క్రమబద్ధీకరణ కథ అడ్డం తిరిగింది!
సాక్షి, హైదరాబాద్: రాష్ట్రంలో భూముల క్రమబద్ధీకరణ కథ అడ్డం తిరిగింది. ప్రభుత్వ ఉత్తర్వుల అమలుకు అధికారులే మోకాలడ్డుతున్నారు. ఫలితంగా ఖజానాకు భారీగా గండిపడే ప్రమాదమేర్పడింది. చెల్లింపు కేటగిరీలో భూక్రమబద్ధీకరణకు రాష్ట్రవ్యాప్తంగా 48,915 దరఖాస్తులు రాగా, అందులో కేవలం 17,891 దరఖాస్తులకే మోక్షం లభించింది. సుమారు 31 వేల దరఖాస్తులను వివిధ కారణాలను చూపుతూ అధికారులు పక్కన పెట్టారు.
వాస్తవానికి కబ్జాకు గురైన ప్రభుత్వ భూములను వెనక్కి తీసుకునేందుకు వీలుకాని పరిస్థితుల్లో వాటిని క్రమబద్ధీకరించాలని సర్కారు భావించింది. ఈ మేరకు 2014 డిసెంబరులోనే ఉత్తర్వులు (జీవో 58, 59) ఇచ్చింది. వీటి ప్రకారం అల్పాదాయ వర్గాలకు ఉచితంగా, మధ్యతరగతి, ఆపై వర్గాలకు నిర్దేశిత సొమ్ము (బేసిక్ విలువలో 25 శాతం) చెల్లిస్తే.. ఆయా భూములను క్రమబద్ధీకరించాల్సి ఉంది. చెల్లింపు కేటగిరీలో క్రమబద్ధీకరణపై సర్కారు ఉదారంగా వ్యవహరించినప్పటికీ క్షేత్రస్థాయిలో తహశీల్దార్లు, ఆర్డీవోలు రకరకాల సాకులు చూపుతూ ఈ ప్రక్రియను ముందుకు సాగనివ ్వడం లేదనే ఆరోపణలు వినిపిస్తున్నాయి. సోమవారంతో క్రమబద్ధీకరణకు, లబ్ధిదారు సొమ్ము చెల్లించేందుకు గడువు ముగియనుంది.
అధికారులే అడ్డుకుంటున్నారు..
సర్కారు ఉదారంగా ఇచ్చిన ఉత్తర్వులను సరిగా అర్థం చేసుకోలేకపోయిన అధికారులు అధికశాతం దరఖాస్తులను రకరకాల కొర్రీలు పెట్టి పక్కన పడేశారు. దరఖాస్తుదారుకు ఆధార్ కార్డులేదని, ఒకే కుటుంబం నుంచి రెండేసి దరఖాస్తులు వచ్చాయని వేల సంఖ్యలో దరఖాస్తులను పట్టించుకోలేదు. అలాగే, ఏదేని నిర్మాణం ఉన్న ప్రభుత్వ భూమిని తప్పనిసరిగా క్రమబద్ధీకరించాలని ఉత్తర్వుల్లో స్పష్టం చేసినప్పటికీ క్షేత్రస్థాయిలో క్రమబద్ధీకరణ కమిటీలకు చైర్మన్లుగా ఉన్న కొందరు ఆర్డీవోలు ఆ నిబంధనను పెడచెవిన పెట్టారు. నిర్మాణం విస్తీర్ణం కంటే ఖాళీ స్థలం ఎక్కువగా ఉందని, స్పష్టత కోసం ఉన్నతాధికారులకు లేఖలు రాశామని ఆర్డీవోలు చెబుతున్నారు.
వీరు రాసిన కొన్ని లేఖలు ఆయా జిల్లాల కలెక ్టరేట్లోనూ, మరికొన్ని సీసీఎల్‌ఏ కార్యాలయంలోనూ పెండింగ్‌లో ఉన్నాయంటున్నారు. ఉత్తర్వులు వచ్చి ఏడాది దాటాకా ఇప్పుడు క్లారిఫికేషన్ అడగడమేంటని లబ్ధిదారులు వాపోతున్నారు. లబ్ధిదారులకు మేలు జరగడం ఇష్టం లేకే కిందిస్థాయి అధికారులు ఇలా చేస్తున్నారని అంటున్నారు. దీంతో సర్కారు ఆదాయానికి భారీగా గండిపడింది. చెల్లింపు కేటగిరీలో భూక్ర మబద్ధీకరణ ద్వారా రూ.వెయ్యి కోట్లకు పైగా ఆదాయం సమకూరుతుందని ప్రభుత్వం అంచనావేసింది. నిర్దేశించిన సొమ్మంతా ఒకేసారి చెల్లించిన వారికి మొత్తం సొమ్ములో 5 శాతం రాయితీనీ కల్పించింది. ఒకేసారి చెల్లించలేని వర్గాలకు సులభ వాయిదాల్లో చెల్లించే సదుపాయం కల్పించింది. చివరి వాయిదా కట్టాల్సిన వారికి పలుమార్లు గడువునూ పొడిగించింది. చెల్లింపు కేటగిరీలో ఇప్పటివరకు అందిన సొమ్ము రూ. 243.78 కోట్లే కావడం గమనార్హం.
ఆర్డీవోలు ఏమంటున్నారంటే..
ధరఖాస్తుల్లో అభ్యంతరకరమైన భూములకు సంబంధించినవి చాలా ఉన్నాయని, ఈ విషయంలో ప్రభుత్వం ఉదారంగా వ్యవహరించమన్నా ఆ తరువాత తమకు చిక్కులు తప్పవని క్రమబద్ధీకరణ కమిటీలకు చైర్మన్లుగా వ్యవహరిస్తున్న ఆర్డీవోలు అంటున్నారు. ఒకే వ్యక్తి పేరిట ఒకటి కంటే ఎక్కువ దరఖాస్తులు వస్తే.. రెండు దరఖాస్తులను ఆమోదించేందుకు సీసీఎల్‌ఏ రూపొందించిన ఆన్‌లైన్ వ్యవస్థ అంగీకరించడం లేదంటున్నారు. అలాగే, క్రమబద్ధీకరణకు ఆధార్ నంబరు తప్పనిసరి కాదని ప్రభుత్వం చెబుతున్నా, అది లేనిదే ఆన్‌లైన్‌లో దరఖాస్తు రిజిస్టర్ కావడం లేదని చెబుతున్నారు. నిర్మాణ విస్తీర్ణం కన్నా ఖాళీ ప్రదేశం ఎక్కువ ఉన్నా క్రమబద్ధీకరించాల్సిందేనని, అయితే భవిష్యత్తులో ఏమైనా ఇబ్బందులు ఎదురవుతాయేమోననే సందేహంతోనే ఉన్నతాధికారులకు లేఖలు రాశామంటున్నారు.