‘వెలుగు’లో చీకటికోణం | Gambling in the Grain Purchase price | Sakshi
Sakshi News home page

‘వెలుగు’లో చీకటికోణం

Published Wed, Apr 5 2017 10:33 PM | Last Updated on Mon, Oct 1 2018 2:09 PM

Gambling in the Grain Purchase price

నెల్లూరు(పొగతోట/అర్బన్‌):  గ్రామీణ ప్రాంతాల్లో పేదిరి కాన్ని తొలగించి, ప్రజల ఆర్థికశక్తిని పెంచి మెరుగైన జీవనాన్ని కలిగించే ఉద్దేశ్యంతో ప్రభుత్వం ఏర్పాటు చేసిన వెలుగు కార్యాలయంలో అవినీతి రాజ్యమేలుతోంది. నెల్లూరుకు చెందిన ఫ్రెండ్స్‌ క్యాటరింగ్‌ యజమాని సునీల్‌కుమార్‌ నుంచి  వెలుగు ప్రాజెక్టు ఫైనాన్స్‌ మేనేజర్‌ శ్రీనివాసులు రూ.12 వేలు లంచం తీసుకుంటుండగా ఏసీబీ అధికారులు మంగళవారం దాడి చేసి రెడ్‌ హ్యాండ్‌గా పట్టుకున్నారు. డీఆర్‌డీఏ చరిత్రలో ఇదే ప్రథమం. దీంతో ఇక్కడ జరుగుతున్న అవినీతి,  అక్రమాలపై మరోసారి చర్చ మొదలైంది.

నిరుపేద మహిళల అవసరాలను ఆసరాగా చేసుకుని స్వయం సహాయక గ్రూపుల(ఎస్‌హెచ్‌జీ)కు బ్యాంకు లింకేజి రుణాలు మంజూరు చేయిస్తూ వెలుగు సిబ్బంది కమీషన్లు పుచ్చుకుంటున్నారు. గతంలో ఎస్‌హెచ్‌జీ గ్రూపుల ఏర్పాటుకు రేషన్, ఆధార్‌ కార్డుల అనుసంధానం లేదు. ఆ సమయంలో బోగస్‌ ఎస్‌హెచ్‌జీలు ఏర్పాటు చేసి లక్షలాది రూపాయల లింకేజి రుణాలు స్వాహా చేసిన ఘటనలు ఎన్నో ఉన్నాయి. జిల్లాలో 45వేల వరకు  ఎస్‌హెచ్‌జీలు ఉన్నాయి. ఒక్కో గ్రూపులో 10 నుంచి 15 మంది వరకు మహిళలుంటారు. ఆర్థిక స్వావలంబన కోసం మహిళలు నెలనెలా పొదుపు చేసుకుంటూ బ్యాంకు లింకేజి రుణాలు తీసుకుంటున్నారు.

కావలి , గూడూరు, ఉదయగిరి, నాయుడుపేట, రాపూరు తదితర ప్రాంతాల్లో బోగస్‌ ఎస్‌హెచ్‌జీలు ఏర్పాటు చేశారు. ప్రస్తుతం ఉన్న 45వేల గ్రూపుల్లో సుమారు 8వేల గ్రూపులు నాన్‌ ఫంక్షనింగ్‌లో ఉన్నాయి. దీనికి సంబంధించి అధికారులు అనేక పర్యాయాలు సమావేశాలు నిర్వహించి వాటిని సరిదిద్దాలని ప్రయత్నాలు చేసినా ఫలితం కన్పించలేదు. వీటి పేరు మీదట స్వాహా చేసిన బ్యాంకు లింకేజి నిధులతో అనేక మంది సిబ్బంది సొంత భవనాలు నిర్మించుకున్నారనే ఆరోపణలు కూడా ఉన్నాయి. మరికొంతమంది సిబ్బంది నాలుగు చక్రాల వాహనాలు కొనుగోలు చేశారు. పొదుపు సభ్యులకు తక్కువ ధరకే నిత్యావసరాల సరకులు అందించే లక్ష్యంతో సిబ్బంది ఆధ్వర్యంలో మండల కేంద్రాల్లో దుకాణాలు ఏర్పాటు చేశారు.

నగదు స్వాహా చేయడంతో దుకాణాలు మూత పడ్డాయి. సిబ్బంది అవినీతి వల్లనే దుకాణాలు మూతపడ్డాయనే ప్రచారం ఉంది. వెలుగు ప్రాజెక్టు అభివృద్ధి కోసం 2004లో జిల్లాకు సుమారు రూ.40 కోట్ల రూపాయల మూల నిధిని కేటాయించారు. మూలనిధిని గ్రూపులకు రుణాలుగా ఇచ్చి తక్కువ వడ్డీతో తిరిగి రికవరీ చేయాల్సి ఉంది. అందుకు సంబంధించిన పూర్తి వివరాలు గల్లంతయ్యాయి. డీఆర్‌డీఏలో గిరిజన అభివృద్ధి కోసం ప్రత్యేక విభాగం ఉంది. ఈ విభాగం నిరుపేద గిరిజనులను గుర్తించి వారికి రుణాలు మంజూరు చేయించి ప్రతి నెలా ఆదాయం చేకూరేలా చర్యలు చేపట్టాల్సి ఉంది. సిబ్బంది చేతి వాటం ప్రదర్శించి బోగస్‌ పేర్లను నమోదు చేసి రుణాలు స్వాహా చేశారనే ఆరోపణలు వెల్లువెత్తాయి.

► దగదర్తి మండలంలో బ్యాంకుల ద్వారా పొదుపు సభ్యులు రుణాలు తీసుకున్నారు. సభ్యులు తిరిగి చెల్లించిన నగదును బ్యాంకుల్లో జమ చేయకుండా సిబ్బంది స్వాహా చేశారని జిల్లా అధికారులకు మహిళలు అనేక మార్లు ఫిర్యాదు చేశారు. ఇలాంటి సంఘటనలు కోకొల్లలు .
► ఇందుకూరు పేట మండలంలో బ్యాంకులు ద్వారా రుణాలు మంజూరు చేయించి సిబ్బంది కమీషన్లు వసూలు చేశారని పొదుపు సభ్యులు గతంలో జిల్లా కలెక్టర్‌కి ఫిర్యాదు చేశారు.
► డీఆర్‌డీఏలో  విద్యార్థుల కోసం ఉపకారవేతనాల విభాగం ప్రత్యేకంగా ఉంది. బోగస్‌ పేర్లు నమోదు చేసి స్కాలర్‌షిప్‌లు స్వాహా చేశారనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి.

స్త్రీ నిధిని పంచుకున్న సిబ్బంది
మహిళలకు పిల్లల చదువులు, వివాహాలు, కుటీర పరిశ్రమల అభివృద్ధి కోసం స్త్రీనిధిని ప్రవేశ పెట్టారు. జిల్లాలో రూ.వందల కోట్లు రుణాలు మంజూరు చేశారు. మహిళలకు మంజూరు చేయాల్సిన రుణాల్లో  సింహభాగం సిబ్బంది మహిళల పేర్లతో రుణాలు తీసుకున్నారు. తీసుకున్న రుణాలను బయట అధిక వడ్డీలకు మార్చుకుని నగదు తిరిగి చెల్లించాలనే ఆలోచనతో చేతి వాటం ప్రదర్శించారు. వడ్డీలకు తీసుకున్న వారు తిరిగి చెల్లించకపోవడంతో సిబ్బంది చిక్కుల్లో పడ్డారు. రికవరీ శాతం పెరిగి పోవడంతో అధికారుల వత్తిళ్లు అధికమై సిబ్బందిని సస్పెండ్‌ చేసిన సంఘటనలున్నాయి.

శిక్షణలోనూ చేతి వాటం
నిరుద్యోగ యువతకు ఉపాధి అవకాశాలు కల్పించాలనే లక్ష్యంతో పలు శిక్షణ కేంద్రాలను డీఆర్‌డీఏ ఏర్పాటు చేసింది. శిక్షణ కార్యాక్రమాల్లోనూ సిబ్బంది చేతి వాటం ప్రదర్శించి నిధులు స్వాహా చేశారనే ఆరోపణలున్నాయి.

విచారణ జరిపితే వెలుగులోకి..
వెలుగు కార్యాలయంలో గతంలో నుంచి అమలయిన పథకాలు, ఖర్చు , శిక్షణలు, స్త్రీనిధి తదితర అంశాలపై లోతుగా విచారణ చేస్తే అనేక చీకటికోణాలు వెలుగుచూస్తాయని ప్రజలు పేర్కొంటున్నారు. ఆ దిశగా జిల్లా అధికారులు చర్యలు చేపట్టాలని డిమాండ్‌ చేస్తున్నారు.

ధాన్యం కొనుగోల్‌ మాల్‌
రైతులకు మద్దతు ధర కల్పించాలనే లక్ష్యంతో ప్రభుత్వం ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసింది. వీటి నిర్వహణ, బాధ్యత వెలుగు సిబ్బందికి అప్పగించారు. పలు మండలాల్లో సిబ్బంది చేతి వాటం ప్రదర్శించి ధాన్యం కొనక పోయినా కొనుగోలు చేసినట్టు రికార్డులు సృష్టించారు. ఆత్మకూరు ప్రాంతంలో భూమి లేని రైతు పేరుతో రూ.లక్షలు ఆయన ఖాతాలో జమ చేశారు. నగదు పంపకాల్లో విషయం వెలుగు చూసింది. దీంతో విచారణ చేసిన అధికారులు సిబ్బందిని సస్పెండ్‌ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement