ప్రభుత్వ నిర్లక్ష్యం వల్లే రైతుల ఆత్మహత్యలు: నాగం
హైదరాబాద్: అధిక ఆదాయం వచ్చిన రాష్ట్రంగా అగ్రభాగాన ఉన్నప్పటికీ రైతుల రుణమాఫీ పూర్తిస్థాయిలో ఎందుకు చేయడం లేదని ప్రభుత్వాన్ని బీజేపీ నేత నాగం జనార్దన్ రెడ్డి ప్రశ్నించారు. మూడో విడత రుణమాఫీ కింద రూ.4,023 కోట్లు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని శనివారం డిమాండ్ చేశారు. రైతులను ఇబ్బంది పెట్టడంలోనూ టీఆర్‌ఎస్ ప్రభుత్వం అగ్రభాగాన ఉందని ధ్వజమెత్తారు. డబుల్ బెడ్రూం ఇళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 3 ఎకరాల భూమి, కేజీ టు పీజీ, విద్యార్థులకు ఫీజు రీయింబర్స్‌మెంట్ వంటి పథకాలను ఎందుకు అమలు చేయలేకపోతున్నారని నిలదీశారు. పంట నష్టం, ఇన్‌పుట్ సబ్సిడీ కింద కేంద్రం విడుదల చేసిన రూ.791 కోట్లు రాష్ట్ర ప్రభుత్వం ఎందుకు ఖర్చు చేయలేదని అడిగారు.
రైతుల సమస్యలకు టీడీపీ, బీజేపీ కారణమని మంత్రి పోచారం శ్రీనివాసరెడ్డి చెబుతున్నారని, బీజేపీ ఏ విధంగా కారణమో చెప్పాలన్నారు. రాష్ట్రానికి కావాల్సిన యూరియాను కేంద్రం అందుబాటులో ఉంచినందుకా, ప్రధానమంత్రి ఫసల్ బీమా పెట్టినందుకా అని ప్రశ్నించారు. రాష్ట్ర మంత్రులెవరికీ హక్కులు, అధికారాలు లేనందున తమ ప్రశ్నలకు సీఎం కేసీఆర్ సమాధానం చెప్పాలన్నారు. రాష్ట్రం ఆర్థిక క్రమశిక్షణ లోపించి అప్పులపాలు కావడానికి, దివాళాతీయడానికే సీఎం కేసీఆరే కారణమన్నారు. ఒకేసారి రుణమాఫీని చేసి ఉంటే రాష్ట్రంలో రైతుల ఆత్మహత్యలు చోటు చేసుకుని ఉండక పోయేవన్నారు. రాష్ట్ర సమస్యలపై చర్చిస్తే అన్ని విషయాలు బయటకు వస్తాయని నాగం అన్నారు.