రూ.13,500 కోట్లకు వచ్చింది 392 కోట్లే..!
♦ భూముల విక్రయంపై సర్కారు అంచనాలు తలకిందులు
♦ మొదటి విడత వేలంలో అమ్ముడుపోని భూములు
♦ రెండో విడత భూముల అమ్మకానికి రంగం సిద్ధం
సాక్షి. హైదరాబాద్: సర్కారు భారీ అంచనాలు పల్టీ కొట్టాయి. మొదటివిడతలో భూముల అమ్మకం ద్వారా సర్కారుకు కేవలం రూ.392 కోట్ల ఆదాయం వచ్చింది. నిరుపయోగంగా ఉన్న ప్రభుత్వ భూములు, ఆస్తులను అమ్మి అభివృద్ధి కార్యక్రమాలకు వినియోగించాలని రాష్ట్ర ప్రభుత్వం నిశ్చయించుకుంది. వీటి ద్వారా రూ.13,500 కోట్ల భారీ ఆదాయం వస్తుందని బడ్జెట్‌లో అంచనా వేసుకుంది. కానీ ఆశించిన స్థాయిలో అమ్మకాలు జరగకపోవడం, వేలం వేసిన కొన్ని స్థలాలకు సైతం మి శ్రమ స్పందన రావడంతో అంచనాలు తలకిం దులయ్యాయి. ఈ ఆర్థిక సంవత్సరం ముగి సేందుకు ఇంకో నెల మాత్రమే మిగిలి ఉంది.
భూములు అమ్మితే వస్తుందనుకున్న ఆదాయంలో ఇప్పటివరకు మూడు శాతమే ఖజానాకు చేరింది. ప్రభుత్వం అన్ని జిల్లాల్లో నిరుపయోగంగా ఉన్న సర్కారు స్థలాల వివరాలను కలెక్టర్ల నుంచి తెప్పించుకొని, కొన్నింటిని మొదటి విడతగా నవంబరులో విక్రయించిం ది. తెలంగాణ రాష్ట్ర పారిశ్రామిక మౌలిక సదుపాయాల కల్పన సంస్థ (టీఎస్‌ఐఐసీ) ద్వారా భూముల అమ్మకానికి ఈ-వేలం నిర్వహించింది. హైదరాబాద్, రంగారెడ్డి జిల్లాల్లో కొన్ని స్థలాలనే తొలి దశలో వేలం వేశారు. నగర శివార్లలోని రాయదుర్గంలో గరిష్టంగా ఒక ఎకరానికి రూ.29 కోట్ల వరకు ధర పెట్టి కొనేందుకు ఫార్మా కంపెనీలు ముందుకొచ్చాయి. కానీ వేలం వేసిన భూముల్లో కొన్నింటికి అసలు స్పందనే లేదు. విస్తీర్ణంలో ఆ స్థలాలు చిన్నవిగా ఉండటంతోపాటు కొనేందుకు కంపెనీలు ముందుకు రాలేదు. ప్రైవేటు వ్యక్తులు, బిల్లర్లు ఆసక్తి ప్రదర్శించలేదు. కొన్ని స్థలాలకు అప్రోచ్ రోడ్లు లేకపోవటంతోపాటు మౌలిక సదుపాయాలలేమి కారణంగా అమ్ముడుపోలేదు. మరోవైపు మార్కెట్లో ఉన్న రేటు కంటే ప్రభుత్వం కనీస వేలం ధరను ఎక్కువగా నిర్ణయించిందనే విమర్శలున్నాయి.
వచ్చే నెల్లో రెండో విడత వేలం
గ్రేటర్ హైదరాబాద్ ఎన్నికల ప్రక్రియ పూర్తవడంతోపాటు ఆర్థిక సంవత్సరం ముగియనుండటంతో ప్రభుత్వం మళ్లీ భూముల అమ్మకానికి తెర లేపింది. వచ్చే నెల్లో రెండో దశ భూముల అమ్మకానికి రంగం సిద్ధం చేస్తోంది. ఈ దశలో రూ.1,500-2,000 కోట్ల ఆదాయాన్ని అర్జించాలని లక్ష్యంగా పెట్టుకుంది. మొదటి దశలో ఎదురైన చేదు అనుభవాలను దృష్టిలో ఉంచుకొని ఈసారి తగు జాగ్రత్తలు పాటించాలని సర్కారు భావిస్తోంది. మొదటిదఫాలో మిగిలిన స్థలాలతో పాటు మరి కొన్నింటిని చేర్చి రెండోదశ వేలం బాధ్యతను టీఎస్‌ఐఐసీకి అప్పగించనుంది. కొనుగోలుదార్లకు వెసులుబాటు కల్పించేలా గతంలోని నిబంధనల్లోనూ కొన్ని మార్పులు చేసే అవకాశాలున్నాయి. అప్రోచ్ రోడ్లు లేని కారణంగా కొన్ని స్థలాలు అమ్ముడుపోలేదని గుర్తించిన అధికారులు.. వేలం వేసేందుకు ముందే రోడ్ల నిర్మాణం చేపడితే పెట్టుబడిదారులను ఆకట్టుకునే వీలుందని యోచిస్తున్నారు. తమకు కొన్ని నిధులు కేటాయిస్తే రహదార్లను అభివృద్ధి చేస్తామంటూ ఇటీవలే టీఎస్‌ఐఐసీ ప్రభుత్వానికి ప్రతిపాదించింది.