![MLA Vishnu complaint to EC against Chandrababu - Sakshi](https://www.sakshi.com/styles/webp/s3/article_images/2024/04/9/VISHNU%20YSRCP.jpg.webp?itok=oQxRYDaG)
టీడీపీ సోషల్ మీడియాపైనా ఫిర్యాదు
బహిరంగ సభల్లో బాబు ప్రవర్తన జుగుప్సాకరం
కూటమి అభ్యర్థులు ఎన్నికల నియమావళిని పాటించడంలేదు
ఎమ్మెల్యే మల్లాది విష్ణు
సాక్షి, అమరావతి: ఎన్నికల నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న టీడీపీ అధినేత చంద్రబాబు, ఆ పార్టీ సోషల్ మీడియాపై ప్లానింగ్ బోర్డు ఉపాధ్యక్షుడు, విజయవాడ సెంట్రల్ ఎమ్మెల్యే మల్లాది విష్ణు ఎన్నికల సంఘానికి ఫిర్యాదు చేశారు. సోమవారం వెలగపూడి సచివాలయంలో రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారి ముఖేష్‌కుమార్ మీనాను కలిసి ఆధారాలతో సహా ఫిర్యాదు చేశారు. అనంతరం మీడియాతో మాట్లాడుతూ... రాష్ట్రంలో కూటమి అభ్యర్థులు ఎక్కడా ఎన్నికల నియమావళిని పాటించడం లేదని చెప్పారు. ముఖ్యంగా బహిరంగ సభల్లో చంద్రబాబు ప్రవర్తన జుగుప్సాకరమన్నారు. సీఎం వైఎస్ జగన్‌మోహన్‌రెడ్డిని ఉద్దేశించి బచ్చా అనడం, విషం చిమ్ముతున్నారంటూ మాట్లాడటం బాబు అనైతికతకు అద్దం పడుతోందని తెలిపారు.
చంద్రబాబు వ్యాఖ్యలు ఓటర్లలో విద్వేషాలు రెచ్చగొట్టేలా ఉన్నాయని చెప్పారు. వీటన్నింటిని వివరించి, తగిన చర్యలు తీసుకోవాలని ఈసీని కోరినట్లు తెలిపారు. సీఎం జగన్‌పై తప్పుడు ప్రచారమే చేయడం చంద్రబాబు ఏకైక అజెండా అని, ప్రజలకు మంచి చేసే ఉద్దేశం ఆయనకు లేదని అన్నారు. ఎంతకాలం వైఎస్సార్‌సీపీపై బురదచల్లుతారని నిప్పులు చెరిగారు. కోర్టు పరిధిలో ఉన్న వివేకానందరెడ్డి కేసు గురించి చంద్రబాబు, లోకేశ్, షరి్మల, సునీత పదేపదే మాట్లాడుతున్నారని, పైగా హంతకుడంటూ వైఎస్ అవినాశ్‌రెడ్డిని ఏ విధంగా విమర్శిస్తారని ప్రశ్నించారు.
పింఛన్‌దారుల మృతిపైనా టీడీపీ వెబ్‌సైట్లలో ఏ విధంగా పోస్టులు పెడుతున్నారో ప్రజలందరూ గమనిస్తున్నారన్నారు. శవ రాజకీయాలను మానుకోవాలని సూచించారు. రాయలసీమలో పర్యటిస్తున్న సీఎం జగన్ ఓ పేద ముస్లిం సోదరుడి సమస్యను పరిష్కరిస్తే, వాహనం ఆపలేదని టీడీపీ సోషల్ మీడియాలో పోస్టులు పెట్టడం దిగజారుడుతనం కాదా అని ప్రశ్నించారు. మైనారీ్టలను కేబినెట్లో పక్కన కూర్చోబెట్టుకోలేని అసమర్థ నేత చంద్రబాబుకు మైనారీ్టల గూరించి మాట్లాడే అర్హత ఉందో లేదో ఆత్మ పరిశీలన చేసుకోవాలన్నారు. టీటీడీపైనా రాజకీయాలు చేయడం బాధాకరమన్నారు. కలియుగ దైవం జోలికి వస్తే ఈసారి టీడీపీ పూర్తిగా భూస్థాపితం కావడం ఖాయమని చెప్పారు. కూటమి నేతలు కులాలు, మతాల ప్రస్తావన మానుకోవాలని సూచించారు.
పవన్ వ్యాఖ్యలను ఉపసంహరించుకోవాలి
గుర్తింపు లేని జనసేనకు అధినేత, పోటీ చేసిన రెండు చోట్లా ఘోర పరాజయం పాలైన పవన్.. 151 స్థానాలతో అధికారంలోకి వచి్చన సీఎం జగన్‌ని దుర్భాషలాడతారా అంటూ విష్ణు ఆగ్రహం వ్యక్తం చేశారు. అసలైన స్కాం స్టార్లు ఎవరో జనసేన నేతలే బయటకు వచ్చి చెబుతున్నారన్నారు. జనసేన అధినేత తన మాటలను ఉపసంహరించుకునేలా చర్యలు తీసుకోవాలని ఈసీని కోరినట్లు తెలిపారు. ఓట్లు నివాసాలలో ఉండాలనే నిబంధనకు విరుద్ధంగా విజయవాడ సెంట్రల్ నియోజకవర్గ టీడీపీ అభ్యర్థి బోండా ఉమా ఓ కార్యాలయంలో ఓట్లు నమోదు చేసి ఉంచడాన్ని కూడా ఎన్నికల కమిషన్ దృష్టికి తీసుకువెళ్లామన్నారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు మలసాని మనోహర్ రెడ్డి, నాగ నారాయణమూర్తి, శ్రీనివాసరెడ్డి, ఒగ్గు గవాస్కర్, కొండపల్లి బుజ్జి పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment