హైదరాబాద్ : తెలంగాణ ముఖ్యమంత్రి కేసీఆర్పై బీజేపీ సీనియర్ నేత నాగం జనార్దన్రెడ్డి గురువారం హైదరాబాద్లో నిప్పులు చెరిగారు. ఎర్రవల్లికి సర్పంచ్వా ? లేకా రాష్ట్రానికి సీఎంవా ? అంటూ కేసీఆర్ను నాగం జనార్దన్ రెడ్డి సూటిగా ప్రశ్నించారు. ప్రాజెక్టుల మధ్య నిద్ర పోతానన్నావు.. ఏమైందని నిలదీశారు. ప్రాజెక్టుల అంచనాలు పెంచి.. అవినీతి తారా స్థాయికి చేర్చారని ఆరోపించారు.
మాట ఇచ్చి తెలంగాణకు మద్దతు ఇచ్చిన పార్టీలను కేసీఆర్ ఆవిర్భావ దినోత్సవం రోజున మరిచారని విమర్శించారు. కేవలం కేసీఆర్... ఆయన కుటుంబ సభ్యుల వల్లనే తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం వచ్చినట్లు కేసీఆర్ వ్యవహరించడం బాధాకరమన్నారు. పార్లమెంట్లో తెలంగాణ బిల్లు పాస్ చేయించిన ఘనత సుష్మ, రాజనాథ్ సింగ్, అరుణ్ జైట్లీదని నాగం జనార్దన్రెడ్డి గుర్తు చేశారు.
అలాంటిది ఈ ఆవిర్భావ వేడుకల్లో వారి పేర్లను కూడా కేసీఆర్ ఉచ్ఛరించలేదన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్ కుట్రదారుడు అని నాగం జనార్దన్రెడ్డి అభివర్ణించారు. బీజేపీ, ఇతర పార్టీల మద్దతు లేకుంటే తెలంగాణ వచ్చేదా? అని కేసీఆర్ని నాగం జనార్దన్రెడ్డి ప్రశ్నించారు. మీ కుటుంబం అవినీతి బయటపెట్టడానికి నేను రెడీ అంటూ కేసీఆర్కు నాగం జనార్దన్రెడ్డి సవాల్ విసిరారు.
ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ఉస్మానియాలో మీటింగ్కు అనుమతి ఇవ్వని నీచ బుద్ధి నీదంటూ కేసీఆర్పై మండిపడ్డారు. టోటల్ పేరెంటల్ న్యూట్రిషన్తో నిమ్స్లో దీక్ష చేసిన వ్యక్తి కేసీఆర్ అని విమర్శించారు. ఉస్మానియాలో విద్యార్థులకు మీటింగ్ పెట్టుకునే హక్కు లేదా అని ప్రశ్నించారు. రాజ్యాంగాన్ని, శాసన వ్యవస్థను అవమానపరుస్తున్నారని కేసీఆర్పై ఆగ్రహం వ్యక్తం చేశారు. రాజకీయ పార్టీలను అణగదొక్కుతున్నావని... అలాగే పత్రికల స్వతంత్రం తీసేశావన్నారు. నీ కేబినెట్లో మంత్రులకు పని ఎక్కడుందన్నారు.ఇప్పటికీ నీ ప్రభుత్వంలో ఆంధ్ర పెత్తనమే నడుస్తోందన్నారు. ఇంత అవినీతి... గత ప్రభుత్వ కాలంలోనే లేవన్నారు. ప్రాజెక్టుల అంచనాలు ఇష్టం వచ్చినట్లు పెంచారని చెప్పారు. అవినీతిని తార స్థాయికి తీసుకెళ్లావన్నారు.
ప్రజలే నీకు ప్రతిపక్షం అని.... ఖచ్చితంగా 2019లో అధికారంలోకి తీసుకురావడానికి మా భుజాల మీదకి ఎత్తుకుంటామన్నారు. 2019లో ప్రజల ప్రభుత్వాన్ని అందిస్తామని... అందుకు సిద్ధంగా ఉండాలని బీజేపీ కార్యకర్తలకు నాగం పిలుపునిచ్చారు. తెలంగాణ అమరవీరులను గుర్తించడానికి నీకు నీతి లేదన్నారు. వారి కుటుంబాలను కూడా బీజేపీ ఆదుకుంటుందన్నారు. రాష్ట్రంలో కరువుకు కేంద్రం మంజూరు చేసిన నిధులు ఖర్చు పెట్టాలని ఈ సందర్భంగా కేసిఆర్ను డిమాండ్ చేశారు.
కేసిఆర్ అడగక ముందే కేంద్రమంత్రి గడ్కరీ రూ. 42 వేల కోట్లు రాష్ట్రానికి మంజూరు చేశారని గుర్తు చేశారు. నిధులు మంజూరులో నీ పోరాటం ఏముందని ఎద్దేవా చేశారు. ఎర్రవల్లికి సర్పంచ్వా? రాష్ట్రానికి ముఖ్యమంత్రి వా? అని ప్రశ్నించారు. కృష్ణా పరివాహాక ప్రాంత ప్రయోజనాలు కాపాడటానికి బీజేపీ సిద్దంగా ఉందన్నారు. ప్రాజెక్టులకు బడ్జెట్లో పెట్టినది ఎంత ? ఖర్చు పెట్టినది ఎంత ? దీనిలో పొంతన ఉన్నదా ? కాంట్రాక్ట్లు నీ కార్యాలయం లొనే రింగ్ చేసినవి, నీ వాటా ఎంత, ఆంధ్ర కాంట్రాక్టర్ ల వాటా ఎంత, మిషన్ కాకతీయ మీ పార్టీ కార్యకర్తలకు దోచిపెట్టడానికే అని నాగం జనార్దన్ రెడ్డి విమర్శించారు.