చెప్పిన పని చేయకుంటే నీ అంతు చూస్తాం
- నెల్లూరు జిల్లా దగదర్తి మహిళా ఆర్‌ఐపై టీడీపీ నేతల దౌర్జన్యం
- ప్రభుత్వ భూముల్ని తమ పేరిట పట్టాలుగా మార్చాలని ఒత్తిడి
- టీడీపీ నేతల మీద చర్యలు కోరుతూ సిబ్బంది సామూహిక సెలవు
సాక్షి ప్రతినిధి, నెల్లూరు: అధికారాన్ని అడ్డుపెట్టుకుని రాష్ట్రంలో తెలుగు తమ్ముళ్లు రెచ్చిపోతున్నారు. తమ దోపిడీకి సహకరించని అధికారులపై ఏకంగా దాడులకు దిగుతున్నారు. తాజాగా శ్రీపొట్టిశ్రీరాములు నెల్లూరు జిల్లాలోని దగదర్తి మండల రెవెన్యూ ఇన్‌స్పెక్టర్(ఆర్‌ఐ) కామాక్షిపై స్థానిక తెలుగుదేశం నేతలు ప్రతాపం చూపారు. ప్రభుత్వ భూముల్ని తమ పేరిట పట్టాలుగా మార్చాలన్న వారి వినతిని తోసిపుచ్చడమే ఆమె చేసిన తప్పు. తమ మాట విననందుకు బూతులు తిడుతూ.. దాడికి తెగబడ్డారు.
సంఘటనకు దారితీసిన కారణాలివీ..
దగదర్తి వద్ద విమానాశ్రయ నిర్మాణం, పారిశ్రామిక అవసరాలకోసం ఏపీఐఐసీ వేలాది ఎకరాల భూములు సేకరిస్తోంది. ఈ క్రమంలో ఏడాదిన్నర నుంచి కావలి నియోజకవర్గానికి చెందిన టీడీపీ నేతలు భూముల రికార్డుల తారుమారుకోసం రెవెన్యూ అధికారుల మీద తీవ్రస్థాయిలో ఒత్తిడి తెస్తున్నారు. ఈ నేపథ్యంలో కాట్రాయపాలెం గ్రామంలోని ప్రభుత్వ భూముల్ని తమ పేరుమీద పట్టాలుగా మార్చి వెబ్‌ల్యాండ్ రికార్డుల్లో నమోదు చేయాలంటూ మండల టీడీపీ నేతలు నెలన్నరగా ఆర్‌ఐ కామాక్షిపై తీవ్ర ఒత్తిడి తీసుకొస్తున్నారు. తమ పని చేయకపోతే సెలవులో వెళ్లాలని బెది రిస్తున్నారు. వారి ఒత్తిడికి కామాక్షి తలొగ్గలేదు.
కార్యాలయంలోనే దౌర్జన్యం
బుధవారం సాయంత్రం ఆర్‌ఐ కార్యాలయంలో ఉండగా సుమారు 20మంది టీడీపీ నేతలు వెళ్లి ‘చెప్పిన పని చేయకపోతే నీ అంతు చూస్తాం. జిల్లా పార్టీ అధ్యక్షుడు బీద రవిచంద్ర మనుషులం’ అని బెదిరించారు. ప్రభుత్వ రికార్డులు మార్చడం కుదరదని ఆర్‌ఐ తెగేసి చెప్పడంతో మహిళనీ చూడకుండా బూతులు తిట్టారు. ఇతర ఉద్యోగులు అడ్డుపడి వారిని అదుపు చేశారు. తనమీద జరిగిన దౌర్జన్యం పట్ల కామాక్షి కన్నీటి పర్యంతమయ్యారు.
తహసీల్దార్ మధుసూదనరావుతోపాటు కావలి ఆర్‌డీవో లక్ష్మీనరసింహానికి ఫిర్యాదు చేశారు. ఉన్నతాధికారుల నుంచి గురువారం సాయంత్రందాకా స్పందన రాకపోవడంతో శుక్రవారం సిబ్బంది మొత్తం సామూహిక సెలవు పెట్టారు. దీంతో తహసీల్దార్ సిబ్బందిని ఆర్‌డీవో లక్ష్మీ నరసింహం వద్దకు తీసుకెళ్లి సమస్యను సావధానంగా పరిష్కరించుకుందామని బుజ్జగించే ప్రయత్నం చేశారు. సిబ్బంది ససేమిరా అన్నారు. దౌర్జన్యానికి దిగినవారిపై ఈ నెల 13వ తేదీలోగా కేసులు నమోదుచేసి చర్యలు తీసుకోంటే నిరవధిక సమ్మెకు దిగుతామని హెచ్చరించారు. దీనిపై జాయింట్ కలె క్టర్ మహ్మద్ ఇంతియాజ్, జిల్లా రెవెన్యూ అసోసియేషన్ నాయకులకు ఫిర్యాదు చేశారు. ఆర్.ఐ కామాక్షి దీన్ని నిర్ధారించారు.తనపై దౌర్జన్యం జరగడం వాస్తవమేన్నారు.