సమీక్షలో మంత్రి కొండా సురేఖ, ఉపముఖ్యమంత్రి భట్టి విక్రమార్క
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో టెంపుల్ టూరిజంతో ఎకో టూరిజాన్ని కలిపి టూరిస్ట్ సర్క్యూట్లను ఏర్పాటు చేయాలని అటవీ, పర్యావరణ, దేవాదాయ శాఖలకు ఉపముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క సూచించారు. టెంపుల్ టూరిజం అభివృద్ధికి ప్రత్యేక చర్యలు తీసుకోవడంతోపాటు దేవాలయ ఖాళీ భూముల్లో ఆలయ సందర్శకుల సౌకర్యార్థం కాటేజీలు నిర్మించేలా చర్యలు చేపట్టాలన్నారు. మంగళవారం సచివాలయంలో ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క అధ్యక్షతన దేవాదాయ, పర్యావరణ, అటవీ శాఖల బడ్జెట్ అంచనాలపై సమీక్ష జరిగింది.
గిరిజనుల లబ్ధికి ఔషధ మొక్కల తోటల పెంపకం చేపట్టండి..
ఈ సందర్భంగా భట్టి మాట్లాడుతూ ఎన్నో ప్రముఖ ఆలయాలు, ప్రార్థనాలయాలున్న తెలంగాణలో టెంపుల్ టూరిజం అభివృద్ధికి విస్తృత అవకాశాలు ఉన్నాయన్నారు. నాగోబా, మేడారం లాంటి గిరిజన జాతరలకు దేశ, విదేశీ పర్యాటకులను ఆహ్వానించేలా ప్రణాళికలు రూపొందించాలని ఆయన సూచించారు.
అటవీ సంపద, వన్య ప్రాణుల పరిరక్షణకు అత్యంత ప్రాధాన్యత ఇవ్వడంతోపాటు ఏజెన్సీ, అటవీ భూముల్లో గిరిజనులకు ఆర్థికపరమైన మేలు జరిగేలా ఆయుర్వేద సంబంధిత ఔషధ మొక్కల తోటలను పెంచాలన్నారు. ఆయుష్ శాఖ, ఆయుర్వేద మందుల కంపెనీలతో ఈ ప్లాంటేషన్లకు సంబంధించి మార్కెటింగ్‌ను అనుసంధానించాలని పేర్కొన్నారు. అటవీ ప్రాంతాల్లో సఫారీ, ఎకో టూరిజానికి హైదరాబాద్‌వాసుల్లో ఆదరణ ఉందని, ఈ విధమైన పర్యాటకాభివృద్ధి ప్రాజెక్టులకు ప్రాధాన్యత ఇవ్వాలని భట్టి చెప్పారు. అటవీ ప్రాంతాల్లో వివిధ అవసరాలకు సోలార్ పవర్ యూనిట్లను ఏర్పాటు చేయాలన్నారు.
దేవాదాయ, అటవీ శాఖలకు సంబంధించి ప్రతిపాదిత బడ్జెట్ నిధులను ఉదారంగా కేటాయించాలని అటవీ, దేవాదాయ శాఖ మంత్రి కొండా సురేఖ విజ్ఞప్తి చేశారు. సమావేశంలో ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి రామకృష్ణ రావు, ఎండోమెంట్స్ శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి సునీల్ శర్మ, పర్యావరణ, అటవీ శాఖ ముఖ్య కార్యదర్శి వాణీప్రసాద్, దేవాదాయ కమిషనర్ అనీల్ కుమార్, పీసీసీఎఫ్ డోబ్రియల్ పాల్గొన్నారు.
Comments
Please login to add a commentAdd a comment