మరో పదేళ్లు సీఎం అని ఎలా అంటారు?
బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగం
సాక్షి, హైదరాబాద్: మరో పదేళ్లు ముఖ్యమంత్రిగా కేసీఆరే ఉంటారని మంత్రి కేటీఆర్ ఎలా చెబుతారని బీజేపీ జాతీయ కార్యవర్గ సభ్యుడు నాగం జనార్దన్‌రెడ్డి ప్రశ్నించారు. తెలంగాణ కేసీఆర్ తాత జాగీరా అని మంగళవారం నిలదీశారు. కేసీఆర్ భవిష్యత్ గురించి జైల్లో ఉన్న శశికళను అడగాలని వ్యంగ్యోక్తి విసిరారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్ కుటుంబ పాలనకు రోజులు దగ్గర పడ్డాయన్నారు. మంత్రిగా కేటీఆర్ వద్దనున్నది.. మిగతా మంత్రుల వద్ద లేనిది ఏమిటో చెప్పాలని డిమాండ్ చేశారు.
కేటీఆర్ తప్ప కేబినెట్‌లో ఇతరులెవరూ సమర్థులు కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ ఉద్యమ సమయంలో కేటీఆర్ ఎక్కడున్నారని ప్రశ్నించారు. ప్రజలతో టచ్‌లో లేనంటున్న కేటీఆర్ కాంట్రాక్టర్లతో టచ్‌లో ఉన్నారని ఆరోపించారు. కేటీఆర్ తన అహంకారాన్ని తగ్గించుకోవాలని హితవు పలికారు. ముస్లింలకు పెంచిన రిజర్వేషన్లను వెంటనే వెనక్కు తీసుకోవాలని డిమాండ్ చేశారు. సచివాలయంలో ఫైళ్లు పేరుకుపోతున్నాయని, వాటిని క్లియర్ చేసి ప్రజలకు తగిన పాలన అందించడంలో ప్రభుత్వం విఫలమవుతోందని విమర్శించారు. టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వచ్చాక రూ.62 వేల కోట్ల మేర అప్పులు చేసిందని, ఆ అప్పులను దేనికి ఖర్చు చేశారో చెప్పాలని డిమాండ్ చేశారు.