అడవులకూ మడత
తీరంలో ఆక్రమణల పర్వం
కనుమరుగువుతున్న మడ అడవులు
కబ్జా చేసిన భూముల్లో ఆక్వా సాగు
ఇప్పటికే వందలాది ఎకరాలు స్వాహా
పర్యావరణానికి పెనుముప్పుగా మారిన వైనం
ఏ మాత్రం పట్టించుకోని అధికార యంత్రాంగం
పర్యావరణానికి అండగా నిలుస్తున్న తీర ప్రాంత ప్రభుత్వ భూములపై కబ్జాదారులు కన్నువేశారు. ఆ భూములను వారు సొంత జాగాగా చేసుకుని ఆక్వాసాగుకు ఉపక్రమిస్తున్నారు. సముద్ర ఆటుపోట్ల సమయంలో తీరానికి రక్షణ వలయంగా ఉండే మడ అడవులను సైతం నరికివేసి దర్జాగా ఆక్వా సాగు చేస్తున్నారు. పర్యావరణానికి పెనుముప్పుగా మారిన ఈ వ్యవహారంపై అధికారుల నోరు పెగలడం లేదు.
భీమవరం:జిల్లాలో సముద్రతీరం 19 కిలోమీటర్లు ఉంది. దీనికితోడు ఉప్పుటేరును అనుకుని మరో 20 కిలోమీటర్ల తీర ప్రాంతం ఉంది. యలమంచిలి, నర్సాపురం, మొగల్తూరు, భీమవరం, కాళ్ల, ఆకివీడు మండలాల్లో సముద్రం, ఉప్పుటేరు తీర ప్రాంతం విస్తరించి ఉంది. ఈ మండలాల్లోని సముద్రం, ఉప్పుటేరును అనుకుని ఉన్న గ్రామాల్లో సుమారు నాలుగువేల ఎకరాల ప్రభుత్వ భూమి ఉంది. ఈ భూముల్లోని అధిక భాగంలో ఇప్పటికే కబ్జాదారులు ఆక్వాసాగు చేస్తున్నారు. మరికొంతమంది దర్జాగా డి నమూనా పట్టాలు సృష్టించి సాగు చేసుకుంటున్నారు. మొగల్తూరు మండలంలోని ఏటుమెండి, పేరుపాలెం, ముత్యాలపల్లి, పాతపాడు, కాళీపట్నం, నర్సాపురం మండలం వేములదీవి, భీమవరం మండలం లోసరి, నాగిడిపాలెం, దొంగపిండి, కాళ్ల మండలం మోడి, గోగితిప్పా తదితర గ్రామాల్లో వందలాది ఎకరాల తీర ప్రాంత భూములు కబ్జాకు గురయ్యాయి. ఉప్పుటేరు, సముద్ర వెంబడి ఉన్న భూములను ఆక్రమించి వాటిలో ఉన్న మడ, ఆల్చి, ఇతర అడవులను నరికివేస్తున్నారు. రాత్రికి రాత్రే చేపలు, రొయ్యల చెరువులుగా మార్చేస్తున్నారు. దీనితో కాలుష్య కోరల్లో తీర ప్రాంతం చిక్కు కుంటుంది.
పర్యావరణానికి పెనుముప్పు
తీర ప్రాంతంలో ఉన్న మడ అడవులతోపాటు ఇతర చెట్లను నరికివేయడం వల్ల పర్యావరణానికి పెనుముప్పు ఏర్పడుతుందని పర్యావరణ వేత్తలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. తీరం కూడా భారీగా కోతకు గురువుతుందంటున్నారు. దీన్నిపై ప్రభుత్వం దృష్టి సారించాలని సూచిస్తున్నారు.
పట్టించుకోని అధికారులు
తీరం ప్రాంతంలోని భూములను కబ్జా చేసి ఆక్వా సాగు చేసుకుంటున్నా జిల్లా అధికార యంత్రాంగం పట్టించుకోవపోవడంపై పలు అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. కాళ్ల వంటి మండలంలోనే అధికంగా సుమారు రెండువేల ఎకరాల వరకు ప్రభుత్వ భూములకు డి నమూన పట్టాలు పొంది కొంతమంది బడా రైతులు వాటిని తమ సొంత భూములుగా చేసుకుని ఆక్వాసాగు చేస్తూ రూ. కోట్లు ఆర్జిస్తున్నారు. ఉప్పుటేరు వెంబడి ఉన్న భూములను కబ్జా చేసి చేపల చెరువుల్లో కలుపుకుని సాగు చేస్తున్నా అధికారుల పట్టించుకోకపోవడంపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.