రైతు 'కంది' వస్తే పంటే..
Published Mon, Oct 17 2016 3:36 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM
బోర్డు ఏర్పాటుతో రైతన్నకు మేలు
ముంగింట్లోకి పరిశోధనల ఫలితాలు
మెరుగుపడనున్న మార్కెటింగ్ సౌకర్యం
కంది సాగుకు తాండూరు పెట్టింది పేరు. ఇక్కడి కందులు.. పప్పు.. జాతీయస్థాయిలో జిల్లాకు గుర్తింపు తెచ్చిపెట్టాయి. జిల్లాలో సుమారు 40వేల హెక్టార్లలో రైతులు కంది సాగు చేస్తున్నారు. తాండూరు పరిధిలో అత్యధికంగా పంట సాగవుతోంది. ఎప్పటినుంచో ఇక్కడ కందిబోర్డు ఏర్పాటు చేయాలనే ప్రతిపాదన ఉంది. కంది బోర్డు అందుబాటులోకి వస్తే ప్రత్యేక పరిశోధనలకు ఆస్కారం ఉంటుంది. యూనివర్సిటీస్థాయి శాస్త్రవేత్తలు రైతులకు అందుబాటులో ఉంటారు. తద్వారా సాగు విస్తీర్ణం.. దిగుబడి పెరిగే ఆస్కారం ఉంది.
తాండూరు: జాతీయ, రాష్ట్ర కంది ఉత్పాదకతతో పోల్చితే జిల్లా ఉత్పాదకత ఎక్కువగా ఉంది. కంది బోర్డు ఏర్పాౖటెతే రైతులు పండించిన పంటను తొందరపడి తక్కువ ధరకు విక్రయించుకోకుండా గిట్టుబాటుధర లభించేలా చొరవ చూపుతుంది. రైతులకు మార్కెట్ సౌకర్యం కల్పించేందుకు కృషి చేస్తుంది. దేశంలోని వివిధ మార్కెట్లలో రోజువారీ ధరలను సమీక్షిస్తూ.. ఎక్కువ ధర వచ్చే మార్కెట్లకు ఉత్పత్తుల ఎగుమతి ప్రక్రియను చేపట్టి రైతులకు గిట్టుబాటు ధర దక్కేలా దోహదపడుతుంది. శాస్త్రవేత్తల పరిశోధనల ఫలితాలను అన్నదాతల ముంగిట్లోకి తీసుకెళ్లి అధిక దిగుబుడులు సాధించేందుకు బోర్డు కృషి చేస్తుంది. పంటల సాగుకు ఆధునిక సాంకేతిక పరిజ్ఞానంపై రైతులకు అవగాహన కల్పిస్తుంది. బోర్డుకు ఉండే ప్రత్యేక నిధుల ద్వారా కొత్త పరిశోధనలకు అవసరమైన చేయూత లభిస్తుందనే అభిప్రాయం శాస్త్రవేత్తల్లో వ్యక్తమవుతోంది. ఇక ఇక్రిశాట్, ఇతర వ్యవసాయ విశ్వవిద్యాలయం శాస్త్రవేత్తలు తమ ప్రయోగాల కోసం తాండూరుకు వస్తుంటారు. బోర్డు ఏర్పాటుతో యూనివర్సిటీ స్థాయి శాస్త్రవేత్తలు స్థానికంగా అందుబాటులో ఉండే అవకాశం ఉంటుంది. తద్వారా కంది తదితర పప్పుధాన్యాల పరిశోధలు విస్తృతమవుతాయని శాస్త్రవేత్తలు అభిప్రాయపడుతున్నారు.
రైతులకు మేలు..
ప్రస్తుతం తాండూరు పరిశోధన కేంద్రంలో కొత్త రకాల పరిశోధనలకు, యాజమాన్య పద్ధతులకు సంబంధించిన శాస్త్రవేత్తలు ఉన్నారు. ఈమేరకే పరిశోధనలు జరుగుతున్నాయి. పశ్చిమ గోదావరి జిల్లాలోని మారుతేరులో రైస్ రీసెర్చ్ స్టేషన్ కు ఏపీ రైస్ రీసెర్చ్ స్టేష్టన్ హోదా ఉంది. అదే మాదిరిగా కందికి ప్రసిద్ధిగాంచిన తాండూరు పరిశోధన కేంద్రాన్ని తెలంగాణ పప్పుధాన్యాల రీసెర్చ్ కేంద్రంగా హోదా కల్పించిట్లైతే కీటక, తెగుళ్ల నివారణ విభాగానికి సంబంధించి శాస్త్రవేత్తలు అందుబాటులోకి వస్తారు. తద్వారా పరిశోధనలు విస్తృతమవుతాయని శాస్త్రవేత్తలు అంటున్నారు. చీడపీడల బెడదతో తీవ్రంగా నష్టపోతున్న రైతులకు మేలు జరుగుతుందంటున్నారు.
ఏటా రూ.50కోట్ల కందుల వ్యాపారం..
తాండూరు వ్యవసాయ మార్కెట్ యార్డులో ఏటా సుమారు రూ.50కోట్ల కందుల వ్యాపారం జరుగుతుంది. లక్ష క్వింటాళ్ల వరకు విక్రయాలు జరుగుతాయి. మార్కెట్ కమిటీకి 1శాతం చొప్పున రూ.50లక్షల మార్కెట్‌ఫీజు ఆదాయంగా వస్తుంది. బోర్డు ఏర్పాౖటెతే ఆధునిక సాంకేతిక పరిజ్ఞానం రైతుల ముంగిట్లోకి వస్తుంది. తద్వారా కంది సాగు విస్తీర్ణం గణనీయంగా పెరిగి దిగుబడులు అధికమవుతాయి. రైతులకు మేలుతోపాటు మార్కెట్ కమిటీకి ఫీజు ఆదాయం కూడా పెరిగే అవకాశం ఉంది.
ఎన్నికల ప్రచారంలో సీఎం హామీ..
2014 ఎన్నికల ప్రచారంలో భాగంగా తాండూరుకు విచ్చేసిన కేసీఆర్ తాండూరు కందులు, కందిపప్పు ప్రత్యేకతల గురించి ప్రస్తావించారు. అధికారంలోకి వచ్చిన తరువాత కంది పరిశోధనలు మరింత విస్తృత పరిచేందుకు కృషి చేస్తానని హామీ ఇచ్చారు. ఇందులో భాగంగా తాండూరులో కంది బోర్డు ఏర్పాటుకు రాష్ట్ర రవాణా శాఖ మంత్రి పి.మహేందర్‌రెడ్డి స్థానిక వ్యవసాయ శాస్త్రవేత్తలతో ఇటీవల చర్చించారు. కంది బోర్డుతో రైతులకు ఒనగూరే ప్రయోజనాలు, పంటలసాగులో అందుబాటులోకి వచ్చే సాంకేతిక పరిజ్ఞానం తదితర అంశాలను శాస్త్రవేత్తలు మంత్రి దృష్టికి తీసుకువచ్చారు. ఈ దిశగా తెలంగాణ సర్కారు మరింత చొరవ చూపితే తాండూరులో కందిబోర్డు అందుబాటులోకి వచ్చే అవకాశం ఉంది. తద్వారా జిల్లా రైతులకు మేలు కలుగుతుందనే అభిప్రాయం శాస్త్రవేత్తల్లో వ్యక్తమవుతోంది.
జాతీయస్థాయి పరిశోధనలు
అఖిలభారత సమన్వయ పరిశోధన కార్యక్రమం కింద తాండూరు పరిశోధన కేంద్రం ఎంపికైంది. జాతీయస్థాయిలో కంది పరిశోధనలు ఇక్కడ జరుగనున్నాయి. ఇందు కోసం ప్రత్యేకంగా ఇద్దరు శాస్త్రవేత్తలు నియామకం కానున్నారు. 2017–18 సంవత్సరం నుంచి ఈ పరిశోధనలు తాండూరులో మొదలుకానున్నాయి. కంది బోర్డు అందుబాటులోకి వస్తే ప్రత్యేకంగా కంది పరిశోధనలకు ఆస్కారం కలుగుతుంది. యూనివర్సిటీ స్థాయి శాస్త్రవేత్తలు రైతులకు అందుబాటులో ఉంటారు. వికారాబాద్‌జిల్లా రైతులకు మేలు జరుగుతుంది.
–డా.సుధాకర్, సీనియర్ శాస్త్రవేత్త, తాండూరు
Advertisement
Advertisement