కొండలకే ఎసరు
- టీడీపీ పెద్దలపరం కానున్న ఎర్రకొండ, సీతకొండ
- కన్సీల్టెన్సీ ద్వారా ధారాదత్తానికి నిర్ణయం
- వుడా బోర్టు సూత్రప్రాయ నిర్ణయం
సాక్షి ప్రతినిధి, విశాఖపట్నం : భూ బకాసురుల ఆకలి తీర్చడానికి ప్రభుత్వ భూములు చాలవనుకున్నారేమో!... ఆరగించమని ఏకంగా కొండలను వడ్డించేందుకు ప్రభుత్వం సిద్ధపడింది. అందుకే విశాఖ శివారులోని ఎర్రకొండ, సీతకొండలు బంగారు పళ్లెంలో వడ్డించేందుకు ‘వంటవాడి’ని నియమించింది. పీపీపీ ప్రాజెక్టుల రూపంలో ఎర్రకొండ, సీతకొండలను సన్నిహితులకు కట్టబెట్టేందుకు ప్రభుత్వం కన్సెల్టెన్సీని నియమించింది. ఇందుకు వుడా బోర్టు మంగళవారం సూత్రప్రాయ ఆమోదం తెలిపింది. తద్వారా 1,105 ఎకరాల విస్తీర్ణంలోని ఎర్రకొండ, సీతకొండలను తమ అస్మదీయులకు కట్టబెట్టేందుకు మార్గం సుగమంచేసింది. అటవీశాఖ పరిధిలోని ఆ కొండలను డీనోటిఫై చేయాలన్న వుడా ప్రతిపాదనపై కేంద్రం ఇంకా ఆమోదం తెలపనే లేదు. కానీ ఇంతలోనే వాటిని అప్పగించేందుకు కన్సల్టెన్సీని నియమించడం గమనార్హం.
కొండలపై కన్నేశారు : సముద్రతీరానికి సమీపంలో ఎర్రకొండ(893 ఎకరాలు) , సీతకొండ(212 ఎకరాలు) ప్రభుత్వ పెద్దల కన్నుపడింది. 1,105 ఎకరాల్లో ఉన్న ఈ కొండలను ప్రైవేటు-పబ్లిక్ పార్ట్‌నర్‌షిప్(పీపీపీ) పద్దతిలో తమ అస్మదీయులకు కట్టబెట్టాలని భావించింది. అందుకే ఆ కొండలపై క్లబ్‌హౌస్‌లు, రిసార్టులు, కాసినోలు, కన్వెన్షన్ సెంటర్లు నిర్మించాలని నిర్ణయించింది.
కొండలపై 70 ఎకరాల్లో విలాసవంతమైన విల్లాలు నిర్మించి తమ అస్మదీయులు రియల్ ఎస్టేట్ వ్యాపారానికి పథకం వేసింది. అందుకోసం పీపీపీ విధానంలో ప్రాజెక్టుల కోసం కొన్ని నెలల క్రితం టెండర్లు పిలిచింది. మంగళవారం తొలిసారి సమావేశమైన వుడా బోర్డు దీనిపై నిర్ణయం తీసుకుంది. కన్సెల్టెన్సీలను నియమిస్తూ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వానికి నివేదించాలని నిర్ణయించింది. వీఎండీయేగా రూపాంతరం చెందిన వెంటనే కన్సల్టెన్సీ ద్వారా ఆ కొండలను అస్మదీయులపరం చేయాలన్నది ప్రభుత్వ పెద్దల పన్నాగంగా ఉంది.
డీనోటిఫై చేయకుండానే!
కొండలను తమ వారికి ధారాదత్తం చేయాలన్న ఆతృతలో ప్రభుత్వం నిబంధనలకు తిలోదకాలు ఇచ్చేస్తోంది. రక్షిత అటవీప్రాంతం పరిధిలని ఎర్రకొండ, సీతకొండలపై ఎలాంటి నిర్మాణాలు చేపట్టకూడదు. అందుకే ఆ కొండలను అటవీశాఖ పరిధి నుంచి డీనోటిఫై చేయాలని వుడా ద్వారా కేంద్రానికి విజ్ఞప్తి చేసింది. దీనిపై కేంద్ర అటవీ, పర్యావరణ మంత్రిత్వ శాఖ ఇంతవరకు నిర్ణయం తీసుకోలేదు. ఎందుకంటే ఆ కొండలను డీనోటిఫై చేయడం కేంద్ర, రాష్ట్ర పర్యావరణ పరిరక్షణ నిబంధనలకు విరుద్ధం.
అరుదైన ఔషధ మొక్కలతోపాటు పలు జంతు, పక్షులకు అవి ఆవాసంగా ఉన్నాయి. ఆ కొండలను వ్యాపార కేంద్రాలుగా మారిస్తే ఆ జీవజాలం ఉనికికే ముప్పువాటిల్లుతుందని అటవీశాఖ అధికారులు చెబుతున్నారు. కేంద్ర అనుమతి వరకు వేచి చూడకుండా ప్రభుత్వ పెద్దలు వాడా ద్వారా కథ నడపించారు. ముందుగా ఆ రెండు కొండలు దక్కేలా చేసుకునేందకు కన్సెల్టెన్సీ నియామకాన్ని ఖరారు చేయించారు.
మాస్టర్ ప్లాన్‌నూ కాదని..
- మాస్టర్‌ప్లాన్‌లో పేర్కొన్న భూ వినియోగ ప్రణాళికనూ మార్చడానికి వీల్లేదు. ఆ మాస్టర్‌ప్లాన్‌లో ఆ కొండలను పరిరక్షించాల్సిన జాబితాలో చేర్చారు. వాటిని ఇతర అవసరాలకు కేటాయించాలంటే ప్రజాభిప్రాయ సేకరణ జరపాలి. కానీ ఆ ఊసే ఎత్తకుండా ప్రభుత్వం కన్సెల్టెన్సీ ద్వారా కథ నడపించాలని నిర్ణయించింది.
- ప్రభుత్వం సీఆర్‌జెడ్ నిబంధనలనూ ఉల్లంఘిస్తోంది. రెండు కొండలు సీఆర్‌జెడ్ 1, 3 పరిధిలో ఉన్నాయి. అక్కడ నిర్మాణ పనులు చేపట్టంగానీ బోర్లు వేయడంగానీ నిబంధనలకు విరుద్ధం. ఇవేవీ పట్టించుకోకుండా ప్రభుత్వం ఆ రెండు కొండలను తమ వారికి కట్టబెట్టడానికి కార్యాచరణను వేగవంతం చేసింది.
- అడ్డగోలుగా నిబంధనలను ఉల్లంఘిస్తూ మరీ ఎర్రకొండ, సీతకొండలను తమ అస్మదీయుల పరం చేయడానికి ప్రభుత్వం సిద్ధపడటం విస్మయపరుస్తోంది.