మంత్రి గంటాకు హైకోర్టు నోటీసులు
ప్రభుత్వ భూముల తాకట్టుపై ప్రత్యూష డైరెక్టర్లందరికీ నోటీసులు
సాక్షి, హైదరాబాద్: విశాఖపట్నం జిల్లా, ఆనందపురం మండలం, వేములవలస గ్రామంలోని పలు సర్వే నెంబర్లలో ఉన్న ప్రభుత్వ భూములను తాకట్టుపెట్టి రూ.141 కోట్ల రుణాలు తీసుకున్న వ్యవహారంలో ఉమ్మడి హైకోర్టు స్పందించింది. రాష్ట్ర మంత్రి గంటా శ్రీనివాసరావుతో పాటు ప్రత్యూష డైరెక్టర్లు పరుచూరి రాజారావు, పరుచూరి ప్రభాకరరావు, పరుచూరి వెంకట భాస్కరరావులతో పాటు ఆ సంస్థ ప్రతినిధులు కొండయ్య బాల సుబ్రహ్మణ్యం, నార్ని అమూల్య, ప్రత్యూష ఎస్టేస్ ప్రైవేట్ లిమిటెడ్, ప్రత్యూష గ్లోబల్ ట్రేడ్ ప్రైవేట్ లిమిటెడ్‌లకు నోటీసులు జారీ చేసింది.
వీరితో పాటు రెవెన్యూ, హోంశాఖల ముఖ్య కార్యదర్శులు, జిల్లా రిజిష్ట్రార్, జిల్లా కలెక్టర్, పోలీస్ కమిషనర్, ఇండియన్ బ్యాంక్ మేనేజర్‌లకు సైతం నోటీసులిచ్చింది. పూర్తి వివరాలతో కౌంటర్లు దాఖలు చేయాలని వీరిని ఆదేశించింది. తదుపరి విచారణను 3 వారాలకు వాయిదా వేసింది. ఈ మేరకు తాత్కాలిక ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రమేశ్ రంగనాథన్, న్యాయమూర్తి జస్టిస్ షమీమ్ అక్తర్‌లతో కూడిన ధర్మాసనం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రభుత్వ భూములను తాకట్టుపెట్టి రుణాలు తీసుకున్న వ్యవహారంలో మంత్రి గంటాతో పాటు ప్రత్యూష రీసోర్సెస్ ఇన్‌ఫ్రా డైరెక్టర్లు, ఇండియన్ బ్యాంక్ అధికారు లపై చర్యలు తీసుకోవాలని కోరుతూ గాజువాకకు చెందిన సాలాది అజయ్‌బాబు గత వారం హైకోర్టులో ప్రజా ప్రయోజన వ్యాజ్యం (పిల్) దాఖలు చేశారు.