రెడ్ మార్క్ !
సాక్షి ప్రతినిధి,గుంటూరు :
నవ్యాంధ్ర రాజధాని నిర్మాణం కోసం జరుగుతున్న సర్వేలో ప్రభుత్వ భూముల వివరాలతోపాటు కొందరు రియల్టర్ల అక్రమాలూ వెలుగులోకి వస్తున్నాయి. చెరువులు, అసైన్డ్‌భూములను కొందరు ఆక్రమిస్తే, సామాజిక స్థలాలను మరి కొందరు విక్రయించి సొమ్ము చేసుకున్నారు. జిల్లా యంత్రాంగం నిర్వహిస్తున్న భూముల సర్వేలో ఇవన్నీ వెలుగులోకి వస్తుండటంతో అక్రమార్కుల వెన్నులో చలిపుడుతోంది.
‘ఎంకి పెళ్లి సుబ్బి చావుకు వచ్చిందనే’ రీతిలో ఇరవై ఏళ్ల నాటి అక్రమాలు వెలుగులోకి వస్తున్నాయి.
ఈ స్థలాల జాబితాను రూపొందించిన రెవెన్యూ శాఖ వాటి రిజిస్ట్రేషన్లపై నిషేధం విధించడంతో అప్పటి కొనుగోలుదారులు పూర్తిగా నష్టపోతున్నారు.
వీరంతా అప్పట్లో 200 చదరపు గజాల స్థలాన్ని రూ. ఆరు వేల నుంచి 60 వేలకు కొనుగోలు చేసినా, ప్రస్తుత మార్కెట్ ప్రకారం ధర చెల్లించాలని రియల్టర్లపై ఒత్తిడి చేస్తున్నారు.
అప్పట్లోనే రియల్ భూమ్..
రాష్ట్రంలో మిగిలిన ప్రాంతాల కంటే గుంటూరు జిల్లాలో ఇరవై సంవత్సరాల కిందట రియల్ ఎస్టేట్ వ్యాపారం అధికంగా జరిగింది.
వ్యవసాయ భూముల్లో లే అవుట్లు వేసిన కొన్ని ప్రముఖ కంపెనీలు స్థలాలు విక్రయించాయి.
ఆ సమయంలో తమ వ్యవసాయ భూములకు సరిహద్దునే ఉన్న చెరువులు, అసైన్డ్‌ల్యాండ్స్‌ను కలుపుకుని వెంచర్లు వేశాయి.
ఈ లేఅవుట్లకు వీజీటీఎం ఉడా అనుమతి ఇవ్వడంతో స్థలాలు వేగంగానే అమ్ముడు పోయాయి. ఇలా అనుమతి ఇచ్చిన లే అవుట్లోని సామాజిక స్థలాలనూ కొందరు రియల్టర్లు విక్రయించి సొమ్ము చేసుకున్నారు.
గుంటూరుకు సమీపంలోని పెదకాకాని, కాజ, మంగళగిరి, తెనాలిలో ఈ తరహా స్థలాల అమ్మకాలు ఎక్కువగా జరిగాయి.
రాజధానికి నిర్మాణం కోసం జరుగుతున్న సర్వేలో ఆక్రమణకు గురైన చెరువులు, అసైన్డ్ భూముల వివరాలను రెవెన్యూశాఖ సేకరించింది. వీటిల్లో వేసిన వెంచర్లకు సంబంధించిన స్థలాలపై రెడ్ మార్కు పెట్టి కొత్తగా రిజిస్ట్రేషన్ చేయకూడదని నిషేధం విధించింది.
మరో వైపు అక్రమ లేఅవుట్లపై వీజీటీఎం ఉడా దృష్టి సారించింది. ఒక్క తెనాలి, గుంటూరు డివిజన్‌లలో సుమారు 12 వేల అనధికార లే ుట్లను గుర్తించి వాటి వివరాలను రిజిస్ట్రేషన్ కార్యాలయాలకు అందజేసింది. దీంతో ఈ స్థలాలను కొత్తగా ఎవరైనా కొనుగోలు చేసినా, వాటి రిజిస్ట్రేషన్లు మాత్రం జరగడం లేదు. వీటిని అమ్మిన ప్రముఖ కంపెనీలు, రియల్టర్లపై కొనుగోలుదారుల ఒత్తిడి పెరిగింది. కొందరిపై పోలీస్‌స్టేషన్‌లో ఫిరా్యాదు చేస్తున్నారు.