క్రమబద్ధీకరణ 15 శాతమే!
♦ భూముల క్రమబద్ధీకరణకు ఆన్‌లైన్ సమస్యలు
♦ దరఖాస్తుల్లో 15 శాతానికి మించని రిజిస్ట్రేషన్లు
♦ కొంచెం నివాసం, మరికొంత వాణిజ్య ప్రాంతంతో సమస్యలు
♦ అధికారుల మధ్య సమన్వయ లోపమే కారణమని ఆరోపణలు
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూముల క్రమబద్ధీకరణ ప్రక్రియ నత్తనడకన సాగుతోంది. వివిధ దశల్లో ఆన్‌లైన్ సమస్యలు చుట్టుముడుతుండడంతో క్షేత్రస్థాయిలో సిబ్బంది చేతులెత్తేస్తున్నారు. ఏడాది క్రితమే సొమ్ము చెల్లించినా భూములను రిజిస్ట్రేషన్ చేయకపోవడంతో లబ్ధిదారులు ఆందోళన చెందుతున్నారు. ప్రభుత్వ భూముల్లో నివాసాలేర్పరచుకున్న మధ్య, ఉన్నత వర్గాలకు నిర్దేశిత ధర చెల్లిస్తే ఆయా భూములను క్రమబద్ధీక రించాలని ప్రభుత్వం జీవో 59లో పేర్కొన్న సంగతి తెలిసిందే. 2014 డిసెంబర్‌లో ఈ జీవో జారీ కాగా, రాష్ట్రవ్యాప్తంగా 28,248 మంది దరఖాస్తు చేసుకున్నారు.
అయితే ప్రభుత్వానికి వచ్చిన దరఖాస్తుల్లో ఇప్పటివరకు అధికారులు క్రమబద్ధీకరించినవి 15 శాతం లోపే కావడం గమనార్హం. చెల్లింపు కేటగిరీలో క్రమబద్ధీకరణ నిమిత్తం భూపరిపాలన అధికారులు కొనుగోలు చేసిన సాఫ్ట్‌వేర్‌లో రోజుకోరకమైన సమస్యలు తలెత్తుండడమే ఇందుకు కారణమని తెలుస్తోంది. సాఫ్ట్‌వేర్‌ను అందించిన సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్, క్రమబద్ధీకరణ ప్రక్రియను పర్యవేక్షిస్తున్న అధికారుల మధ్య సమన్వయం కొరవడడంతో అంతా గందరగోళంగా తయారైందని క్షేత్రస్థాయిలో రెవెన్యూ సిబ్బంది వాపోతున్నారు.
కమర్షియల్‌తో కిరికిరి..!
ప్రభుత్వ భూముల్లో నివాసాలేర్పరచుకున్న వారికి ఆయా భూములను రెసిడెన్షియల్ కేటగిరీ కింద రిజిస్ట్రేషన్ బేసిక్ వాల్యూలో 25శాతం, వాణిజ్య కేటగిరీలోనైతే పూర్తి సొమ్ము చెల్లిస్తే ఆయా భూములను క్రమబద్ధీకరించాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు. రాష్ట్రవ్యాప్తంగా అన్ని జిల్లా కేంద్రాలు, నగర, పట్టణ ప్రాంతాల్లో ఎంతోమంది ఆర్థికంగా కలసివస్తుందని తమ ఇంటి ఆవరణల్లోనే గదుల(దుకాణాల)ను ఏర్పాటు చేసుకున్నారు. ఈ నేపథ్యంలో సదరు ఇల్లు వాణిజ్య కేటగిరీనా, రెసిడెన్షియల్ కేటగిరీనా అన్న అంశాన్ని అధికారులు తేల్చుకోలేకపోతున్నారు. కొంత ప్రదేశం నివాస ప్రాంతంగానూ, మరికొంత ప్రదేశం వాణిజ్య ప్రాంతంగానూ చూపేందుకు సాఫ్ట్‌వేర్‌లో వెసులుబాటు లేకపోవడంతో పరిస్థితి జఠిలంగా మారింది.
ఇటువంటి జాగాలను వాణిజ్య కేటగిరీ కిందనే పరిగణించాలని ఇటీవల సీసీఎల్‌ఏ స్పష్టం చేయడంతో అంత సొమ్ము తాము చెల్లించలేమంటూ లబ్ధిదారులు చేతులెత్తేస్తున్నారు. కమర్షియల్ కిరికిరి ఇలా ఉంటే.. పూర్తిస్థాయిలో నివాస ప్రాంతాల్లోనూ అధికారుల సమన్వయ లోపం కారణంగా కొన్ని ప్రాంతాల్లో రిజిస్ట్రేషన్లు జరగడం లేదని అంటున్నారు. అంతేకాక రిజిస్ట్రార్ కార్యాలయాల్లో కూడా పత్రాల జారీలో పలు సమస్యలు తలెత్తినట్లు తెలుస్తోంది. రూ.లక్షలు పోసి కొనుగోలు చేస్తున్నా, సరైన విధంగా పత్రాలను ఇవ్వకపోవడం పట్ల లబ్ధిదారులు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు.
సబ్ రిజి స్ట్రార్ల పేచీ..
ఇదిలా ఉండగా హైదరాబాద్‌తో పాటు కొన్ని జిల్లాల్లో జీవో 59 ప్రకారం స్టాంప్ డ్యూటీ మినహాయింపుపై జిల్లా కలెక్టర్ల నుంచి తమకు ఎటువంటి సమాచారం లేదంటూ. రిజిస్ట్రేషన్లు చేసేందుకు సబ్ రిజిస్ట్రార్లు ససేమిరా అంటున్నారు. అలాగే క్షేత్రస్థాయిలో సాఫ్ట్‌వేర్ సమస్యల పరిష్కారం పట్ల సెంటర్ ఫర్ గుడ్ గవర్నెన్స్ అధికారులు శ్రద్ధ చూపడం లేదని, ఫిర్యాదు చేసినా భూపరిపాలన అధికారులు పట్టించుకోవడం లేదన్న ఆరోపణలు వినిపిస్తున్నాయి. ఈ క్రమబద్ధీకరణ ప్రక్రియంతా ఒక డిప్యూటీ కలెక్టర్ కేంద్రంగానే నడుస్తుండడం, ఆమెకు వాస్తవ పరిస్థితులపై అవగాహన లేకపోవడంవల్లే మొత్తం ప్రక్రియ అస్తవ్యస్తంగా తయారైందని కొందరు ఆర్డీవోలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఈ నెలాఖరుతో క్రమబద్ధీకరణ ప్రక్రియకు గడువు ముగియనున్నందున ఇప్పటికైనా సీసీఎల్‌ఏ స్పందించి ఆన్‌లైన్‌లో ఏర్పడుతున్న సాంకేతిక సమస్యలను వెంటనే పరిష్కరించాలని, చిన్నచిన్న దుకాణాలున్న నివాసాలకు కమర్షియల్ కేటగిరీ వర్తింపజేయడంపై పునఃపరిశీలించాలని తహసీల్దార్లు,లబ్ధిదారులు కోరుతున్నారు.