భూస్వాధీనం ప్రక్రియపై న్యాయశాఖ మంత్రి టి.బి.జయచంద్ర
సాక్షి, బెంగళూరు : ప్రభుత్వ భూములు అన్యాక్రాంతం కాకుండా ఉండటానికి, అన్యాక్రాంతమైన భూములను తిరగి స్వాధీనం చేసుకోవడానికి వీలుగా రాష్ట్ర రెవెన్యూ చట్టంలో చేసిన మార్పులకు కేంద్రప్రభుత్వం నుంచి అనుమతి లభించాల్సి ఉందని న్యాయశాఖ మంత్రి టీ.బీ జయచంద్ర తెలిపారు. విధానసౌధాలో ఆయన మీడియాతో గురువారం మాట్లాడారు.
ప్రత్యేక న్యాయస్థానాలను ఏర్పాటు చేసి సంబంధిత కేసులను త్వరగా ముగించడానికి అనువుగా రూపొందించిన నివేదిక కేంద్ర ప్రభుత్వం వద్ద చాలా కాలంగా పెండింగ్‌లో ఉందన్నారు. రెవెన్యూ, వక్ఫ్, దేవాదాయ తదితర ప్రభుత్వ శాఖలకు చెందిన ప్రభుత్వ భూమి రాష్ట్రంలో 62.25 లక్షల హెక్టార్లు ఉందన్నారు. ఇందులో 13.24 లక్షల ఎకరాలు అన్యాక్రాంతమైందని తెలిపారు. ఇప్పటి వరకూ దాదాపు లక్ష ఎకరాలు మాత్రమే ప్రభుత్వం స్వాధీనం చేసుకుందన్నారు.
కేంద్ర ప్రభుత్వం నుంచి అనుమతి లభించిన వెంటనే చట్ట ప్రకారం న్యాయస్థానాల ద్వారా మిగిలిన ప్రభుత్వ భూమిని స్వాధీనం చేసుకోవడమే కాకుండా భవిష్యత్‌లో ఇలాంటి పొరపాట్లు జరగకుండా జాగ్రత్తలు తీసుకుంటామని చెప్పారు. రాష్ట్రంలో ‘సకాల’ పథకం కింద ఇప్పటి వరకూ (రెండేళ్లలో) 4.72 కోట్లు దరఖాస్తులు పరిష్కరించినట్లు తెలిపారు.
సకాల విషయంలో చిక్కబళాపుర జిల్లా అగ్రస్థానంలో ఉందన్నారు. లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో గత నెలలో సకాల దరఖాస్తుల పరిష్కారం కొంత ఆలస్యమయిన మాట వాస్తవమేనని తెలిపారు. కార్పొరేట్ సోషియల్ రెస్పాన్సిబులిటీ కింద రాష్ట్రంలోని బహుళ జాతీయ, ప్రైవేటు కంపెనీల నుంచి రూ. వెయ్యికోట్ల నిధులు వచ్చే అవకాశం ఉందన్నారు. ఈ నిధులను రాష్ట్రంలోని గ్రామీణ ప్రాంతాల్లో మౌలిక సదుపాయాల కల్పన కోసం ఖర్చుచేస్తామన్నారు.
కేంద్రం అనుమతే తరువాయి
Published Fri, May 23 2014 1:01 AM | Last Updated on Sat, Sep 2 2017 7:42 AM
Advertisement
Advertisement