
వడివడిగా...విచ్చలవిడిగా..
- ప్రభుత్వ భూములు, డ్రెయిన్ల ఆక్రమణ
- అక్రమార్కులకు అధికారుల అండదండలు
- మామూళ్ల కోసమే తనిఖీలు
- గుడివాడ, నందివాడ మండలాల్లో చెరువులవుతున్న పంటపొలాలు
గుడివాడ : ఇటీవల కాలంలో నందివాడ, గుడివాడ రూరల్, గుడ్లవల్లేరు మండలాల్లో చేపల చెరువుల తవ్వకాలు విచ్చలవిడిగా జరుగుతున్నాయి. దాదాపు 300 పొక్లెయిన్లు, 250 బుల్డోజర్లు చెరువుల తవ్వకానికి వినియోగిస్తున్నారంటే ఏ స్థాయిలో చేపల చెరువులు తవ్వారో తెలుస్తుంది. పంటబోదెలు, డ్రెయిన్లు, ప్రభుత్వ భూములు ఈచెరువుల్లో కలిసి పోయాయనే ఆరోపణలు ఉన్నాయి.
కోర్టు అనుమతి ఉందంటూ తవ్వేశారు..
కోర్టు అనుమతి ఉందంటూ నందివాడ మండలంలో వందలాది ఎకరాల భూమిని తవ్వేశారు. కొంతమంది కోర్టునుంచి అనుమతి తెచ్చుకొని వ్యవసాయభూమిని చేపల చెరువుగా మార్చుకుంటే, చుట్టుపక్కల భూ యజమానులు సైతం తమకు కోర్టు అనుమతి ఉందంటూ చెరువులు తవ్వుకుంటున్నారు. నిబంధనల ప్రకారం వ్యవసాయశాఖ, రెవెన్యూ, ఇరిగేషన్, డ్రె యినేజీ, భూగర్భ జలాలశాఖ, కాలుష్య నియంత్రణశాఖలు చెరువుల తవ్వకానికి అనుమతి ఇవ్వాల్సి ఉంటుంది. ఈ అధికారులు క్షేత్ర స్థాయిలో పరిశీలన జరిపాక మత్స్యశాఖ వారికి ఎటువంటి అభ్యంతరం లేదని తెలపాలి.
కానీ ఎవరి మామూళ్లు వారు తీసుకుని అనుమతులు అడ్డగోలుగా ఇచ్చేస్తున్నారు. ఇందులో రెవెన్యూశాఖది కీలక పాత్ర. చెరువులు అనుమతి వచ్చాక మండల సర్వేయర్ పెగ్ మార్కింగ్ ఇచ్చాక మాత్రమే తవ్వాలి. కాలువ గట్లు, డ్రెయినేజీలు, రోడ్లు, శ్మశాన వాటికలకు 10మీటర్లు దూరంగానే ఉండాలి. అలాగే దేవాలయ భూములు, అసైన్‌మెంటు భూముల్ని మినహాయించాలి. పంట బోదెలు, డ్రైన్లు పాడవకుండా తవ్వాలి. కానీ ఈనిబంధనలు ఎవరూ పాటించడం లేదు.
తహశీల్దార్‌తో సహా అధికారులంతా రింగ్...
నందివాడ మండలంలో చెరువుల అక్రమ తవ్వకాల్లో మండల తహశీల్దార్‌తో సహా అధికారులంతా రింగ్ అయ్యి అడ్డగోలు తవ్వకాలకు తెరలేపారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. తహశీల్దార్ మాత్రం తనకేమీ తెలియదనే చెబుతూనే గతంలో ఇచ్చిన అనుమతులకు పాత తహశీల్దార్ మామూళ్లు తీసుకున్నాడు కాబట్టి మళ్లీ ఇవ్వాలని డిమాండు చేస్తున్నాడనే ఆరోపణలు ఉన్నాయి. మండలంలో మండల సర్వేయర్, ఆర్‌ఐలు ఎవరి వాటా వారు వసూలు చేసుకుని ఇష్టారాజ్యంగా తవ్వేసుకునేందుకు సహకరిస్తున్నారని చెబుతున్నారు. నందివాడ మండల తహశీల్దార్‌ను అక్రమ తవ్వకాలపై ఎవరైనా ప్రశ్నిస్తే తనకేమీ తెలియదని మండల ఆర్‌ఐ, సర్వేయర్‌లు ఇక్కడ కీలకంగా ఉన్నారని చెప్పేస్తున్నారు. బాధ్యతగల అధికారి ఇలా మాట్లాడటమేమిటని మండల ప్రజలు ముక్కున వేలేసుకుంటున్నారు.
అడ్డగోలు తవ్వకాలకు ఆనవాళ్లు ఇవిగో..
నందివాడ, తమిరిశ, తుమ్మలపల్లి గ్రామాల్లో గత మే నెల నుంచి ప్రభుత్వ నిబంధనలకు విరుద్ధంగా సుమారు రెండు వేల ఎకరాల వరకు చేపల చెరువులు తవ్వారు.
నందివాడలో తవ్విన చెరువులు కారణంగా భూమికోడు, దోసాపడు కాలువలు పూర్తిగా దెబ్బతిన్నాయి. సుమారు 20 ఎకరాల వరకు దేవాదాయశాఖ భూమి చేపలచెరువుగా మారిపోయింది.
తుమ్మలపల్లిలో ఏలూరుకు చెందిన ప్రముఖ చేపల వ్యాపారి 80 ఎకరాలు చెరువులో నడుంకోడు కాలువను పూర్తిగా చెరువులో కలిపేశాడని ఆరోపణలు ఉన్నాయి. ఇదిగాక పంట కాలువ పోరంబోకు 15ఎకరాల వరకు ఆక్రమించాడు. దీనిపై ఫిర్యాదు చేసినా అధికారులు పట్టించుకోలేదు. ఇదే గ్రామంలో టీడీపీకి చెందిన నేత 60 ఎకరాల చేపల చెరువును నిబంధనలకు విరుద్ధంగా తవ్వించారు. మేజర్ చానల్ అయిన రాసకోడు చాల వరకు చెరువుల యజమానులు అక్రమించారు.
నందివాడ మండలానికి సాగు, తాగునీరు ఇచ్చే దోసపాడు చానల్‌కు చాల చోట్ల చెరువుల యజమానులు తూట్లు పొచించారు. చానల్‌కు అనుబంధంగా ఉన్న టీఆర్‌ఎస్ చానల్‌ను నందివాడ నుంచి తుమ్మలపల్లి వరకు పూర్తిగా అక్రమించారు.
వెంకటరాఘవపురం వద్ద జగంకోడు చానల్‌ను సైతం పూర్తిగా కబ్జా చేశారు. దీనిపై ఆగ్రామానికి చెందిన నాయకుడు ఫిర్యాదు చేసినా ఫలితం లేకుండా పోయింది.
రామాపురంలో కొత్తగా 120 ఎకరాల చెరువు తవ్వకంలో ప్రభుత్వ నిబంధనలు పటించలేదు. గ్రామానికి వెళ్లే రోడ్డు సైతం కబ్జా చేశారు. చానల్ కరకట్టనే చేపల చెరువు కట్టగా మార్చుకున్నారు.
గుడివాడ రూరల్ మండలంలోని మోటూరులో 80 ఎకరాల చెరువులో పంట బోదె తవ్వేశారు. ఈ చెరువుకు రోడ్డుకు ఆనుకుని గట్టువేశారు. గుంటాకోడూరులో కూడా ఇదేపరిస్థితి నెలకొంది. అడ్డగోలు తవ్వకాలపై ఆయా మండల తహశీల్దార్‌లను వివరణ కోరగా.. తవ్వేశాక లెసైన్సు ఇచ్చేటప్పుడు చూస్తామని చెబుతున్నారు. కబ్జా చేసిన వారికి నోటీసులు జారీ చేస్తామంటున్నారు.