‘భూ’ నజరానా
-
టీడీపీ నేత భార్యకు ప్రభుత్వ భూమికి పొజిషన్ సర్టిఫికెట్
-
రెవెన్యూ అధికారుల తీరుపై నిరసన
-
తక్షణం రద్దు చేయాలని డిమాండ్
అనపర్తి(బిక్కవోలు) :
రెవెన్యూ అధికారుల తీరుపై అనపర్తి ప్రజలు దుమ్మెత్తిపోస్తున్నారు. విలువైన ప్రభుత్వ స్థలాలను అధికార టీడీపీ నాయకులకు నజరానాగా కట్టబెట్టి సామాన్య ప్రజలను వేధిస్తున్నారంటు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఇల్లు లేని నిరుపేదలు ఏళ్ల తరబడి ప్రభుత్వ స్థలాల్లో నివాసముంటున్నా పొజిషన్ పట్టా ఇవ్వడానికి సవాలక్ష అభ్యంతరాలు తెలిపే అధికారులు గ్రామ నడిబొడ్డున లక్షల రూపాయల విలువైన ప్రభుత్వ స్థలాన్ని కనీసం ఒక్కరోజు కూడా నివాసం ఉండకపోయినా ఓ టీడీపీ నాయకుని భార్య పేరున స్వాధీన పత్రం ఇచ్చారు. దీంతో ఆశ్చర్యపోవడం స్థానికుల వంతయింది. వివరాలివి... అనపర్తి జీబీఆర్ కాలేజీ ఎదురుగా ఉన్న ఇందిరానగర్ ప్రాంతంలోని 306, 308, 309 సర్వే నంబర్లలో ఉన్న ప్రభుత్వ స్థలాన్ని మామిడిశెట్టి శ్రీదేవి పేర స్వాధీన పత్రం మంజూరు చేశారు. గతంలో అనపర్తి పంచాయతీ కార్యాలయం వద్ద కర్రి గాంధీరెడ్డి, సబ్బెళ్ళ వీర్రెడ్డిలపై పెట్టిన అట్రాసిటీ కేసులో తప్పుడు సాక్ష్యం చెప్పినందుకే ఈ స్థలాన్ని నియోజకవర్గ స్థాయి ప్రజాప్రతినిధి సిఫారస్సు మేరకు నజరానాగా ఇచ్చారని టీడీపీలోని మరో వర్గం బహిరంగంగానే ఆక్రోశం వెళ్ళగక్కుతోంది. ఇటీవల ఆ భూమిని సదరు వ్యక్తి రూ.20 లక్షలకు అమ్మకానికి పెట్టారని తెలిసింది. జిల్లా ఉన్నతాధికారులు జోక్యం చేసుకుని విలువైన ప్రభుత్వ భూమి అన్యాక్రాంతం కాకుండా చర్యలు తీసుకుని, పొజిషన్ పట్టాను రద్దు చేయాలని పలువురు కోరుతున్నారు.
ఓం శాంతి ఆశ్రమంపై రాజకీయ ఒత్తిళ్లు
ఇదే రెవెన్యూ అధికారులు సామాన్య ప్రజల పట్ల నిర్లక్ష్య థోరణితో ప్రవర్తిస్తున్నారని కుతుకులూరు ఓం శాంతి ఆశ్రమం సభ్యులు ఆరోపిస్తున్నారు. పదిహేనేళ్ళుగా కుతుకులూరులో ఓం శాంతి ఆధ్యాత్మిక కేంద్రాన్ని నెలకొల్పి గ్రామ ప్రజలకు ఆధ్యాత్మిక సేవలందిస్తున్న తమను ఖాళీ చేయాలంటూ రెవెన్యూ అధికారులు నోటీసులు జారీ చేశారని తెలిపారు. ఈ విషయమై ఎమ్మెల్యే వద్ద మొరపెట్టుకుందామని వెళితే గత ఎన్నికలలో వైఎస్సార్ సీపీకి ఓట్లు వేసి ఇపుడు సాయం కోసం వస్తారా? అంటు ఎమ్మెల్యే తండ్రి మాజీ ఎమ్మెల్యే మూలారెడ్డి ఆగ్రహం వ్యక్తం చేశారని, మిమ్మల్ని ఎవరు కాపాడతారో చూస్తానంటు బెదిరంచారని వైఎస్సార్‌సీపీ నియోజకవర్గ కో–ఆర్డినేటర్ డాక్టర్ సత్తి సూర్యనారాయణరెడ్డి వద్ద వారు వాపోయారు. తమకు ఓట్లు వేయలేదనే అపోహతోనే టీడీపీ నేతలు రాజకీయంగా కక్ష సాధింపులకు పాల్పడుతున్నారని వారు ఆవేదన చెందారు. ఆధ్యాత్మిక సేవలందిస్తున్న తమ ఆశ్రమాన్ని ఖాళీ చేయాలంటూ అధికారుల సహకారంతో ఒత్తిడి తెస్తున్నారని తెలిపారు. ఆశ్రమ స్థలాన్ని క్రమబద్ధీకరించాలని వారు విజ్ఞప్తి చేశారు.