సాక్షి, అమరావతి: రాష్ట్రంలో సంక్షేమ పథకాల అమలు కోసం అవసరమైన నిధులను సమీకరించే నిమిత్తం ప్రభుత్వ భూములను విక్రయించేందుకు ఈనెల 28న జరగనున్న తొలిదశ ఆన్‌లైన్ వేలం ప్రక్రియను నిలుపుదల చేసేందుకు హైకోర్టు నిరాకరించింది. ఈ వ్యవహారంలో ఈ దశలో ఎటువంటి ఉత్తర్వులు జారీచేయడం సాధ్యంకాదని తేల్చిచెప్పింది. అయితే, ఈ భూముల విక్రయాలు మాత్రం ఈ వ్యాజ్యంలో తాము వెలువరించే తుది తీర్పునకు లోబడి ఉంటాయని హైకోర్టు స్పష్టంచేసింది. ఈ మొత్తం వ్యవహారంలో పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది.
తదుపరి విచారణను ఈ నెల 28కి వాయిదా వేసింది. ఈ మేరకు న్యాయమూర్తులు జస్టిస్ రాకేష్‌కుమార్, జస్టిస్ కంచిరెడ్డి సురేష్‌రెడ్డిలతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీచేసింది. ప్రభుత్వం తలపెట్టిన భూముల విక్రయాన్ని అడ్డుకోవాలని కోరుతూ సామాజిక కార్యకర్త సురేష్‌బాబు హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేసిన విషయం తెలిసిందే. ఈ వ్యాజ్యంపై మంగళవారం జస్టిస్ రాకేష్‌కుమార్, జస్టిస్ సురేష్ రెడ్డిలతో కూడిన ధర్మాసనం విచారణ జరిపింది.
రాజకీయ ముసుగులో ‘పిల్’లు
ఈ సందర్భంగా ప్రభుత్వం తరఫున అదనపు అడ్వొకేట్ జనరల్ (ఏఏజీ) పొన్నవోలు సుధాకర్‌రెడ్డి వాదనలు వినిపిస్తూ.. అణగారిన వర్గాలు, కోర్టులను ఆశ్రయించలేని పేదలు, తదితరుల కోసం ఉద్దేశించిన ప్రజాప్రయోజన వ్యాజ్యం (పిల్) నేడు తీవ్రస్థాయిలో దుర్వినియోగమవుతోందని వివరించారు. రాజకీయ, వ్యక్తిగత ప్రయోజనాల ముసుగులో ‘పిల్’లు దాఖలు చేయడం ఇటీవల కాలంలో ఎక్కువైపోయిందన్నారు. ఇప్పుడు ప్రభుత్వ భూముల విక్రయాన్ని అడ్డుకోవాలంటూ దాఖలు చేసిన ఈ వ్యాజ్యం కూడా రాజకీయ ప్రయోజనాలను ఆశించే దాఖలు చేశారని వివరించారు. పిల్‌ను దుర్వినియోగం చేయడమంటే, అది న్యాయ ప్రక్రియను దుర్వినియోగం చేయడమేనన్నారు.
భూములమ్మే అధికారం ప్రభుత్వానికి ఉంది
ప్రభుత్వ భూములను విక్రయించడం ఇదేమీ మొదటిసారి కాదని, గత ప్రభుత్వాలు కూడా విక్రయించాయని ధర్మాసనం దృష్టికి పొన్నవోలు తీసుకొచ్చారు. ప్రభుత్వ భూములను విక్రయించే అధికారం ప్రభుత్వానికి ఉందని.. విక్రయించరాదని ఎక్కడా నిషేధం లేదన్నారు. ధర్మాసనం జోక్యం చేసుకుంటూ, లాక్‌డౌన్ సమయంలో ఏ రకమైన వేలం ప్రక్రియలు చేపట్టరాదని హైకోర్టు గతంలోనే ఆదేశాలిచ్చింది కదా అని గుర్తుచేసింది. వేలం విషయంలో ప్రభుత్వాన్ని నియంత్రించలేదని సుధాకర్‌రెడ్డి తెలిపారు.
అయినా.. పేద రాష్ట్రంగానే ఎందుకుంది?
అందరి వాదనలు విన్న ధర్మాసనం, మధ్యంతర ఉత్తర్వులు జారీచేయడానికి నిరాకరించింది. అయితే.. భూముల విక్రయాలు మాత్రం తుది తీర్పునకు లోబడి ఉంటాయని స్పష్టంచేసింది. పూర్తి వివరాలతో కౌంటర్ దాఖలు చేయాలని ప్రభుత్వాన్ని ఆదేశించింది. ఈ సమయంలో ధర్మాసనం కొన్ని ఆసక్తికర వ్యాఖ్యలు చేసింది. ‘ఆంధ్రప్రదేశ్‌లో మంచి సారవంతమైన భూములున్నాయి.. మంచి పంటలు పండుతాయి.. ఇక్కడ ప్రజలు సంపన్నులు.. అయినప్పటికీ పేద రాష్ట్రంగానే ఎందుకుంది’ అని వ్యాఖ్యానించింది. దీనికి సుధాకర్‌రెడ్డి బదులిస్తూ.. రాష్ట్ర విభజన తరువాతే ఏపీ ఆర్థికంగా బాగా నష్టపోయిందని, పరిశ్రమలన్నీ హైదరాబాద్‌లోనే ఉండిపోయాయని చెప్పారు. ప్రభుత్వం తీసుకునే ప్రతీ విధాన నిర్ణయాన్ని ఇలా రాజకీయ కారణాలతో సవాలు చేస్తూ ఉంటే తాము చేసేది ఏముంటుందని సుధాకర్‌రెడ్డి తెలిపారు. తాము రాజకీయాల జోలికి వెళ్లడంలేదంటూ ధర్మాసనం విచారణను వాయిదా వేసింది.
గతంలో లాగా జేబులు నింపుకోవడానికి అమ్మడంలేదు..
డబ్బు కోసం ఇలా ప్రభుత్వ భూములను అమ్మడం సబబేనా? అని ధర్మాసనం ప్రశ్నించింది. గతంలో లాగా జేబులు నింపుకోవడానికి భూములు అమ్మడంలేదని.. ప్రజా సంక్షేమ కార్యక్రమాల అమలుకు అవసరమైన నిధుల కోసం భూములు అమ్ముతున్నామని సుధాకర్‌రెడ్డి చెప్పారు. ఈ సమయంలో పిటిషనర్ తరఫున న్యాయవాది నర్రా శ్రీనివాసరావు జోక్యం చేసుకుంటూ.. గుంటూరులో మార్కెట్ స్థలాన్ని అమ్మేస్తున్నారని చెప్పారు. దీనిపై ప్రభుత్వ ప్రత్యేక న్యాయవాది కాసా జగన్‌మోహన్‌రెడ్డి అభ్యంతరం తెలిపారు. అక్కడ ఇప్పుడు మార్కెట్ లేదని, మరోచోట మార్కెట్ నిర్మించామని, చక్కగా అక్కడ కార్యకలాపాలు సాగుతున్నాయని చెప్పారు. ఈనెల 28న ఆన్‌లైన్ వేలం ఉందని, అందువల్ల వేలాన్ని అడ్డుకుంటూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వాలని పిటిషనర్ తరఫు న్యాయవాది కోరగా.. ఎటువంటి మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వొద్దని పొన్నవోలు అభ్యర్ధించారు.
Comments
Please login to add a commentAdd a comment