- జెండాలు పాతిన సీపీఐ నాయకులు, కూలీలు
- పోలీసుల మోహరింపు
పి.పొన్నవోలు(రావికమతం): మండలంలోని పి.పొన్నవోలు, జి.చీడిపల్లి రెవెన్యూలో ఇతర జిల్లాల బడాబాబుల చేతుల్లో ఉన్న వందెకరాల ప్ర భుత్వ భూముల్లో సీపీఐ, ఏపీ వ్యవసాయ కార్మిక సంఘం ఆధ్వర్యంలో సోమవారం భూపోరాటం చేశారు. సీపీఐ రాష్ట్ర సహాయ కార్యదర్శి జె. వి.సత్యనారాయణమూర్తి, జిల్లా కార్యదర్శి స్టాలిన్, వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా అధ్యక్షుడు కొండలరా వు, మహిళా సమాఖ్య జిల్లా కార్యదర్శి విమల తదితర జిల్లా నాయకు లు పాల్గొన్నారు. పెత్తందార్ల చేతుల్లో ఉన్న భూముల్లో వారే స్వయంగా కత్తిపట్టి తుప్పలు నరికి, జెండాలు పాతారు.
పాకలు వేసేందుకు సన్నద్ధమయ్యారు. దీంతో పొన్నవోలు, జి.చీడిపల్లి, ఆర్.కొత్తూరు గ్రామాల్లో భూమిలేని నిరుపేదలు, వ్యవసాయ కూలీలు వందలాదిగా ఎర్రజెండాల తో కదం తొక్కారు. ఆ గ్రామాల్లోని 156, 157, 158, 142, 143, 172, 131, 168, 173, 179 తదితర సర్వే నంబర్లలో సుమారు 150 ఎకరాల్లో భూమిని ఇతర జిల్లాలకు చెంది న బొక్కా సూర్యారావు, పి.కన్నతల్లి, గంధం త్రిమూర్తులు తదితర 30 మంది బడాబాబులకు ఒక్కొక్కరికి ఐదెకరాల చొప్పున గతంలో పట్టాలి చ్చారు.
పట్టాలు పొందిన వా రంతా మృతి చెందారని, భూములను కొం తమంది పెద్దలు 99 ఏళ్లకు లీజుకిస్తున్నారని ఐదేళ్లుగా సీపీఐ నాయకులు ఆందోళన చేస్తున్నారు. అధికారులు మామూళ్లుకు అలవాటు పడి ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోకపోవడంతో భూపోరాటం చేపట్టినట్టు సత్యనారాయణమూర్తి తెలిపారు. జిల్లా అధికారులు స్పందించి జెండాలు పాతిన భూములను భూమిలేని స్థానిక నిరుపేదలకివ్వాలని కోరారు.
భారీ బందోబస్తు
ఆ గ్రామంలో మూడేళ్ల క్రితం జరిగిన భూపోరాటంలో పలువురుకి తీవ్రగాయాలయ్యాయి. దీంతో కొత్తకోట సీఐ పి.వి. కృష్ణవర్మ భారీ బందోబస్తు నిర్వహించారు. కొత్తకోట, రావికమతం, రోలుగుంట, మాకవరపాలెం ఎస్‌ఐలు, సిబ్బందితో పాటు సీఆర్‌పీఎఫ్ బలగాలను, మహిళా పోలీసులు సుమారు 100 మందిని మోహరించారు. ప్రశాంతంగా కార్యక్రమం కొనసాగించాలని సీఐ కృష్ణవర్మ పదేపదే సీపీఐ నాయకులకు విజ్ఞప్తి చేశారు. కార్యక్రమంలో స్థానిక సీపీఐ నాయకులు జోగిరాజు, అజయ్‌బాబు, అర్జున్, సర్పంచ్ వరహాలుదొర, ఎంపీటీసి తదితరులు పాల్గొన్నారు.