సాక్షి, హైదరాబాద్: దివ్యాంగుల సంక్షేమ ఫలాలు పేపర్లకే పరిమితం అవుతున్నాయని, అధికారులు ఏసీ గదుల్లో కూర్చుని సమీక్షలు చేస్తే అంతా భేషుగ్గానే ఉంటుందని హైకోర్టు అభిప్రాయపడింది. గ్రామ స్థాయిలో తనిఖీలు చేస్తే విస్తుపోయే నిజాలు బయట పడతాయని, దీని కోసం ఒకే ఒక్క జిల్లాలో అధ్యయనం చేస్తే సరిపోతుందని వ్యాఖ్యానించింది. గత 60 ఏళ్లుగా వృద్ధాశ్రమాల్లో 80– 90 ఏళ్ల వయసు వాళ్లు ఉండాల్సిన దుస్థితి ఏర్పడిందని ఆవేదన వ్యక్తం చేసింది. వసతులు లేని బ్రిటిష్ కాలంలోనే చాలా లోతుగా సమాచారాన్ని సేకరించారని, ఇప్పుడు అన్ని వసతులు, సాంకేతికత అరచేతిలో ఉన్నా ఎందుకు చేయలేకపోతున్నారని ప్రశ్నించింది. అలస్కా మంచు తుపానులో కదల్లేకపోయిన వారిని వదిలేసినట్లుగా ఉండకూడదని ఘాటు వ్యాఖ్య చేసింది.
లాక్‌డౌన్‌లో దివ్యాంగుల సమస్యల పరిష్కారానికి ఉత్తర్వులివ్వాలంటూ హైదరాబాద్‌కు చెందిన గణేశ్ కర్నాటి దాఖలు చేసిన పిల్‌ను ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం బుధవారం విచారించింది. కోర్టు విచారణకు హాజరైన మహిళాభివృద్ధి, శిశు సంక్షేమ కమిషనర్ దివ్య కల్పించుకుని దేశంలోనే అత్యధికంగా తెలంగాణ ప్రభుత్వం దివ్యాంగుల పెన్షన్ల కోసం రూ.1,800 కోట్లు కేటాయించిందని, నెలకు రూ. 3,016 చొప్పున ఇస్తున్నట్లు తెలిపారు. దివ్యాంగులకు అత్యవసరాల కోసం రూ.3.5 కోట్లను సిద్ధంగా ఉంచిందన్నారు. దీనిపై స్పందిం చిన ధర్మాసనం, లాక్‌డౌన్‌లో ఇబ్బందిపడే వారి కోసం రూ.10 కోట్లతో ప్రత్యేక నిధిని ఏర్పాటు చేయలేని పరిస్థితుల్లో ప్రభుత్వం ఉందా అని ప్రశ్నించింది.
వరంగల్ అర్బన్, రూరల్ జిల్లాల్లో 45 వేల మంది దివ్యాంగులు ఉంటే ఆ జిల్లాలకు రూ.లక్ష కేటాయిస్తే ఏ మూలకు సరిపోతాయని అడిగింది. 2011 జనాభా లెక్కల ప్రకారం రాష్ట్రం లో 10.46 లక్షల మంది దివ్యాంగులు ఉంటే ఇప్పుడు పెరిగే ఉంటారని, వారి జనాభాకు అనుగుణంగా సంక్షేమ పథకాలు అమలు చేయకపోతే ఎలాగని ప్రశ్నించింది. దివ్యాంగుల బతుకులు మరొకరికి భారం కాకూడదని హితువు చెప్పింది. దీనిపై దివ్య సమాధానమిస్తూ.. అంగన్‌వాడీ వర్కర్ల ద్వారా రూ.3.5 కోట్ల నిధి గురించి వీడి యో కాన్ఫరెన్స్‌లో వివరించామని, 1,533 మంది దరఖాస్తులు చేసుకున్నారని చెప్పారు. అనంతరం విచారణ జూలై 16కి వాయిదా పడింది.
మాయమైపోతున్న ప్రభుత్వ భూములు
సాక్షి, హైదరాబాద్: నిన్న మొన్నటి వరకు కళ్ల ముందు కనబడిన ప్రభుత్వ భూములు, చెరువులు మాయం అవుతుంటే ప్రభుత్వం ఆక్రమణదారులపై చర్యలు తీసుకోవడానికి ఎందుకు మీనమేషాలు లెక్కిస్తోందని హైకోర్టు ప్రశ్నించింది. రాజేంద్రనగర్ మండలం పుప్పాలగూడ చెరువు, కుత్బుల్లాపూర్ మండలం సూరారంలోని కట్టమైసమ్మ చెరువు, మూసీ నది ఆక్రమణలపై దాఖలైన ప్రజాహిత వ్యాజ్యాలన్నింటినీ కలిపి ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, జస్టిస్ బి.విజయసేన్‌రెడ్డిల ధర్మాసనం బుధవారం విచారించింది. మూసీ నది గురించి గూగుల్‌లో చూస్తే ఎంతగా ఆక్రమణలకు గురైందో తెలుస్తుందని, మురుగు నీటిని మూసీలోకి మళ్లిస్తుంటే అధికారులు ఎందుకు చర్యలు తీసుకోవడం లేదని ప్రశ్నించింది. మూసీ నదికి సమీపం లోని వారు కాలుష్యంతో కలిసి కాపురం చేయాల్సిన దుస్థితి ఏర్పడిందని వ్యాఖ్యానించింది. ప్రభుత్వ వాదనలు ఒకే రీతిగా లేకపోవడాన్ని తప్పుబట్టింది. మాస్టర్‌ప్లాన్, రెవెన్యూ, నీటిపారుదల, హెచ్‌ఎండీఏ రికార్డుల్లో అక్కడ ఏముందో పూర్తి వివరాలు నివేదించాలని ఆదేశిం చింది. వాదనల అనంతరం విచారణను వచ్చే నెల 15కి వాయిదా వేసింది.
Comments
Please login to add a commentAdd a comment