగా మారటంతో రైతులను ఇబ్బందులను గురిచేస్తోంది. దానికి తోడూ రోజురోజుకు పెరుగుతున్న ఉష్ణోగ్రతలు పంటలపై ప్రతికూల ప్రభావాన్ని చూపుతున్నాయి. దాంతో కందికి పూతలు సరిగా రాకపోవటంతో రైతులు ఆందోళన చెందుతున్నారు. ఇక వాతావరణం మబ్బు పడితే కందిపై పురుగుల బెడద మరింత అధికమయ్యే ప్రమాదం ఉందని రైతులు ఆందోళన చెందుతున్నారు. పూత, పిందె రాలిపోయి మరింత నష్టపోవాల్సి వస్తుంది. ఆ దశలో వాతావరణం అనుకూలిస్తే తప్పా కనీసం పెట్టుబడులు సైతం రాబట్టుకోలేని పరిస్థితులు ఏర్పడుతున్నాయని రైతులు వాపోతున్నారు. పంటలను కాపాడుకునేందుకు వ్యవసాయ అధికారుల నుంచి సలహాలు, సూచనలు అందకపోవటంతో రైతులు తమకు తోచిన మందులు పిచికారి చేస్తూ ఆర్థికంగా నష్టపోతున్నారు. జిల్లాలో కంది సాగు మండలం హెక్టార్లు సిర్పూర్(యు) 1,179 జైనూర్ 739 కెరమెరి 1,606 లింగాపూర్ 691 ఆసిఫాబాద్ 1,310 రెబ్బెన 480 వాంకిడి 1,198 తిర్యాణి 1,208 కాగజ్‌నగర్ 742 సిర్పూర్(టి) 894 కౌటాల 830 బెజ్జూర్ 462 దహెగాం 161 చింతలమానెపల్లి 722 పెంచికల్పేట్ 273 మొత్తం 12,495 -
కందులు కొనే దిక్కులేదు
సాక్షి ప్రతినిధి, సూర్యాపేట: రాష్ట్రంలో ఈ సారి కంది పంట బాగా పండిందని, కానీ వీటిని కొనే దిక్కులేకపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారని సీఎల్పీ ఉపనేత, ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. మంగళవారం సూర్యాపేటలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. కందులకు గిట్టుబాటు ధర లేక రైతులకు పంట సాగు ఖర్చు కూడా రావడం లేదని ఆవేదన వ్యక్తం చేశారు. రైతులు పండించిన పంటకు మద్దతు ధర ఇవ్వడంలో ప్రభుత్వం పూర్తిగా విఫలమైందని విమర్శించారు. కొట్లాడి తెచ్చుకున్న తెలంగాణలో తమ బతుకులు బాగు పడతాయని రైతులు ఆశించారని, వారి ఆశలు అడియాసలయ్యాయన్నారు. కేవలం కేసీఆర్ కుటుంబంలోని నలుగురి బతుకులు మాత్రమే బాగున్నాయని పేర్కొన్నారు. వచ్చే ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రావడం ఖాయమని కోమటిరెడ్డి ధీమా వ్యక్తం చేశారు. దివంగత సీఎం వైఎస్ రాజశేఖరరెడ్డి హయాంలో రైతులకు ఒకే సారి రూ.లక్ష రుణమాఫీ అయ్యిందని గుర్తు చేశారు. ఈ ప్రభుత్వం రూ.లక్షను ఆరు విడతలుగా మాఫీ చేయడంతో అది వడ్డీకే సరిపోలేదన్నారు. కాంగ్రెస్ అధికారంలోకి వస్తే రూ.2 లక్షల వరకు ఒకే సారి రుణ మాఫీ చేస్తామన్నారు. జగదీశ్‌రెడ్డిని మంత్రిగా గుర్తించడం లేదు.. జగదీశ్‌రెడ్డిని మంత్రిగా జిల్లా ప్రజలు గుర్తించడం లేదని, ఆయనకు జిల్లా మీద ఏమాత్రం అవగాహన లేదని కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి విమర్శించారు. ముఖ్యమంత్రి కేసీఆరే జగదీశ్‌రెడ్డిని మంత్రిగా గుర్తించడం లేదన్నారు. విద్యుత్ శాఖకు అవార్డులు వస్తే సీఎం ఆ శాఖ సీఎండీ ప్రభాకర్‌రావుకు స్వీట్లు తినిపించడమే ఇందుకు నిదర్శమన్నారు. గతంలో జరిగిన నూకా భిక్షం, మదన్‌మోహన్‌రెడ్డి హత్యకేసుల్లో మంత్రి ఉన్నారని, హత్యా రాజకీయాలను జగదీశ్‌రెడ్డి ప్రోత్సహిస్తున్నారని ఆరోపించారు. నాగారంలో వార్డు సభ్యుడిని గెలిపించుకోలేని సత్తా లేని వ్యక్తి తనను, జానారెడ్డి, దామోదర్‌రెడ్డి లాంటి సీనియర్ నేతలను విమర్శించే స్థాయి లేదన్నారు. వచ్చే ఎన్నికల్లో తన అంచనా ప్రకారం జగదీశ్‌రెడ్డికి టికెట్ రాదని, వచ్చినా డిపాజిట్ గల్లంతు అవుతుందని వెంకట్‌రెడ్డి జోస్యం చెప్పారు. -
పడిగాపులు తప్పవా?
అనంతగిరి(వికారాబాద్) : రైతులు ఏడాది పొడువునా పండించిన పంట విక్రయించేందుకు ఇబ్బందులు పడుతున్నారు. రోజులు గడుస్తున్నా తమ వంతుకోసం పడిగాపులు పడుతున్నారు. వికారాబాద్‌లోని కందుల కొనుగోలు కేంద్రంలో కందులు అమ్ముకునేందుకు వచ్చి రెండు మూడు రో జులైనా ఇంకా తూకాలు వేయడంలేదు. ఉదయం 7 గంటలకు వచ్చి చిట్టీలు ఇస్తామన్న అధికారులు 10 దాటినా రాక పోవడంతో రైతులు అసహనం వ్యక్తం చేస్తున్నారు. వికారాబాద్‌లోని కొనుగోలు కేంద్రానికి వికారాబాద్, నవాబ్‌పేట, పూడూర్ మండలాలకు చెందిన రైతుల కందులు తీసుకొస్తున్నారు. ఎక్కువ మొత్తంలో కందులు రావడంతో తెచ్చిన వాటిని ఇంటికి తిరిగి తీసుకుపోలేక రైతులు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఈ విషయంలో వారు నెల రోజుల ముందే కందుల షాంపిల్‌ను తీసుకొచ్చి అధికారులకు చూయించారు. వారు అమ్మేందుకుగాను వారి పేర్లను రిజిస్టార్లో రాసుకుని 6వ తేదీ రావాలని ఇచ్చారని రైతులు తెలిపారు. కాగా వారు భరోసాతో ట్రాక్టర్లలో, ఆటోలు తదితర వాహనాల్లో కొనుగోలు కేంద్రం వద్దకు తీసుకొచ్చారు. తీరా అక్కడ అధికారులు లేదు. ఎవరైతే ముందు వచ్చారో వారివే తూకం చేస్తామనడంతో రైతులు చేసేదేమీ లేక ఎలాగోలా తాము తెచ్చిన కందులు విక్రయించాలనే ఉద్దేశంతో మళ్లీ తేదీలు మార్పించుకుని మరీ ఎదురుచూస్తున్నారు. 7వ తేదీన రిజిస్టార్లో నంబర్లు రాయించి అక్కడే ఉన్నారు. అలా రాయించిన వారు 8వ తేదీన తూకం జరిగాయి. అధికారులు రైతుల అవస్థలు చూసైనా మండలానికి ఒక కౌంటర్ ఏర్పాటు చేస్తే బాగుంటుందని రైతులు కోరుతున్నారు. ఇప్పటికైనా సంబంధిత అధికారులు మండలానికి ఒకటి చొప్పున తూకం పెట్టినట్లయితే ఇబ్బందులు లేకుండా ఉంటుందన్నారు. తాండూరు : కంది పండించడంలో తాండూరుకు ప్రత్యేకత ఉంది. ప్రతి ఏటా తాండూరు వ్యవసాయ మార్కెట్ యార్డు కందుల బస్తాలతో మార్కెట్ కళకళలాడేది. కాని ఈ సారి మార్కెట్లో «మద్దతు ధర కరువైంది. దీంతో కేంద్ర ప్రభు త్వం మద్ధతు ధర అందించేందుకు మార్క్‌ఫెడ్ ఆధ్వర్యంలో డీసీఎంఎస్ ద్వారా మద్దతు ధరకు కొనుగోలు చేస్తున్న మూడు కేంద్రాలు ఎత్తేయడంతో వారం రోజులుగా ఆందోళనలు, నిరసనలు, రాస్తారోకోలు నిర్వహించారు. ప్రభు త్వ కొనుగోలు కేంద్రాలను ఎత్తివేసి తాండూరులోనే మద్దతు ధరకు కందుల కొనుగోళ్లు చేస్తుండటంతో రైతులు పెద్ద ఎత్తున గ్రామాల నుంచి తీసుకొస్తున్నారు. ఇప్పటి వరకు 65వేల క్వింటాళ్ల కొనుగోలు ఖరీఫ్ సీజన్లో రైతులు పండించిన కంది దిగుబడులు కొనుగోలు చేసేందుకు ప్రభుత్వం తాండూరు నియోజకవర్గంలో 4 కేంద్రాలు నెల రోజుల కిందట ఏర్పాటు చేసింది. ఇప్పటి వరకు తాండూరు రైతు బజార్ ప్రాంగణంలో ఏర్పాటు చేసిన కొనుగోలు కేంద్రంతో పాటు తాండూరు నియోజకవర్గంలోని పెద్దేముల్,బషీరాబాద్, లక్ష్మీణారాయణపూర్లలో ఏర్పాటు చేసిన మద్దతు ధర కొనుగోలు కేంద్రంలో ఇప్పటి వరకు 65వేల క్వింటాళ్ల కందులను కొనుగోలు చేశారు. దీంతో 35.42 కోట్ల వ్యాపారం జరిగింది. భారీగా పోటెత్తిన కందులు.. నియోజకవర్గంలో పెద్దేముల్, లక్ష్మినారాయణపూర్, బషీరాబాద్‌లో ఏర్పాటు చేసిన కంది కొ నుగోలు కేంద్రాలను ఎత్తి వేశారు. దీంతో రై తులు, గ్రామాల నుంచి రైతులు భారీగా కం దులు తీసుకొన్నారు. మూడు రోజుల వ్యవధిలో నే ్ౖచరెతు బజార్ ప్రాంగణం, డీసీఎంఎస్ కార్యాలయ ప్రాంగణం, దాల్మిల్ గొదాం అన్ని చోట్ల కంది బస్తాల నిల్వలతో నిండిపోయింది. రై తులు గ్రామాల నుంచి కందులను తీసుకువస్తు న్న అధికారులు మాత్రం ఇంకా కొనుగోళ్లను ప్రారంభించలేదు. గ్రామాలలో ఏర్పాటు చేసిన కేంద్రాలు పూర్తిగా ఎత్తి వేశాకే తాండూరులో కొ నుగోళ్లను ప్రారంభించాలని డీసీఎంఎస్, మా ర్క్‌ఫెడ్ అధికారులు భావిస్తున్నారు. మరో రెం డు మూడు రోజుల్లో నిల్వ చేసుకునేందుకు వీలు లేకుండా రైతులు ఇబ్బందులు పడే అవకాశం ఉంది. అధికారులు నిల్వలు లేకుండా వెంట వెంటనే కందులను కొనుగోలు చేస్తే ఇబ్బందులు పోతాయని రైతులు అంటున్నారు. పేరు నమోదు చేసి నెలైంది గత నెల కిందట కందుల షాంపిల్ తెచ్చి చూయించాను. ఇక్కడ అధికారులు ఒక రిజిస్టర్లో పేర్లు రాసుకుని 6వ తేదీన రమ్మన్నారు. ఎలాగైన తూకం అవుతుంది కదా అని కందులు తీసుకుని 6న వచ్చాను. మరల చిట్టీ ఇచ్చి 8న తూకం చేశారు. – నర్సింహారెడ్డి, రైతు మండలానికి ఒక కాంటా పెట్టాలి రైతులకు ఇబ్బంది లేకుండా అధికారులు మండలానికి ఒక కాంటా పెట్టాలి. ఏ మండలం వారు ఆ కాంటవద్దకెళ్లి తూకాలు వేసుకోవాలి. రైతులు కందులు తీసుకొచ్చి 2–3 రోజులైనా తూకాలు చేయకపోవడంతో ఇక్కడే పడిగాపులు కాస్తున్నారు. ఈ విషయంలో అధికారులు వెంటనే చర్యలు తీసుకుని న్యాయం చేయాలి. – శ్రీనివాస్, రైతు -
పంట కొనుగోళ్లకు తక్షణమే చెల్లింపులు
సాక్షి, హైదరాబాద్: కంది పంటను కొనుగోలు చేసిన తక్షణమే రైతులకు చెల్లింపులు జరిగేలా చర్యలు తీసుకోవాలని వ్యవసాయశాఖ కార్యదర్శి సి.పార్థసారథి అధికారులను ఆదేశించారు. శుక్రవారం కందితో పాటు ఇతర పంటల కనీస మద్దతు ధరకు కొనుగోలుపై మార్కెటింగ్, మార్క్‌ఫెడ్, హాకా, నాఫెడ్ అధికారులతో ఆయన సమీక్ష సమావేశం నిర్వహించారు. రైతుకు సంబంధించిన అన్ని రకాల పత్రాలు పరిశీలించిన తర్వాతే కొనుగోళ్లు జరపాలని సూచించారు. ఇప్పటివరకు రైతుల నుంచి సుమారు 9.87 లక్షల క్వింటాళ్ల కందిని కొనుగోలు చేసినట్లు తెలిపారు. దీనికి సంబంధించి రూ.21 కోట్లు వెంటనే విడుదల చేయాలని నాఫెడ్‌ను ఆదేశించారు. -
లక్షన్నర టన్నుల కందిని కొనండి
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో లక్షన్నర టన్నుల కందిని కొనుగోలు చేయాలని కేంద్రానికి వ్యవసాయ మార్కెటింగ్ శాఖ మరోసారి విజ్ఞప్తి చేయనుంది. ఈ మేరకు ఆ శాఖ కార్యదర్శి సి.పార్థసార«థి మం గళవారం ఢిల్లీ వెళ్లనున్నారు. కేంద్ర వ్యవ సాయశాఖ కార్యదర్శిని కలసి లక్షన్నర టన్నుల కందిని కొనుగోలు చేయాలని కోరతారు. రాష్ట్రంలో కేవలం 53,600 మెట్రిక్ టన్నుల కందిని మాత్రమే కొనుగో లు చేస్తామని కేంద్రం గతంలో ప్రకటించిం ది. కంది ఉత్పత్తి గణనీయంగా ఉన్నందు న పరిమితిని పెంచాలని రాష్ట్ర ప్రభుత్వం కోరుతోంది. ఈ ఏడాది రెండున్నర లక్షల మెట్రిక్ టన్నుల కంది ఉత్పత్తి అవుతుం దని ప్రభుత్వం అంచనా వేసింది. కేంద్రం మాత్రం రాష్ట్రంలో కేవలం 33,500 మెట్రిక్ టన్నులు మాత్రమే మద్దతుధరకు కొనుగో లు చేస్తానని ప్రకటించింది. ఒత్తిడి పెంచ డంతో ఇటీవల మరో 20 వేల టన్నులు కొనుగోలు చేస్తామని అంగీకరించింది. ఇలాగైతే, రైతులు కంది పంటను వ్యాపారులకు తెగనమ్ముకునే పరిస్థితి వస్తుందని అధికారులు పేర్కొంటున్నారు. -
అకాల వర్షం.. కంది రైతుకు కష్టం
అదిలాబాద్: ఆదిలాబాద్, మంచిర్యాల జిల్లాలలో గురువారం ఉదయం అకాల వర్షం కురుస్తోంది. దీంతో కంది రైతులు తీవ్రంగా నష్టపోయారు. కంది పంటను అమ్ముకోవడానికి అదిలాబాద్ మార్కెట్‌కు వచ్చిన రైతులకు వరణుడు తీరని నష్టాన్ని మిగిల్చాడు. బుధవారం రాత్రి కురిసిన భారీ వర్షానికి కందులు తడిసిపోయాయి. దీంతో రైతులు తీవ్ర ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. అదే విధంగా శ్రీరాంపూర్‌లో ఉదయం నుంచి భారీ వర్షం పడుతోంది. దాంతో ఓపెన్ కాస్ట్లో బొగ్గు ఉత్పత్తి నిలిచిపోయింది. -
కంది కొనుగోళ్లలో దళారుల్ని నిరోధించండి
అధికారులకు సీఎం చంద్రబాబు ఆదేశం సాక్షి, అమరావతి: కంది పంట కొనుగోళ్లలో దళారుల ప్రమేయం లేకుండా చూడాలని అధికారులను రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు ఆదేశించారు. స్విట్జర్లాండ్ పర్యటనలో ఉన్న చంద్రబాబు సోమవారం ఉదయం అధికారులతో ఫోన్లో అంగన్వాడీ కేంద్రాలు, కంది గిట్టుబాటుపై మాట్లాడారు. కంది రైతులకు గిట్టుబాటు ధర లభించేలా చూడాలని మార్కెటింగ్‌శాఖ అధికారులను ఆదేశించారు. అంగన్వాడీ కేంద్రాల్లో నాణ్యమైన నిత్యావసరాలను మాత్రమే వినియోగించాలన్నారు. మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రతి 15 రోజులకోసారి తనిఖీలు నిర్వహించాలన్నారు. -
రైతు 'కంది' వస్తే పంటే..
బోర్డు ఏర్పాటుతో రైతన్నకు మేలు ముంగింట్లోకి పరిశోధనల ఫలితాలు మెరుగుపడనున్న మార్కెటింగ్ సౌకర్యం కంది సాగుకు తాండూరు పెట్టింది పేరు. ఇక్కడి కందులు.. పప్పు.. జాతీయస్థాయిలో జిల్లాకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. జిల్లాలో సుమారు 40వేల హెక్టార్లలో రైతులు కంది సాగు చేస్తున్నారు. తాండూరు పరిధిలో అత్యధికంగా పంట సాగవుతోంది. ఎప్పటినుంచో ఇక్కడ కందిబోర్డు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. కంది బోర్డు అందుబాటులోకి వస్తే ప్రత్యేక పరిశోధనలకు ఆస్కారం ఉంటుంది. యూనివర్సిటీస్థాయి శాస్త్రవేత్తలు రైతులకు అందుబాటులో ఉంటారు. తద్వారా సాగు విస్తీర్ణం.. దిగుబడి పెరిగే ఆస్కారం ఉంది. తాండూరు: జాతీయ, రాష్ట్ర కంది ఉత్పాదకతతో పోల్చితే జిల్లా ఉత్పాదకత ఎక్కువగా ఉంది. కంది బోర్డు ఏర్పాౖటెతే రైతులు పండించిన పంటను తొందరపడి తక్కువ ధరకు విక్రయించుకోకుండా గిట్టుబాటుధర లభించేలా చొరవ చూపుతుంది. రైతులకు మార్కెట్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తుంది. దేశంలోని వివిధ మార్కెట్లలో రోజువారీ ధరలను సమీక్షిస్తూ.. ఎక్కువ ధర వచ్చే మార్కెట్లకు ఉత్పత్తుల ఎగుమతి ప్రక్రియను చేపట్టి రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా దోహదపడుతుంది. శాస్త్రవేత్తల పరిశోధనల ఫలితాలను అన్నదాతల ముంగిట్లోకి తీసుకెళ్లి అధిక దిగుబుడులు సాధించేందుకు బోర్డు కృషి చేస్తుంది. పంటల సాగుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై రైతులకు అవగాహన కల్పిస్తుంది. బోర్డుకు ఉండే ప్రత్యేక నిధుల ద్వారా కొత్త పరిశోధనలకు అవసరమైన చేయూత లభిస్తుందనే అభిప్రాయం శాస్త్రవేత్తల్లో వ్యక్తమవుతోంది. ఇక ఇక్రిశాట్, ఇతర వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తమ ప్రయోగాల కోసం తాండూరుకు వస్తుంటారు. బోర్డు ఏర్పాటుతో యూనివర్సిటీ స్థాయి శాస్త్రవేత్తలు స్థానికంగా అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. తద్వారా కంది తదితర పప్పుధాన్యాల పరిశోధలు విస్తృతమవుతాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు. రైతులకు మేలు.. ప్రస్తుతం తాండూరు పరిశోధన కేంద్రంలో కొత్త రకాల పరిశోధనలకు, యాజమాన్య పద్ధతులకు సంబంధించిన శాస్త్రవేత్తలు ఉన్నారు. ఈమేరకే పరిశోధనలు జరుగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని మారుతేరులో రైస్ రీసెర్చ్ స్టేషన్ కు ఏపీ రైస్ రీసెర్చ్ స్టేష్టన్ హోదా ఉంది. అదే మాదిరిగా కందికి ప్రసిద్ధిగాంచిన తాండూరు పరిశోధన కేంద్రాన్ని తెలంగాణ పప్పుధాన్యాల రీసెర్చ్ కేంద్రంగా హోదా కల్పించిట్లైతే కీటక, తెగుళ్ల నివారణ విభాగానికి సంబంధించి శాస్త్రవేత్తలు అందుబాటులోకి వస్తారు. తద్వారా పరిశోధనలు విస్తృతమవుతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. చీడపీడల బెడదతో తీవ్రంగా నష్టపోతున్న రైతులకు మేలు జరుగుతుందంటున్నారు. ఏటా రూ.50కోట్ల కందుల వ్యాపారం.. తాండూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏటా సుమారు రూ.50కోట్ల కందుల వ్యాపారం జరుగుతుంది. లక్ష క్వింటాళ్ల వరకు విక్రయాలు జరుగుతాయి. మార్కెట్ కమిటీకి 1శాతం చొప్పున రూ.50లక్షల మార్కెట్ఫీజు ఆదాయంగా వస్తుంది. బోర్డు ఏర్పాౖటెతే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రైతుల ముంగిట్లోకి వస్తుంది. తద్వారా కంది సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగి దిగుబడులు అధికమవుతాయి. రైతులకు మేలుతోపాటు మార్కెట్ కమిటీకి ఫీజు ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది. ఎన్నికల ప్రచారంలో సీఎం హామీ.. 2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా తాండూరుకు విచ్చేసిన కేసీఆర్ తాండూరు కందులు, కందిపప్పు ప్రత్యేకతల గురించి ప్రస్తావించారు. అధికారంలోకి వచ్చిన తరువాత కంది పరిశోధనలు మరింత విస్తృత పరిచేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా తాండూరులో కంది బోర్డు ఏర్పాటుకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి స్థానిక వ్యవసాయ శాస్త్రవేత్తలతో ఇటీవల చర్చించారు. కంది బోర్డుతో రైతులకు ఒనగూరే ప్రయోజనాలు, పంటలసాగులో అందుబాటులోకి వచ్చే సాంకేతిక పరిజ్ఞానం తదితర అంశాలను శాస్త్రవేత్తలు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ దిశగా తెలంగాణ సర్కారు మరింత చొరవ చూపితే తాండూరులో కందిబోర్డు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. తద్వారా జిల్లా రైతులకు మేలు కలుగుతుందనే అభిప్రాయం శాస్త్రవేత్తల్లో వ్యక్తమవుతోంది. జాతీయస్థాయి పరిశోధనలు అఖిలభారత సమన్వయ పరిశోధన కార్యక్రమం కింద తాండూరు పరిశోధన కేంద్రం ఎంపికైంది. జాతీయస్థాయిలో కంది పరిశోధనలు ఇక్కడ జరుగనున్నాయి. ఇందు కోసం ప్రత్యేకంగా ఇద్దరు శాస్త్రవేత్తలు నియామకం కానున్నారు. 2017–18 సంవత్సరం నుంచి ఈ పరిశోధనలు తాండూరులో మొదలుకానున్నాయి. కంది బోర్డు అందుబాటులోకి వస్తే ప్రత్యేకంగా కంది పరిశోధనలకు ఆస్కారం కలుగుతుంది. యూనివర్సిటీ స్థాయి శాస్త్రవేత్తలు రైతులకు అందుబాటులో ఉంటారు. వికారాబాద్‌జిల్లా రైతులకు మేలు జరుగుతుంది. –డా.సుధాకర్, సీనియర్ శాస్త్రవేత్త, తాండూరు