గరిష్టానికి ఆర్థిక లోటు | Telangana falls short of revenue target by 8758 per cent at January end | Sakshi
Sakshi News home page

గరిష్టానికి ఆర్థిక లోటు

Published Sat, Feb 22 2025 3:58 AM | Last Updated on Sat, Feb 22 2025 3:58 AM

Telangana falls short of revenue target by 8758 per cent at January end

తెలంగాణ రాష్ట్రంలో తొలిసారి ఏకంగా 8,758 శాతానికి చేరిక

ప్రతిపాదిత బడ్జెట్‌ కంటే ఇప్పటికే రూ.9 వేల కోట్లు ఎక్కువగా అప్పుల సేకరణ

జనవరి నెలాఖరుకే రూ.26,050 కోట్ల లోటు ఉందన్న కాగ్‌

ప్రభుత్వానికి పెద్ద తలపోటు లాంటి పరిస్థితే అంటున్న ఆర్థిక నిపుణులు

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్ర ఆర్థిక ముఖ చిత్రం వెలవెలబోతోంది. తెలంగాణ రాష్ట్రంలో గతంలో ఎన్నడూ లేని విధంగా తొలిసారి నికర ఆర్థిక లోటు ఏకంగా 8,758 శాతానికి చేరింది. అంటే రాష్ట్ర ఖజానాకు వస్తున్న రెవెన్యూ ఆదాయానికి, ఖజానా నుంచి పెడుతున్న రెవెన్యూ ఖర్చుకు మధ్య ఆ మేరకు తేడా ఉందన్నమాట.కంప్ట్రోలర్  అండ్‌ ఆడిటర్‌ జనరల్‌ (కాగ్‌) నివేదిక ఈ విషయం వెల్లడించింది. 2025 జనవరి మాసాంతానికి గాను వార్షిక బడ్జెట్‌ స్థితిగతులపై కాగ్‌ ఇచ్చిన ఈ నివేదిక ప్రకారం.. రాష్ట్రంలో నికర ఆర్థిక లోటు రూ.26,050 కోట్లకు చేరింది.

జనవరి నెలాఖరుకు రెవెన్యూ ఆదాయం రూ.1,23,815.60 కోట్లు ఉండగా, రెవెన్యూ ఖర్చు రూ.1,49,866.10 కోట్లుగా నమోదయింది. ఆదాయం కంటే ఖర్చు రూ.26 వేల కోట్లకు పైగా ఉందని ఈ గణాంకాలు స్పష్టం చేస్తున్నాయి. వాస్తవానికి 2024–25 వార్షిక బడ్జెట్‌లో రూ.297.42 కోట్ల మేర నికర ఆర్థిక మిగులు ఉంటుందని ప్రభుత్వం అంచనా వేసింది. కానీ ఈ అంచనాలను తలకిందులు చేస్తూ ఏకంగా 8,758 శాతం మేరకు నికర లోటు చేరుకోవడం గమనార్హం. తెలంగాణ రాష్ట్రం ఏర్పాటైన తర్వాత ఈ మేరకు నికర ఆర్థిక లోటు ఎప్పుడూ లేదని, ఇది రాష్ట్ర ప్రభుత్వానికి పెద్ద ఆర్థిక తలపోటు లాంటి పరిస్థితి అని ఆర్థిక నిపుణులు చెబుతున్నారు.

అంచనాల్లో ఇప్పటివరకు 56% ఆదాయమే..! 
ఈ ఆర్థిక సంవత్సరం రాష్ట్ర ప్రభుత్వానికి కటకట అంటే ఎలా ఉంటుందో చూపిస్తోంది. ప్రభుత్వ అంచనాలకు, రాబడులకు పొంతన లేకుండా పోవడంతో ఏం చేయాలో అర్థం కాక ఆర్థిక శాఖ అధికారులు తలలు పట్టుకుంటున్నారు. 2024–25 ఆర్థిక సంవత్సరంలో రూ.2.21 లక్షల కోట్ల రెవెన్యూ ఆదాయం వస్తుందని ప్రభుత్వం అంచనా వేయగా, జనవరి మాసాంతానికి కేవలం రూ.1.23 లక్షల కోట్లు మాత్రమే నమోదు కావడం గమనార్హం. ఈ ఆర్థిక సంవత్సరంలో ఇంకా రెండు నెలలు మాత్రమే మిగిలి ఉండగా.. అంచనాల్లో 56 శాతమే ఆదాయం రావడం, ఇంకా రూ.లక్ష కోట్ల వరకు రావాల్సి ఉండడం గమనార్హం.  

జీఎస్టీ ఓకే.. రిజిస్ట్రేషన్లు డౌన్‌ 
ఈ ఆర్థిక సంవత్సరంలో పన్ను రాబడులు రూ.1.64 లక్షల కోట్లు వస్తాయని 2024–25 వార్షిక బడ్జెట్‌లో ప్రభుత్వం ప్రతిపాదించగా.. జనవరి మాసాంతానికి రూ.1,12,772 కోట్లు మాత్రమే (68 శాతమే) సమకూరాయి. ఆదాయార్జన శాఖల వారీగా చూస్తే ఎంతో కొంత వస్తు సేవల పన్ను (జీఎస్టీ) మాత్రమే ఆశాజనకంగా కనిపిస్తోంది. 2024–25 ఆర్థిక సంవత్సరంలో జీఎస్టీ ద్వారా రూ.58,594 కోట్ల ఆదాయం వస్తుందని అంచనా వేయగా, అందులో 73 శాతం అంటే రూ.42,658 కోట్ల మేర సమకూరింది.

స్టాంపులు, రిజిస్ట్రేషన్ల ద్వారా రూ.18 వేల కోట్లకు పైగా ఆదాయం వస్తుందని ఆశలు పెట్టుకోగా, ఇప్పటివరకు కేవలం రూ.5,821 కోట్లు మాత్రమే రావడం గమనార్హం. అమ్మకపు పన్ను, కేంద్ర పన్నుల్లో వాటా లాంటివి కూడా ఓ మోస్తరుగా వచ్చినా, ఎక్సైజ్, పన్నేతర రాబడులు తగ్గిపోయాయి. ఇక కేంద్రం నుంచి రావాల్సిన గ్రాంట్‌ ఇన్‌ ఎయిడ్‌ కూడా బడ్జెట్‌ అంచనాలతో పోల్చుకుంటే కేవలం 24 శాతమే రావడం గమనార్హం.  

భారీగా పెరిగిన అప్పులు 
ఆదాయం భారీగా తగ్గగా, మరోవైపు అప్పుల పద్దు భారీగా పెరిగింది. ఈ ఆర్థిక సంవత్సరానికి గాను బహిరంగ మార్కెట్‌లో రూ.49,225 కోట్ల రుణాలు సేకరించాలని లక్ష్యంగా పెట్టుకోగా, జనవరి నెలాఖరుకే అప్పులు రూ.58 వేల కోట్లకు చేరాయి. మరో రెండు నెలల్లో ఇంకో రూ.20 వేల కోట్ల రుణం తీసుకునేందుకు ఆర్‌బీఐ దగ్గర షెడ్యూల్‌ సిద్ధంగా ఉన్న నేపథ్యంలో ఈసారి అప్పుల చిట్టా రూ.80 వేల కోట్లకు చేరే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇందులో రూ.22 వేల కోట్ల కు పైగా గతంలో తెచ్చిన అప్పులకు వడ్డీల కిందే చెల్లించాల్సి రావడం గమనార్హం.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

 
Advertisement