ఐస్‌క్రీమ్‌, చీరల్ని కాదు.. 'మిర్చి' అమ్మండి | congress mal jeevan reddy slams kcr government over Red Chillies Prices | Sakshi
Sakshi News home page

ఐస్‌క్రీమ్‌, చీరల్ని కాదు.. 'మిర్చి' అమ్మండి

Published Tue, Apr 25 2017 7:25 PM | Last Updated on Mon, Mar 18 2019 8:57 PM

ఐస్‌క్రీమ్‌, చీరల్ని కాదు.. 'మిర్చి' అమ్మండి - Sakshi

ఐస్‌క్రీమ్‌, చీరల్ని కాదు.. 'మిర్చి' అమ్మండి

హైదరాబాద్‌: ఏసీ రూముల్లో ఐస్‌క్రీమ్‌లు, చీరలు అమ్మినట్లే రైతులు ఏడాది కష్టపడి పండించిన మిర్చి పంటను అమ్మించాలని మాజీమంత్రి, సీఎల్పీ ఉపనాయకుడు జీవన్‌రెడ్డి అన్నారు. ఆయన మంగళవారం ఇక్కడ విలేకరులతో మాట్లాడుతూ మంత్రి కేటీఆర్‌ ఐస్‌క్రీమ్‌ను నిమిషాల్లోనే అమ్మి 7లక్షలు సంపాదించాడని, ఏడాది కష్టపడి పండించిన పంటను రైతులు అమ్ముకోలేకపోతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. కేటీఆర్‌ ఐస్‌క్రీమ్‌లు అమ్మి, సీఎం కూతురు కవిత చీరలు అమ్మి నిమిషాల మీదనే లక్షలు సంపాదిస్తున్నారని అన్నారు.

అదే మార్కెటింగ్‌ నైపుణ్యంతో రైతులు పండించిన పంటను అమ్మాలని జీవన్‌ రెడ్డి సూచించారు. గిట్టుబాటు ధర లేక, కొనేవారు లేక రైతులు అలమటిస్తుంటే, ముఖ్యమంత్రికి కనిపించడంలేదా అని ప్రశ్నించారు. పక్కరాష్ట్రాల్లో ఇస్తున్నట్టుగా తెలంగాణ ప్రభుత్వం కూడా రైతులు పండించిన పంటకు బోనస్ ప్రకటించాలని డిమాండ్‌ చేశారు. రైతుల దృష్టి మళ్లించడానికే వచ్చే సంవత్సరం నుండి ఉచిత ఎరువులు అని  కేసీఆర్ ప్రచారం చేసుకుంటున్నాడని జీవన్‌రెడ్డి విమర్శించారు. కాంగ్రెస్ ప్రభుత్వ హయాంలో పంటలకి బోనస్ ఇచ్చామని గుర్తుచేశారు.

1800 ఉన్న పత్తి విత్తనాల ధరను 800కి తగ్గించిన ఘనత నాటి ముఖ్యమంత్రి వై.ఎస్‌.రాజశేఖర్‌రెడ్డిది అని చెప్పారు. ప్రచారానికి, ఆర్భాటాలకు తప్ప అమలు చేయడంలో సీఎం కేసీఆర్‌ విఫలమయ్యారని జీవన్‌రెడ్డి విమర్శించారు. రైతాంగం కన్నీరు పెట్టడం రాష్ట్రానికి మంచిది కాదని హెచ్చరించారు. మిర్చి రైతులకు న్యాయమైన ధరను చెల్లించి, ఎక్కువ వచ్చిన డబ్బును టీఆర్‌ఎస్‌ సభలకే ఖర్చు పెట్టుకోవచ్చునని ఆయన సూచించారు. రైతులను పిలిపించుకుని వారి సమస్యలు, సలహాలు తీసుకోకుండా కేసీఆర్‌ ఊకదంపుడు ఉపన్యాసాల వల్ల ఫలితం శూన్యమని ఎద్దేవా చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement