దగాపడ్డ దగదర్తి
పభుత్వం ఇచ్చిన భూములు మాయ డబ్బుల కోసం పేదల పొట్టకొడుతున్నారుబాధితులను కదిలిస్తే కన్నీటి వ్యధల భూదోపిడీలో టీడీపీ నేతలే సూత్రధారులు
సాక్షి టాస్క్‌ఫోర్స్, నెల్లూరు: అధికారపార్టీ నేతల ధన దాహం తారాస్థాయికి చేరింది. తమ జేబులు నిండటానికి పొట్టకొడుతున్నారు. అధికారాన్ని అడ్డంపెట్టుకుని చెలరేగిపోతున్నారు. దగదర్తి మండలంలో టీడీపీ నేతలు చేసిన అక్రమాలు రాష్ట్ర చరిత్రలో ఎక్కడా చేసి ఉండరేమో అనిపిస్తోంది. విమానాశ్రయం, పరిశ్రమల ఏర్పాటు కోసం సేకరిస్తున్న భూములను పరిహారం కోసం టీడీపీ నేతలు మాయ చేస్తున్నారు. పేదలకు ఇచ్చిన భూములను వారికి తెలియకుండానే మాయం చేస్తున్నారు. తమకు భూమి వచ్చిందీ తెలియదు.. విక్రయించిందీ తెలియకుండా లబ్ధిదారులను మోసం చేస్తున్నారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారాన్ని దిగమింగేందుకు టీడీపీ నేతల బరితెగింపును చూసి స్థానికులు ముక్కున వేలేసుకుంటున్నారు.దామవరం గ్రామానికి చెందిన కందుర్తి వెంకటేశ్వర్లు, జూపూడు వెంకయ్య కుటుంబాలు చెరువులో నివాసం ఉండేవి. ఆ సమయంలో ఆ కుటుంబాలను బలవంతంగా అక్కడి నుంచి వెళ్లగొట్టారు. బాధితులు అప్పట్లో కలెక్టర్‌ను కలిశారు. స్పందించిన కలెక్టర్ అప్పట్లో సర్వేనంబర్ 257లో 8.15 ఎకరాలు ఇచ్చింది. ఐదేళ్లుగా అడంగల్లో అన్ని రికార్డుల్లో వారిపేర్లే ఉండేవి. ఆరు నెలలకు ముందు రెవెన్యూ అధికారి ఒకరు ఆ ఇద్దరిని పిలిచి ఆ భూములు మీకే చెందాలంటే టీడీపీ నేతలను వెళ్లి కలవమన్నారు. లేదంటే ఆ భూములు మీకు దక్కవని చెప్పారు. ఈ విషయంపై బాధితులు ఎస్సీ కమిషనర్‌ను కలిశారు. టీడీపీ నేతలపై ఎస్సీ, ఎస్టీ కేసు నమోదు చేయమని ఆదేశాలు జారీ చేశారు. తాజాగా ఆ సర్వే నంబర్లో అదనంగా 4.50 ఎకరాలు వచ్చి చేరింది.
మొత్తం 12.65 ఎకరాలను 10 మందికి ఇచ్చినట్లు రికార్డులు సృష్టించినట్లు బాధితులు వెల్లడించారు. ఇలా దగదర్తి మండల పరిధిలోని దామవరం, కౌరుగుంట గ్రామాలకు చెందిన ఎస్సీ, ఎస్టీలకు ప్రభుత్వం ఇచ్చిన భూములు వేరొకరి పేర్లమీద రికార్డులు సృష్టించి ఉన్నారు. ప్రభుత్వం ఇచ్చే పరిహారం నిధులను స్వాహా చేసేందుకు పక్కా పథకం వేయడాన్ని తెలుసుకున్న స్థానికులు ఉన్నతాధికారుల వద్దకొచ్చి మొరపెట్టుకుంటున్నారు. అదేవిధంగా పత్రికా కార్యాలయాలకు వచ్చి తమ గోడును వెళ్లబోసుకోవటం గమనార్హం.