దేవాదాయ శాఖ దుకాణాల అద్దెల్లో గోల్‌మాల్
సాక్షి, హైదరాబాద్: అమీర్‌పేటలోని ఓ దేవాలయం.. నిత్యం భక్తులతో కిటకిటలాడుతుంటుంది... ఆలయానికి అనుబంధంగా నిర్మించిన దుకాణాలూ రద్దీగానే ఉంటాయి. వాటిని లీజుకు తీసుకున్న వ్యక్తులు నెలకు రూ.4 వేల చొప్పున చెల్లిస్తూ వాటిని రూ.15 వేలకు తిరిగి అద్దెకిచ్చుకుంటున్నారు. కమీషన్లతో కళ్లుమూసుకుపోయిన అధికారులు అంతా సవ్యంగానే ఉందంటూ బుకాయిస్తున్నారు. ఈ దందా ఏ ఒక్క దేవాలయానికో పరిమితం కాలేదు. రాష్ట్ర వ్యాప్తంగా ఈ భారీ దందా నడుస్తోంది.తాజాగా ప్రభుత్వానికి దీనిపై ఫిర్యాదులందగా, కొన్ని చోట్ల తనిఖీ చేసి అక్రమాలు నిజమేనని తేల్చింది.
ఆదాయం సమకూరే అవకాశమున్నా..
దేవాలయాలకు అనుబంధంగా ఉన్న దుకాణాల ద్వారా భారీ ఆదాయం సమకూరే అవకాశం ఉన్నా.. స్వయంగా అధికారులే ప్రైవేటు వ్యక్తులతో కుమ్మక్కై అద్దెలను పక్కదారి పట్టిస్తున్నారు. ఇలా దేవాదాయ శాఖ రూ.కోట్లలో ఆదాయాన్ని కోల్పోతోంది. సాధారణంగా దుకాణాలను లీజుకు తీసుకున్న వ్యక్తి మాత్రమే వాటిని నిర్వహించాలి. సబ్ లీజుకు ఇవ్వటానికి వీల్లేదు. కానీ చాలా చోట్ల లీజుదారులు అంతకు మూడు నాలుగు రెట్లు ఎక్కువగా దుకాణాలను ఇతరులకు అద్దెలకిచ్చి నయాపైసా పెట్టుబడి లేకుండా డబ్బులు పొందుతున్నారు.
ఇలా రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1,500కు పైగా దుకాణాల్లో గోల్‌మాల్ జరుగుతున్నట్లు అనుమానాలున్నాయి.
మఠాల్లో ముఠాలు..: దేవాదాయ శాఖ పరిధిలో ఉన్న ధార్మిక సంస్థలు, మఠాల ఆధ్వర్యంలో భారీగా స్థలాలున్నాయి. ఈ సంస్థలు, మఠాలు ఆయా స్థలాల్లో వాణిజ్య సముదాయాలు నిర్మించి అద్దెలకిస్తున్నారు. ఈ ఆదాయం వాటి నిర్వహణకు వినియోగించాలి. అయితే కొందరు మహంత్‌లు, నిర్వాహకులు వాటికి వచ్చే ఆదాయాలను జేబుల్లో నింపేసుకుంటున్నారు. సికింద్రాబాద్‌లోని ఓ ప్రముఖ మఠం పరిధిలో 50 దుకాణాలు న్నాయి.
నెలనెలా రూ.లక్షల్లో అద్దెలొస్తాయి. దాని నిర్వాహకుడు ఆ మొత్తాన్ని సొంత ఖాతాలోకి మళ్లిస్తున్నాడు. అయినా ఉన్నతాధికారులు నోరు మెదపట్లేదు. దీంతో ఈ వ్యవహారంలో వారికీ వాటాలున్నాయన్న ఆరోపణలు ఉన్నాయి. సికింద్రాబాద్‌లోని మరో మఠంలో నిర్వాహకుడు ఏకంగా గుడికి తాళం వేసి సంబంధిత దుకాణాల అద్దెలను మాత్రం తీసుకుంటున్నాడు. కాచిగూడలో ఉన్న మరో ట్రస్టు నిర్వాహకులు దేవాదాయ శాఖ నిబంధనల నుంచి మినహాయిం పు పొందేలా ప్రభుత్వంలోని పెద్దల సాయంతో చక్రం తిప్పారు. ఇప్పుడు దర్జాగా అద్దెలను స్వాహా చేస్తున్నారు.
దేవాలయాల్లో లీజుల దందా!
Published Tue, Apr 11 2017 1:49 AM | Last Updated on Tue, Sep 5 2017 8:26 AM
Advertisement
Advertisement