ఏమీ చేయకుండానే పరిష్కారమైనట్లు నమోదు
రెవెన్యూ సమస్యలపై కుప్పలుతెప్పలుగా విజ్ఞాపనలు
వాటిని తీసుకుని వెంటనే పరిష్కరించేసినట్లు మెసేజ్‌లు
వీటిని చూసి బిత్తరపోతున్న జనం
ఫ్యామిలీ సర్టిఫికెట్ లేకుండానే మ్యుటేషన్ చేసిన దానిపై ఫిర్యాదు
కోర్టులో ఉందని అబద్ధం చెప్పి వినతిని మూసేసిన అధికారులు
సాక్షాత్తు సీఎంను కలిసినా దక్కని ఊరట
ప్రజా సమస్యల పరిష్కార వేదిక తీరిదీ..
సాక్షి, అమరావతి :ప్రజల నుంచి భారీఎత్తున విజ్ఞాపనలు తీసుకుంటున్నట్లు గొప్పగా ప్రచారం చేసుకుంటున్న టీడీపీ ప్రభుత్వం వాటి పరిష్కారానికి మాత్రం ఎటువంటి చర్యలు తీసుకోవడంలేదు. పార్టీ ఆఫీసులు, ప్రభుత్వ కార్యాలయాలకు జనం వచ్చి ఫిర్యాదులు చేస్తున్నారని సీఎం చంద్రబాబు పదేపదే చెబుతున్నారు. ప్రతి శనివారం ఆయన మంగళగిరిలోని టీడీపీ కార్యాలయానికి వెళ్లి మరీ వినతులు స్వీకరిస్తున్నారు. ప్రతిరోజూ కొందరు మంత్రులు కూడా అక్కడ విజ్ఞాపనలు తీసుకుంటున్నారు. టీడీపీ నేతలను చూసి జనసేన, బీజేపీ ఆఫీసుల్లోనూ ఈ తంతు సాగిస్తున్నారు. అలాగే, ప్రతి సోమవారం ఎప్పటిమాదిరిగానే అన్ని ప్రభుత్వ కార్యాలయాల్లోనూ వినతులు స్వీకరిస్తున్నారు.
వైఎస్సార్‌సీపీ ప్రభుత్వం స్పందన పేరుతో నిర్వహించిన ఈ కార్యక్రమాన్ని ప్రజా సమస్యల పరిష్కార వేదికగా టీడీపీ ప్రభుత్వం మార్చింది. జనం గత ప్రభుత్వంలో మాదిరిగానే ఈ ప్రభుత్వంలోనూ పెద్దఎత్తున తమ సమస్యలను మొర పెట్టుకుంటున్నా వాటికి పరిష్కారం మాత్రం దొరకడంలేదు. సీఎం చంద్రబాబును కలిసి తమ సమస్యలు విన్నవించుకున్న వారికి సైతం ఎటువంటి ఊరట లభించడంలేదు. ఉదా.. నెలరోజుల క్రితం కృష్ణాజిల్లా మచిలీపట్నానికి చెందిన నబీల్ అనే వ్యక్తి కుటుంబంతో కలిసి టీడీపీ ఆఫీసులో తన సమస్యపై సీఎంకు వినతిపత్రం ఇచ్చాడు.
కానీ, ఇప్పటివరకు దానిపై ఎలాంటి పురోగతిలేదు. ఎక్కువగా భూములకు సంబంధించిన సమస్యలపై ఫిర్యాదులు వస్తుండడంతో వాటిపై ఏంచేయాలో తెలీడంలేదని అధికారులు వాపోతున్నారు. గత ప్రభుత్వంలో జరిగిన ఇబ్బందుల గురించే ఎక్కువ మంది ఫిర్యాదుల చేస్తున్నారని టీడీపీ నేతలు ప్రచారం చేస్తున్నా అవి ఎప్పుడూ రొటీన్‌గా వచ్చే రెవెన్యూ సమస్యలేనని అధికారులు చెబుతున్నారు. వచ్చిన విజ్ఞాపనలను పరిష్కరించే పరిస్థితి లేకపోవడంతో అధికారులు కిందా మీదా పడుతున్నారు. దీంతో చేసేదిలేక 60 రోజుల్లో వినతిని పరిష్కరించాలి కాబట్టి ఈలోపే ఏదో ఒక కారణంతో దాన్ని మూసేసి అది పరిష్కారమైపోయినట్లు నమోదు చేస్తున్నారు. మరోవైపు.. అసలేమీ జరగకుండానే వినతిపత్రం ఇచ్చిన వారికి అది క్లియర్ అయిపోయినట్లు ఎస్‌ఎంఎస్‌లు వస్తుండడంతో వారు బిత్తరపోతున్నారు.
కోర్టు కేసు లేకుండా ఉన్నట్లు చెప్పి మూసేశారు..
తూర్పుగోదావరి జిల్లా గోకవరం మండలం, అల్లవరం గ్రామానికి చెందిన భీమవరపు కటుమస్వామి జులై 15న ఆర్డీఓ కార్యాలయంలో ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ (ఎఫ్‌ఎంసీ) లేకుండానే తమ కుటుంబానికి చెందిన భూమిని మ్యుటేషన్ చేశారని విజ్ఞాపన ఇచ్చాడు. తన అమ్మమ్మ నూకాలమ్మ 2016లో చనిపోయిందని, ఆమెకు వారసత్వంగా ఉన్న భూమిని ఆమె చనిపోయిన తర్వాత ఫ్యామిలీ మెంబర్ సర్టిఫికెట్ లేకుండా రెవెన్యూ అధికారులు వేరే కొందరికి మ్యుటేషన్ చేసినట్లు అందులో పేర్కొన్నారు. అడుగుతుంటే పట్టించుకోవడంలేదని ఫిర్యాదు చేశారు.
ఆర్డీఓ ఈ వినతిని తీసుకుని ఎఫ్‌ఎంసీ లేకుండా మ్యుటేషన్ ఎలా చేస్తారని ఫిర్యాదు తీసుకున్నారు. ఆ తర్వాత దీనిపై వీఆర్‌ఓ విచారణకు వెళ్లాడు. కానీ, కొద్దిరోజులకు మీ సమస్య పరిష్కారమైందంటూ కటుమస్వామికి ఎస్‌ఎంఎస్ రావడంతో అతను విస్తుపోయాడు. ఆర్డీఓ కార్యాలయానికి వెళ్లి అడిగితే కోర్టులో కేసు ఉందని తహశీల్దార్ రిపోర్టు ఇవ్వడంతో సమస్య పరిష్కారమైందని ఫిర్యాదును మూసివేసినట్లు చెప్పారు. అతను ఈ కేసు కోర్టు పరిధిలో లేదని అన్ని ఆధారాలు చూపడంతో నిజమేనని ఒప్పుకున్నా తాము చేసేదేంలేదని ఆర్డీఓ చేతులెత్తేశారు. 60 రోజుల్లోపు వినతిని పరిష్కరించాల్సి వుండడంతో కోర్టు వంకతో వినతిని తహశీల్దార్ క్లియర్ చేసినట్లు తేలింది.
65 వేల సమస్యలు పరిష్కారమయ్యాయట
ఇలా ఇప్పటివరకు 65,211 సమస్యలను పరిష్కరించినట్లు ప్రభుత్వం చెబుతోంది. పీజీఆర్‌ఎస్ (పబ్లిక్ గ్రీవెన్స్ రెడ్రసల్ సిస్టమ్) వెబ్‌సైట్‌లో జూన్ 15 నుంచి ఇప్పటివరకు 88,761 విజ్ఞాపనలు అందగా, 65,211 విజ్ఞాపనలను పరిష్కరించినట్లు ప్రభుత్వం అందులో పేర్కొంది. అయితే, ఇవన్నీ గోకవరం కేసు మాదిరిగానే ఏమీ అవకుండానే కాగితాల్లోనే పరిష్కారమైనట్లు రాసుకున్నారని బాధితులు వాపోతున్నారు.
Comments
Please login to add a commentAdd a comment