'కేసులపై కేసీఆర్ వివరణ ఇవ్వాలి'
సాక్షి, హైదరాబాద్: గతంలో కేంద్ర మంత్రిగా ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు చేసిన అక్రమాలపై విచారణ జరుగుతున్నదని, ఈ నేరారోపణలకు సంబంధించి ఆయన ప్రజలకు సమాధానం చెప్పాలని బీజేపీ నేత నాగం జనార్దన్‌రెడ్డి డిమాండ్ చేశారు. గురువారం ఇక్కడ ఆయన విలేకరులతో మాట్లాడుతూ ఒక ముఖ్యమంత్రిని అవినీతి కేసులో సీబీఐ విచారించడం రాష్ట్ర ప్రజలకు అవమానమని వ్యాఖ్యానించారు.
కేంద్రమంత్రిగా కేసీఆర్ ఉన్నప్పుడు అర్హతలేని వెలుగుబంటి సూర్యనారాయణకు ఈఎస్‌ఐ పనులను అప్పగించారని, భవిష్యనిధి నుంచి సహారా కంపెనీకి సడలింపులు ఇవ్వడంలోనూ అక్రమాలకు పాల్పడినట్టుగా వస్తున్న ఆరోపణలపై స్పందించాలని నాగం డిమాండ్ చేశారు.
ఈఎస్‌ఐ ఆసుపత్రుల నిర్మాణం, సహారా గ్రూపుకు మేలు చేయడానికి నిబంధనలకు విరుద్దంగా వ్యవహరించినట్లు ఆరోపణలు, విచారణ ఎదుర్కొంటున్న ముఖ్యమంత్రి ప్రజలకు సమాధానం చెప్పాలన్నారు. మిషన్ కాకతీయ, వాటర్‌గ్రిడ్‌లో ఎక్కడా లేని అవినీతి జరగుతున్నదన్నారు. వీటిపై విచారణ జరిపించాలన్నారు. నిబంధనలను అతిక్రమించేవిధంగా అధికారులు పనిచేయకూడదని, తప్పులు చేస్తే అధికారులు కూడా శిక్షను అనుభవించాల్సి ఉంటుందని నాగం హెచ్చరించారు.