ఒంగోలు కలెక్టరేట్, న్యూస్‌లైన్: జిల్లాలో ఖాళీగా ఉన్న 100 నుంచి 300 ఎకరాల్లోపు ప్రభుత్వ భూముల వివరాలు ఈనెల 26వ తేదీలోపు అందించాలని జాయింట్ కలెక్టర్ కే యాకూబ్ నాయక్ ఆదేశించారు. స్థానిక కలెక్టరేట్‌లోని వీడియో కాన్ఫరెన్స్ హాలు నుంచి జిల్లాలోని ముగ్గురు ఆర్‌డీఓలు, 56 మంది తహసీల్దార్లతో శనివారం ఆయన వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు. ఈ సందర్భంగా జాయింట్ కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర విభజన జరిగిన నేపథ్యంలో సీమాంధ్రలో కీలకమైన యూనివర్శిటీలను స్థాపించే యోచనలో ప్రభుత్వం ఉందన్నారు.
ఐఐటీ, ఐఐఐటీ, సెంట్రల్ యూనివర్శిటీ, ఇండియన్ ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ మేనేజ్‌మెంట్‌లను ఏర్పాటుకు అవసరమైన స్థలాలను గుర్తిస్తోందన్నారు. వీటిని ఏర్పాటు చేసేందుకు 100 నుంచి 300 ఎకరాల ప్రభుత్వ భూమి అవసరమవుతుందని, ఈ నేపథ్యంలో మండలాల్లో త్వరితగతిన భూములను గుర్తించి వెంటనే నివేదికలు అందించాలని ఆదేశించారు. అదేవిధంగా మండలాల వారీగా ప్రభుత్వ భూములు, అసైన్డ్ భూములు ఎన్ని ఎకరాలున్నాయి, అసైన్డ్ భూమిలో ఎంతమందికి పట్టాలిచ్చారు, ఎంత ఖాళీగా ఉంది, ఎన్నిచోట్ల ఆక్రమణలకు గురయ్యాయో నెలాఖరులోపు వివరాలు అందించాలని ఆదేశించారు.
ఆర్‌ఎస్‌ఆర్ యాక్ట్ కింద డివిజన్ల వారీగా ఎన్ని ఎకరాలున్నాయి, వాటిలో పట్టా భూములు ఎంత ఉన్నాయో నివేదికలు అందించాలని ఆదేశించారు. ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికాకుండా చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేయాలని సూచించారు. ఎక్కడైనా ఆక్రమణలకు గురైనట్లు గుర్తిస్తే వెంటనే చర్యలు తీసుకోవాలని ఆదేశించారు. ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురికాకుండా చుట్టూ ఫెన్సింగ్ వేసేందుకు ప్రభుత్వం కోటి 40 లక్షల రూపాయలు విడుదల చేసిందన్నారు. మీ సేవ కేంద్రాల్లో 9070 అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయని, వరుసగా ఎన్నికలు రావడంతో అర్జీల సంఖ్య పెరిగిపోయిందన్నారు. త్వరితగతిన మీ సేవ కేంద్రాల్లోని అర్జీలను పరిష్కరించాలని సూచించారు. గ్రీవెన్స్ సెల్‌లో అర్జీలను వెంటనే పరిష్కరించాలన్నారు.
ఒంగోలు డివిజన్‌లో 1354, కందుకూరు డివిజన్‌లో 1149, మార్కాపురం డివిజన్‌లో 573 అర్జీలు పెండింగ్‌లో ఉన్నాయన్నారు. కోర్టు కేసుల విషయంలో అప్రమత్తంగా ఉండాలని, సకాలంలో సరైన సమాధానాలు ఇవ్వాలని సూచించారు. జిల్లాలో ఖాళీగా ఉన్న చౌకధరల దుకాణాలను భర్తీ చేసేందుకు చర్యలు తీసుకోవాలని యాకూబ్ నాయక్ ఆదేశించారు. వీడియో కాన్ఫరెన్స్‌లో జాయింట్ కలెక్టర్‌తోపాటు జిల్లా రెవెన్యూ అధికారి జీ గంగాధర్‌గౌడ్, జిల్లా పౌరసరఫరాలశాఖ అధికారి రంగాకుమారి పాల్గొన్నారు.
ప్రభుత్వ భూముల వివరాలు ఇవ్వండి
Published Sun, May 25 2014 2:21 AM | Last Updated on Sat, Sep 2 2017 7:48 AM
Advertisement