ఆ తోటలు ఎవరికీ చెందవని కోర్టు తేల్చి చెప్పింది. సర్కారు ఆధీనంలో ఉంచాలని ఆదేశించింది. పుష్కర కాలం తర్వాత లక్షల విలువైన ఆ తోటలు నరికివేతకు, తరలింపునకు గురవుతున్నాయి. ‘అధికారం మా వెంట ఉంటే.. ఏ తీర్పు ఉన్నా మాకేంటి’ అన్నట్లు కొందరు బడాబాబులు ఈ దుశ్చర్యకు పాల్పడుతున్నారు. తమ ఆధీనంలోనే ఉన్న వీటిని కాపాడాల్సిన రెవెన్యూ యంత్రాంగం అధికార ఒత్తిళ్లకు తలొగ్గి మౌనం వహిస్తోంది. స్థానికులు పలుమార్లు చేసిన ఫిర్యాదులు బట్టదాఖలవుతున్నాయి.
శ్రీకాకుళం రూరల్ : రాష్ట్ర ఉన్నత న్యాయస్థానం ఆదేశాల ప్రకారం రెవెన్యూ శాఖ ఆధీనంలో ఉన్న సుమారు రూ. 50 లక్షల విలువైన సరుగుడు తోటలు అక్రమార్కుల గొడ్డలివేటుకు నేలకూలి కలపగా మారి తరలిపోతున్నాయి. అధికార పార్టీ నేతల అండదండలతో జరుగుతున్న ఈ దందాను ఎవరూ పట్టించుకోవడంలేదని స్థానికులు ఆరోపిస్తున్నారు. సీఆర్‌జెడ్ జోన్‌లోకి వచ్చే శ్రీకాకుళం రూరల్ మండల పరిధిలోని కనుగులవానిపేట, మోపసుబందురు రెవెన్యూ గ్రామాలకు చెందిన సుమారు 30 ఎకరాల అన్‌సర్వ్‌డ్ భూములను గతంలో కొందరు ఆక్రమించుకుని, ఫలసాయాన్ని అనుభవించేవారు.
అయితే 30 ఎకరాల ప్రభుత్వ భూములను ఒకరిద్దరు మాత్రమే అనుభవించడేమిటి?.. వాటిని పేదలు పంచాలని కోరుతూ ఈ గ్రామాలకు చెందిన పలువురు హైకోర్టును ఆశ్రయించారు. 30 ఏళ్లపాటు ఈ వివాదం కోర్టులో నలిగింది. చివరికి 2002లో హైకోర్టు దీనిపై తీర్పు ప్రకటిస్తూ ఈ భూములపై ఎవరికీ హక్కు లేదని తేల్చి చెప్పింది. సీఆర్‌జెడ్ జోన్‌లో ఉన్నందున జిల్లా కలెక్టర్‌కు ఈ భూముల సంరక్షణ బాధ్యత అప్పగించింది. అప్పటినుంచి రెవెన్యూ శాఖ ఆధీనంలో ఉన్న ఈ భూముల్లో పెరిగిన సరుగుడు తోటల ఫలసాయాన్ని 2012లో అప్పటి తహశీల్దార్ ఆధ్వర్యంలో వేలం వేయగా రూ. 29 లక్షలకు పాట ఖరారైంది.
మళ్లీ కోర్టుకు..
ఈ తరుణంలో గతంలో ఈ తోటల ఫలసాయాన్ని అనుభవించిన ఆక్రమణదారులు వేలాన్ని సవాల్ చేస్తూ కోర్టును ఆశ్రయించారు. దాంతో కోర్టు మళ్లీ జోక్యం చేసుకున్న ఖరారైన వేలం పాట అమలు కాకుండా నలిపివేసింది. అయితే భూములపై హక్కును మాత్రం మార్చలేదు. ఆ మేరకు ఈ భూములు, తోటలు రెవెన్యూ ఆధీనంలోనే ఉన్నాయి. కాగా గత నెల రోజులుగా ఈ తోటల్లోని సరుగుడు చెట్లను కొందరు ఆక్రమంగా నరికి, తరలిస్తున్నారు. ప్రస్తుతం ఈ తోటల విలువ రూ. 50 లక్షలకుపైగా ఉంటుందని స్థానికులు చెబుతున్నారు.
ఇంత విలువైన ఆస్తి కరిగిపోతున్నా అధికారులు పట్టించుకోవడం లేదని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీనిపై తహశీల్దారుకు, ఆర్డీవోకు ఫిర్యాదు చేసినా ఫలితం శూన్యమని, కనీసం ఇక్కడ ఏం జరుగుతోందో తెలుసుకున్న పాపాన పోలేదని అంటున్నారు. గత సోమవారం కలెక్టరేట్ గ్రీవెన్సులో కూడా ఫిర్యాదు చేశామని గ్రామస్తులు చెప్పారు. కొద్దిమంది వ్యక్తులు అధికార పార్టీ అండదండలతో అక్రమంగా నరికి తరలిస్తుంటే చూసి చూడనట్లు వ్యవహరించడం తగదని అంటున్నారు. ఆ తోటలను గ్రామంలో నిరుపేదలకు పంచిపెట్టాలని కోరుతున్నారు.
ప్రభుత్వ ఆస్తిని కాపాడాలి
ప్రభుత్వ ఆస్తిని కాపాడాలి. ఇంతవరకు రెవెన్యూ శాఖ ఆధీనంలో ఉన్న తోటలను అధికార పార్టీ నాయకులకు తలొగ్గి అప్పగించడం తగదు. ఇప్పటికైనా చెట్ల నరికివేతను నిలువరించాలి.
- కనుగులు జనార్దనరావు, మాజీ ఎంపీటీసీ
అక్రమార్కులపై చర్యలు తీసుకోవాలి
సీఆర్‌జెడ్ జోన్ పరిధిలోని చెట్లను అక్రమంగా నరికి, తరలిస్తున్న వారిపై చర్యలు తీసుకోవాలి. సుమారు రూ. 50 లక్షల విలువైన ప్రభుత్వ ఆస్తిని కాపాడాలి.
- ఇప్పిలి రామారావు, స్థానికుడు
వేలం వేసిన ఆస్తిని తరలిస్తున్నారు
గతంలో తహశీల్దార్ ఆధ్వర్యంలో రూ. 29 లక్షలకు వేలం వేసిన ప్రభుత్వ ఆస్తిని అక్రమంగా తరలిస్తున్నా ఎవరూ పట్టించుకోవడంలేదు. పలుమారు ఫిర్యాదులు చేసినా స్పందన లేదు.
- కనుగుల ఆమ్మాజమ్మ, మాజీ సర్పంచ్
సర్కారు తోటల్లో అక్రమాల చెడుగుడు
Published Sat, Mar 14 2015 1:34 AM | Last Updated on Sat, Sep 2 2017 10:47 PM
Advertisement
Advertisement