- సీఎం పర్యటన రద్దుతో అధికారులు, నాయకుల్లో తీవ్ర నిరాశ
- ఏర్పాట్లకు రూ.లక్షలు వృథా
చోడవరం : ముఖ్యమంత్రి చంద్రబాబునాయుడు పర్యటన జిల్లాలో రద్దు కావడంతో ఇటు తెలుగు తమ్ముళ్లలో నిరాశ చోటు చేసుకోగా, మరో వైపు ఏర్పాట్లకు చేసిన వ్యయంతో రూ.లక్షలు వృథా అయ్యాయి. ఈనెల 30, 31తేదీల్లో జిల్లాలో సీఎం పర్యటించాల్సి ఉంది. ఇందుకోసం ఐదురోజులుగా ఇటు జిల్లా అధికారులు, అటు మంత్రులు, ఎమ్మెల్యేలు, టీడీపీ నాయకులు చాలా అట్టహాసం చేశారు. చోడవరంలో రైతు సదస్సు, కశింకోటలో బడి పిలుస్తోంది, ఉపమాపకలో మహిళా సదస్సుల్లో సీఎం పాల్గొంటారని ఏర్పాట్లు చేశారు. దీనికి అధికారులు, పార్టీ నాయకులు ఎంతో హడావిడి చేశారు.
సభల కోసం లక్షలాది రూపాయలు వ్యయం చేసి ఇనుపరేకులతో కూడిన షెడ్డులు, భారీ స్టేజీని ఏర్పాటు చేశారు. దీనికి రూ.50 లక్షలు మించే ఖర్చయి ఉంటుందని స్థానికులు అంటున్నారు. అసలే నిధులు లేక లోడు బడ్జెట్‌తో ఉన్న వ్యవసాయ, హార్టికల్చర్, విద్య, ఆర్‌అండ్‌బీ, డీఆర్‌డీఏ శాఖలకు సీఎం పర్యటన తలకు మించి భారంగా మారినా తప్పని పరిస్థితుల్లో అధికారులు అన్ని ఏర్పాట్లు చేశారు. అనకాపల్లి నుంచి చోడవరం వరకు రోడ్డుకు ఇరుపక్కల, సభా స్థలి ప్రాంగణాన్ని శుభ్రం చేసి సుందరంగా తయారు చేశారు.
కశింకోట హైస్కూల్‌లో ఏకంగా వంటషెడ్డును హడావిడిగా నిర్మించారు. ఐదురోజుల పాటు అధికారులు కంటి మీద కునుకు లేకుండా ఏర్పాట్లు పనుల్లో నిమగ్నమయ్యారు. ఇంత చేయగా తీరా సీఎం పర్యటన రద్దు కావడంతో వారికి శ్రమే మిగిలింది. దీంతో ఇటు అధికారుల్లోను, అటు కార్యకర్తల్లోను తీవ్ర అసహనం కనిపించింది. అయితే సీఎం పర్యటన పేరిట కొన్ని రోడ్లకు మోక్షం కలగగా, సభలు నిర్వహించే పాఠశాల ఆవరణలు శుభ్రంగా తయారయ్యాయి.