ఎన్నెన్నో..భూతాలు
- 1500 ఎకరాలు అన్యాక్రాంతం
- ప్రయివేట్ వ్యక్తుల చేతుల్లో ప్రభుత్వ భూములు
- రెవెన్యూ సర్వేతో వెలుగులోకి..
- పరదేశిపాలెంలో రద్దయిన అసైన్‌మెంట్లు వేరొకరికి కేటాయింపు
- కలెక్టర్ సీరియస్
- రద్దు చేయాలని అధికారులకు ఆదేశాలు
కోట్లాది రూపాయల ప్రభుత్వ భూములు ప్రయివేట్ వ్యక్తుల కబంధ హస్తాల్లో చిక్కుకున్నాయి. ఒకటి, రెండు కాదు ఏకంగా 1500 ఎకరాలకు పైగా భూములు అన్యాక్రాంతమయ్యాయి. రెవెన్యూ అధికారులు చేపట్టిన సర్వేలో ఈ వాస్తవాలు వెలుగు చూశాయి.
విశాఖ రూరల్: అర్బన్ ఎగ్లామిరేషన్ యాక్ట్ అమలులో ఉన్నా జీవీఎంపీ పరిధిలో భూములు ప్రయివేటు వ్యక్తులకు కేటాయింపులు చేసిన విషయం ఆలస్యంగా వెలుగులోకి వచ్చింది. అక్రమంగా అసైన్ చేసిన భూములను కలెక్టర్ రద్దు చేసిన రెండు నెలల్లోనే అవే భూములను మరో అయిదుగిరికి కేటాయించడం సర్వత్రా చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంపై కలెక్టర్ తీవ్ర ఆగ్రహంతో ఉన్నట్టు సమాచారం. ప్రస్తుతం దీనిపై విచారణ చేపట్టనుండగా.. ఆ కేటాయింపులను రద్దు చేసేందుకు అధికారులు సిద్ధమయ్యారు.
మాస్టర్‌ప్లాన్‌తో వెలుగులోకి..
జిల్లాలో జాతీయ విద్యా సంస్థలకు అవసరమైన భూములతో పాటు భవిష్యత్తు అవసరాల కోసం అధికారులు ప్రభుత్వ భూములతో మాస్టర్ తయారు చేయాలని నిర్ణయించారు. ప్రభుత్వ భూములు, ఇతర శాఖలకు కేటాయించిన భూములు, అన్యాక్రాంతమైన భూములు, కోర్టు వివాదాల్లో ఉన్న భూములు.. ఇలా నాలుగు అంశాలుగా సర్వేలు చేపడుతున్నారు. ఇప్పటి వరకు సుమారుగా 7 వేల ఎకరాల వరకు ప్రభుత్వ భూమి ఉన్నట్టు అధికారులు గుర్తించారు.
రికార్డుల ప్రకారం ప్లెయిన్ ఏరియాలో ప్రభుత్వ భూములు లేవని అధికారులు ముందు భావించి విద్యా సంస్థల కోసం కొండ పోరంబోకు స్థలాలను గుర్తించి ఆ నివేదికలను ప్రభుత్వానికి సమర్పించారు. తాజాగా క్షేత్ర స్థాయిలో చేసిన సర్వేలో 50 నుంచి 150 ఎకరాల విస్తీర్ణంలో అనేక బిట్లు ఉన్నట్టు అధికారులు గుర్తించారు. వాటన్నింటినీ అక్రమంగా ప్రయివేట్ వ్యక్తులకు కేటాయించడంతో వాటిని తిరిగి స్వాధీనం చేసుకోవాలని అధికారులు నిర్ణయించారు.
1500 ఎకరాలు అన్యాక్రాంతం
పరదేశిపాలెంలో వందల కోట్లు విలువ చేసే 50 ఎకరాల స్థలాన్ని అక్రమంగా 23 మందికి కేటాయింపులు చేసిన విషయం ఆలస్యంగా వెలుగుచూసింది. వాస్తవానికి అర్బన్ ఎగ్లామిరేషన్ యాక్ట్ ప్రకారం జీవీఎంసీ పరిధిలో భూములను ఎవరికీ అసైన్ చేసే అవకాశం లేదు. అయినా 50 ఎకరాలను వ్యవసాయ భూమి కింద కొంత మందికి కేటాయింపులు చేయడాన్ని అధికారులు గుర్తించారు.
కలెక్టర్ సాల్మన్ ఆరోఖ్యరాజ్ ఆ అసైన్‌మెంట్లను ఫిబ్రవరిలో రద్దు చేశారు. అవే భూములను ఏప్రిల్‌లో మరో అయిదుగురికి కేటాయించడం ఇప్పు డు చర్చనీయాంశంగా మారింది. ఈ వ్యవహారంలో 11 రిట్‌పిటీషన్లు కోర్టు లో ఉండగా.. వాటన్నింటినీ ఒకే కేసుగా పరిగణించి విచారణ చేపడితే వివాదం వేగంగా పరిష్కారమవుతుం దని అధికారులు భావిస్తున్నారు. ఆ దిశ గా కోర్టును ఆశ్రయించేందుకు సిద్ధమవుతున్నారు.
స్టీల్‌ప్లాంట్ గోడను ఆనుకొని నడుపూర్‌లో 200 ఎకరాల అటవీ భూమి ఉంది. దీన్ని కాజేయడానికి కొంత మంది పక్క భూమి సర్వే నంబ ర్ చూపించి కోర్టులో పిటీషన్ వేసిన విషయాన్ని అధికారులు గుర్తించారు. తప్పుడు సర్వే నంబర్‌తో పిటీషన్ వేసిన వేషయాన్ని కోర్టు దృష్టికి తీసుకువెళ్లి భూములను తమ స్వాధీనంలోకి తీసుకోవాలని భావిస్తున్నారు. ఇలా రెవెన్యూ అధికారుల సర్వేలో అనేక ప్రాంతాల్లో 1500 ఎకరాలకు పైగా అన్యాక్రాంతమైన విషయాన్ని గుర్తించారు. వాటన్నింటిపై చర్యలు తీసుకోవడానికి సిద్ధమవుతున్నారు.