రాష్ట్రంలోని 124 చట్టాలను కలిపి రెవెన్యూ కోడ్ అమలు
ఇప్పటికే సిద్ధమవుతున్న ముసాయిదా.. త్వరలోనే ప్రభుత్వ పరిశీలనకు..
ప్రస్తుతం ఉన్న 20కిపైగా కాలంచెల్లిన రెవెన్యూ చట్టాలను రద్దు చేసే అవకాశం
సాక్షి, హైదరాబాద్: ధరణి పోర్టల్‌లోని అన్ని మాడ్యూళ్లను రద్దు చేసి ఒకటే మాడ్యూల్ ఏర్పాటు చేయాలని నిర్ణయించిన ప్రభుత్వం.. రాష్ట్రంలో ప్రస్తుతం అమలవుతున్న అన్ని రెవెన్యూ చట్టాల స్థానంలో ఒకటే చట్టాన్ని (రెవెన్యూ కోడ్) అమల్లోకి తెచ్చేందుకు కూడా కసరత్తు చేస్తోంది. ధరణి పోర్టల్ పునరి్మర్మాణ కమిటీతోపాటు గతంలో నల్సార్ విశ్వవిద్యాలయం చేసిన సిఫార్సు మేరకు రెవెన్యూ కోడ్‌ను అమలు చేసే దిశగా చర్యలు చేపడుతోంది. ఇప్పటికే ఈ కోడ్ ముసాయిదా తయారీలో నిమగ్నమైన రెవెన్యూ వర్గాలు త్వరలోనే ముసాయిదా చట్టాన్ని ప్రభుత్వ పరిశీలనకు పంపనున్నట్లు తెలుస్తోంది.
ప్రస్తుతం రాష్ట్రంలో 124 రెవెన్యూ చట్టాలు, నియమాలు అమల్లో ఉన్నాయి. రికార్డ్ ఆఫ్ రైట్స్ (ఆర్‌వోఆర్)తోపాటు సర్వే, భూ రికార్డుల నిర్వహణ, సీలింగ్, కౌలు, రెవెన్యూ రికవరీ, భూ ఆక్రమణ నిరోధం, రెవెన్యూ పరిపాలన, భూదాన్, ఇనాం, వదిలివేయబడిన భూములు, భూవివాదాల పరిష్కారం... ఇలా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్‌లో అమల్లో ఉన్న అన్ని చట్టాలు ప్రస్తుతం కూడా అమల్లో ఉన్నాయి. అయితే వాటన్నింటినీ తెలంగాణకు వర్తింపజేయాల్సిన అవసరం లేదని.. వాటిలో 20కిపైగా కాలంచెల్లిన చట్టాలున్నా యని తెలంగాణ రాష్ట్ర ఏర్పాటు సమయంలో భూచట్టాల నిపుణులు పేర్కొన్నారు.
కానీ ప్రభు త్వం దీన్ని పెడచెవిన పెట్టింది. కాంగ్రెస్ ప్రభు త్వం ఏర్పాటయ్యాక రెవెన్యూ వ్యవస్థ అమల్లో గందరగోళాన్ని నివారించేందుకు ఒకటే రెవెన్యూ చట్టాన్ని అమల్లోకి తేవాలనే ప్రయత్నాలు ప్రారంభమయ్యాయి. కాలంచెల్లిన ఆ చట్టాలను రద్దు చేయడంతోపాటు అన్ని రాష్ట్రాల్లో అమల్లో ఉన్న 5 వేల భూ చట్టాలను అధ్యయనం చేసి అందులో అవసరమైన చట్టాలను తెలంగాణకు వర్తింపజేస్తూ రెవెన్యూ కోడ్‌లో పొందుపరిచే అవకాశాలు కనిపిస్తున్నాయి.
అధికారులకూ సులభతరం...
నిజాం హయాంలో తెలంగాణ ప్రాంత భూపరిపాలన, రెవెన్యూ వ్యవస్థ అమలు కోసం భూమి రెవెన్యూ చట్టం–1907 పేరుతో సమగ్ర చట్టం అమల్లో ఉండేది. తెలంగాణ ప్రాంతం ఆంధ్రప్రదేశ్‌లో కలిశాక ఈ చట్టం స్ఫూర్తిని నిర్వీర్యం చేస్తూ 124 చట్టాలుగా మార్చారని భూచట్టాల నిపుణులు చెబుతున్నారు. ఇప్పుడు రెవెన్యూ కోడ్ అమల్లోకి వస్తే భూమి సమస్యల పరిష్కారం సంబంధిత అధికారులకు సులభతరం కావడంతోపాటు భూమి హక్కులను కాపాడుకునే విషయంలో రైతులకు కూడా స్పష్టత వస్తుందని అంటున్నారు.
ఏ చట్టం ద్వారా ఏ సమస్య పరిష్కారమవుతుంది, ఏ అధికారి వద్దకు వెళ్లాలనే విషయంలో కూడా అన్నదాతలకు గందరగోళం పోతుందని చెబుతున్నారు. యూపీలో 2016లోనే ఈ కోడ్ అమల్లోకి వచ్చిందని, ప్రస్తుతం ఒడిశాలోనూ కోడ్ అమలు ప్రయత్నాలు జరుగుతున్నాయని నిపుణులు అంటున్నారు. ఈ నేపథ్యంలో తెలంగాణలో కూడా రెవెన్యూ కోడ్ అమల్లోకి వస్తే భూమి సమస్యలు, రైతుల ఇబ్బందుల పరిష్కారానికి సమగ్ర వ్యవస్థ అందుబాటులోకి వస్తుందని వారు అభిప్రాయపడుతున్నారు.
సౌకర్యవంతంగా ఉంటుంది
దేశవ్యాప్తంగా 5 వేలకుపైగా భూ చట్టాలు అమల్లో ఉన్నాయి. ఆయా రాష్ట్రాల భౌగోళిక, సామాజిక పరిస్థితుల ఆధారంగా ఆయా రాష్ట్రాలు తగిన చట్టాలను అమలు చేసుకుంటున్నాయి. యూపీలో రెవెన్యూ కోడ్ అమల్లోకి వచ్చాక అక్కడ మారిన పరిస్థితుల గురించి క్షేత్రస్థాయిలో అధ్యయనం చేసి ప్రభుత్వానికి నివేదిక కూడా ఇచ్చాం. ప్రతి రాష్ట్రంలో రెవెన్యూ కోడ్ అమల్లోకి వస్తే భూచట్టాల్లో ఉన్న గందరగోళం పోతుంది. – ఎం. సునీల్‌కుమార్, భూచట్టాల నిపుణులు
Comments
Please login to add a commentAdd a comment