సాదాబైనామా ఉంటేనే క్రమబద్ధీకరణ
- దరఖాస్తుల పరిశీలనపై స్పష్టతనిచ్చిన సీసీఎల్‌ఏ
- దరఖాస్తులను 4 కేటగిరీలుగా విభజించాలని ఆదేశాలు
- 1,2 కేటగిరీలను వెంటనే పరిశీలించాలని సూచన
సాక్షి, హైదరాబాద్: సాదాబైనామా పత్రాలను జతచేసిన దరఖాస్తులను మాత్రమే భూముల క్రమబద్ధీకరణకు పరిగణనలోకి తీసుకోవాలని భూపరిపాలన ప్రధాన కమిషనర్(సీసీఎల్‌ఏ) రేమండ్ పీటర్ రెవెన్యూ అధికారులను ఆదేశించారు. తెల్లకాగితాలపై రాసుకున్న వ్యవసాయ భూముల కొనుగోలు ఒప్పందాలను క్రమబద్ధీకరించేందుకు ప్రభుత్వం అవకాశం కల్పించిన సంగతి తెలిసిందే. ఈ మేరకు రాష్ట్రవ్యాప్తంగా అధికారుల అంచనాకు మించి 11 లక్షల మందికిపైగా దరఖాస్తు చేసుకున్నారు. అయితే సాదాబైనామాల క్రమబద్ధీకరణకు ప్రభుత్వం జారీచేసిన ఉత్తర్వుల్లో కొన్ని అంశాల్లో స్పష్టత లేకపోవడంతో, పత్రాలు లేకుండా భూమి సాగులో ఉన్నవారు, సాదాబైనామా కాకుండా ఇతర డాక్యుమెంట్లు ఉన్నవారు కూడా దరఖాస్తు చేసుకున్నారు.
ఈ తరహా దరఖాస్తులే అధికంగా ఉండడంతో పరిశీలన లో పాటించాల్సిన నిబంధనల విషయంలో తగిన మార్గదర్శకాలు ఇవ్వాలని తహసీల్దార్లు మొరపెట్టుకున్నారు. ఈ మేరకు సీసీఎల్‌ఏ తాజాగా సర్క్యులర్ జారీచేశారు. సాదాబైనామా క్రమబద్ధీకరణ ప్రక్రియ కేవలం గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములకు సంబంధించిన అంశం మాత్రమేనని ఉత్తర్వుల్లో స్పష్టంగా పేర్కొన్నప్పటికీ, ఎంతోమంది పట్టణ ప్రాంతాల్లో సాదాబైనామాతో కొనుగోలు చేసిన ఇళ్లు, స్థలాలు, ప్రభుత్వ సీలింగ్ భూములను క్రమబద్ధీకరించాలని దరఖాస్తు పెట్టుకున్నట్లు అధికారుల ప్రాథమిక పరిశీలనలో వెల్లడైంది. ఈ నేపథ్యంలో అలాంటి దరఖాస్తులను పూర్తిగా పక్కన పెట్టాలని సీసీఎల్‌ఏ సూచించారు.
వ్యవసాయ భూముల్లోనూ నాలుగు కేటగిరీలు..
పట్టణ ప్రాంతాలు, ఇళ్లు, స్థలాల సంగతి పక్కనపెడితే, గ్రామీణ ప్రాంతాల్లో వ్యవసాయ భూములకు సంబంధించిన దరఖాస్తుల్లోనూ బోలెడు సమస్యలు ఉత్పన్నమయ్యాయి. సాదాబైనామా అంటే.. తెల్లకాగితం లేదా మరేదైనా కాగితంపై రాసుకున్న రిజిస్ట్రేషన్ కాని పత్రంగా ఉత్తర్వుల్లో పేర్కొనగా, ఎంతోమంది తప్పుగా అర్థం చేసుకున్నారని రెవెన్యూ అధికారులు చెబుతున్నారు. కొంతమంది సాదాబైనామాలు లేకుండా అన్నదమ్ముల మధ్య జరిగిన ఆస్తి పంపకాలు, పెద్దవాళ్లు పిల్లల పేరిట రాసిన వీలునామాలు.. తదితర పత్రాలు సమర్పించినట్లు వారు తెలిపారు. ఈ నేపథ్యంలోనే గ్రామీణ ప్రాంతాల్లోని వ్యవసాయ భూములకు సంబంధించి వచ్చిన దరఖాస్తులను కూడా నాలుగు కేటగిరీలుగా విభజించాలని రెవెన్యూ అధికారులకు సీసీఎల్‌ఏ సూచించారు.
యూఎల్సీ స్థలాలను స్వాధీనం చేసుకుంటాం: సీసీఎల్‌ఏ
క్రమబద్ధీకరణకు అవకాశం ఇచ్చినా దరఖాస్తు చేసుకోని వారి నుంచి యూఎల్సీ ఖాళీస్థలాలను స్వాధీనం చేసుకుంటామని భూపరిపాలన ప్రధాన కమిషనర్ రేమండ్ పీటర్ పేర్కొన్నారు. ఈ మేరకు హైదరాబాద్, రంగారెడ్డి, వరంగల్ జిల్లాల కలెక్టర్లకు ఆదేశాలిచ్చినట్లు ఆయన తెలిపారు. యూఎల్సీ ఖాళీస్థలాల క్రమబద్ధీకరణకు ఈ నెల 25తో గడువు ముగిసిందని, ఇకపై గడువు పొడిగించే ప్రసక్తి లేదని చెప్పారు.
ఆ నాలుగు..
►సాదాబైనామా కలిగి ఉండి, రెవెన్యూ రికార్డుల్లో పేరు నమోదైన రైతే ప్రస్తుతం సాగులో ఉండడం.
►సాదాబైనామా ఉన్న రైతు పేరు రెవెన్యూ రికార్డుల్లో నమోదు కాకున్నా, సాగులో ఉన్నట్లు రుజువు ఉండడం.
►సాదాబైనామా లేకుండా రెవెన్యూ రికార్డుల్లో పేరు నమోదైన రైతు సాగులో ఉండడం.
►సాదాబైనామా లేకుండా రెవెన్యూ రికార్డుల్లో పేరు నమోదు కాకుండా సాగులో ఉన్న రైతు.
నాలుగు కేటగిరీల్లో దరఖాస్తులను విభజిం చాక, తొలిదశలో 1,2 కేటగిరీలకు సంబంధించి న దరఖాస్తులను వెంటనే పరిశీలన ప్రారంభిం చాలని సీసీఎల్‌ఏ అధికారులను ఆదేశించారు. మిగిలిన 3,4 కేటగిరీల కిందకు వచ్చే దరఖాస్తుల క్రమబద్ధీకరణ విషయమై త్వరలోనే మరింత స్పష్టత ఇవ్వనున్నట్లు సీసీఎల్‌ఏ తెలిపారు.