రాష్ట్ర ఎన్నికల ప్రధానాధికారికి ఫిర్యాదు అందిస్తున్న ఐపీఎస్ అధికారుల సంఘం
పోలీసు వ్యవస్థ మనోస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు టీడీపీ, బీజేపీ, జనసేన కుట్ర
ఆ పార్టీలకు కొమ్ముకాసే మీడియాను నియంత్రించండి.. ఈసీకి ఐపీఎస్ అధికారుల సంఘం వినతి
సాక్షి, అమరావతి: రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, బీజేపీ, జనసేనలతోపాటు ఆ పార్టీకి కొమ్ముకాస్తున్న పత్రికలు, మీడియా చానళ్లు నిరాధార ఆరోపణలతో తమపై చేస్తున్న దుష్ప్రచారంపై కఠిన చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ఐపీఎస్ అధికారుల సంఘం కేంద్ర ఎన్నికల సంఘాన్ని కోరింది. కీలకమైన ఎన్నికల తరుణంలో ఐపీఎస్ అధికారులతోపాటు యావత్ పోలీసు వ్యవస్థ మనోస్థైర్యాన్ని దెబ్బతీసేందుకు పక్కా పన్నాగంతోనే ఈ దుష్ప్రచారానికి పాల్పడుతున్నారని ఆధారాలతో సహా ఫిర్యాదు చేసింది.
ఈమేరకు కేంద్ర ఎన్నికల కమిషన్‌ను ఉద్దేశించి 19 మంది ఐపీఎస్ అధికారుల సంతకాలతో కూడిన వినతి పత్రాన్ని ఐపీఎస్ అధికారుల సంఘం ప్రతినిధులు కాంతిరాణా టాటా, రవీంద్రబాబు రాష్ట్ర ప్రధాన ఎన్నికల అధికారి ముఖేశ్ కుమార్ మీనాకు శనివారం సమర్పించారు. ఆ వినతిపత్రంతో పాటు ఇటీవల ఐపీఎస్ అధికారులపై టీడీపీ, బీజేపీ, జనసేన అనుకూల మీడియాలో వచ్చిన 17 నిరాధారమైన వార్తా కథనాలను జత చేశారు.
ఫిర్యాదులో ముఖ్యాంశాలు
రాష్ట్రంలోని ప్రతిపక్ష పార్టీలు టీడీపీ, బీజేపీ, జనసేనలతోపాటు ఆ పార్టీలకు వత్తాసు పలుకుతున్న పత్రికలు, టీవీ చానళ్లు పక్కా కుట్రతోనే దుష్ప్రచారం సాగిస్తున్నాయి. ముందుగా టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల ప్రతినిధులు పోలీసు అధికారులకు వ్యతిరేకంగా నిరాధార ఆరోపణలు చేస్తారు. అనంతరం అవే ఆరోపణలతో ఎన్నికల కమిషన్‌కు ఫిర్యాదు చేస్తారు. వారు చేసేఆరోపణలకు ఎలాంటి ఆధారాలుండవు. కానీ పదే పదే అసత్య ఆరోపణలు చేయడం ద్వారా పోలీసు వ్యవస్థ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీయాలన్నది ఆ పా ర్టీల కుట్ర. దాంతో పోలీసు వ్యవస్థకు తీవ్ర నష్టం కలుగుతోంది.
అనంతరం టీడీపీ, బీజేపీ, జనసేన నేతలు మీడియా సమావేశాలు ఏర్పాటు చేసి మరీ ఆ ఆరోపణలను పునరుద్ఘాటిస్తారు. ఎలాంటి ఆధారాలు లేకుండానే పోలీసు అధికారులకు వ్యతిరేకంగా అవినీతి, ఆశ్రిత పక్షపాతం, అసమర్థత మొదలైన నిందలు వేస్తారు. ప్రతిపక్ష పా ర్టీల ఆరోపణలను ఆ పార్టీలకు కొమ్ముకాస్తున్న పత్రికలు ప్రముఖంగా ప్రచురిస్తాయి. మీడియా చానళ్లు పదే పదే వాటినే ప్రసారం చేస్తాయి. ఇక టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీల సోషల్ మీడియా విభాగాలు ఆ దుష్ప్రచారాన్ని పెద్ద ఎత్తున వైరల్ చేస్తాయి.
మళ్లీ మరో అసత్య ఆరోపణలను ప్రతిపక్ష పార్టీలు ప్రస్తావిస్తాయి... మళ్లీ అదే తంతు సాగుతుంది. ఇలా ఈ దుష్ప్రచారాన్ని పదే పదే కొనసాగిస్తారు. కొన్ని ప్రధానపత్రికలు, టీవీ చానళ్లు ప్రతిపక్ష పార్టీల కుట్రలో భాగస్వాములవడం దురదృష్టకరం. ఈ దుష్ప్రచారంతో గత రెండు నెలల్లోనే 30మందికి పైగా పోలీసు అధికారులు మనోవేదనకు గురయ్యారు.
ఈసీ నిర్ణయాలపైనా దుష్ప్రచారం
టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు, వాటికి వత్తాసు పలికే మీడియా పదే పదే చేస్తున్న దుష్ప్రచారం తీవ్ర దుష్పరిణామాలకు దారి తీస్తోంది. ఇటీవల ఓ ఐజీ, కొందరు ఎస్పీలు, జిల్లా కలెక్టర్లను ఈసీ బదిలీ చేసింది. అనంతరం వారి స్థానాల్లో కొత్త అధికారులను నియమిస్తూ ఈ నెల 4న ఉత్తర్వులిచ్చింది. öత్తగా నియమితులైన ఆ అధికారులు ఇంకా బాధ్యతలు తీసుకోకముందే వారికి వ్యతిరేకంగా టీడీపీ, బీజేపీ, జనసేన అనుకూల మీడియా మళ్లీ దుష్ప్రచారం మొదలెట్టింది. ‘వీళ్లా కొత్త ఎస్పీలు ... సగానికి పైగా వైకాపా విధేయులే’అని కథనాన్ని ప్రముఖంగా ప్రచురించి ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు యత్నించింది.
పోలీసు వ్యవస్థను నిర్విర్యం చేసే కుట్ర
ఇలా రోజూ పెద్ద ఎత్తున చేస్తున్న దుష్ప్రచారం పోలీసు వ్యవస్థ మనో స్థైర్యాన్ని, చొరవను దెబ్బతీస్తోంది. వాస్తవానికి అధికార యంత్రాంగం ప్రస్తుతం ఎన్నికల కమిషన్ ఆధ్వర్యంలో పని చేస్తోంది. ఎన్నికల ప్రవర్తనా నియమావళికి కట్టుబడి విధులు నిర్వహిస్తోంది. కాబట్టి ఆ మీడియా దుష్ప్రచారాన్ని తిప్పికొట్టేందుకు కొన్ని పరిమితులకు లోబడి వ్యవహరించాల్సి వస్తోంది. పోలీసు అధికారులు ఎన్నికల విధుల నుంచి పూర్తిగా వైదొలిగేలా చేసేందుకు ప్రతిపక్ష పార్టీలు, వారికి కొమ్ముకాసే మీడియా కుట్ర పన్నుతోంది.
వాస్తవానికి సక్రమంగా ఎన్నికల నిర్వహణ కోసం ఈసీకి విజ్ఞప్తి చేయాల్సిన ప్రతిపక్ష పార్టీలు అందుకు విరుద్ధంగా మీడియాను అడ్డంపెట్టుకుని పోలీసు అధికారులపై దుష్ప్రచారానికే ప్రాధాన్యమిస్తోంది. అధికారులు తమ విధులు సక్రమంగా నిర్వహించకుండా వారిని బ్లాక్‌మెయిల్ చేసేందుకు యత్నిస్తోంది. తద్వారా రాష్ట్రంలో పోలీసు వ్యవస్థను పూర్తిగా నిర్విర్యం చేయడమే లక్ష్యంగా ప్రతిపక్ష పార్టీలు వ్యవహరిస్తున్నాయి. నిబద్ధతతో పని చేస్తున్న పోలీసు వ్యవస్థ నైతిక స్థైర్యాన్ని దెబ్బతీసి క్రియాశూన్యంగా చేయాలని టీడీపీ, బీజేపీ, జనసేనలు కుట్ర పన్నుతున్నాయి.
వారి కుట్రతో రాజ్యంగబద్ధ సంస్థలపై ప్రజల్లో సందేహాలు కలిగిస్తే సమాజంలో వైషమ్యాలు చెలరేగే ప్రమాదం ఉంది. మావోలు ఎన్నికల బహిష్కరణకు పిలుపునిచి్చన నేపథ్యంలో ఎన్నికలను సజావుగా నిర్వహించాల్సిన బృహత్తర బాధ్యత పోలీసు వ్యవస్థపై ఉంది. ఇంతటి కీలక తరుణంలో కానిస్టేబుల్ నుంచి ఐపీఎస్ అధికారుల వరకూ పోలీసు యంత్రాంగం మనోస్థైర్యం దెబ్బతినకుండా చూడాల్సిన బాధ్యత అందరిపైనా ఉంది. కాబట్టి పోలీసు వ్యవస్థపై జరుగుతున్న దుష్ప్రచారం కట్టడి చేయాలి. ఆ కుట్రకు పాల్పడుతున్న టీడీపీ, బీజేపీ, జనసేన పార్టీలు, ఆ పార్టీలకు వత్తాసు పలుకుతున్న పత్రికలు, టీవీ చానళ్లపై చర్యలు తీసుకోవాలని కోరుతున్నాం.
Comments
Please login to add a commentAdd a comment