
ఇప్పటికైతే జిల్లాలే
- కొత్త మండలాల ఏర్పాటు ఇప్పుడే వద్దు
- ఉన్నవాటి బలోపేతానికి నిర్ణయం
- జిల్లాల సంఖ్య 23 లేక 24?
- ఇంకా వీడని సందిగ్ధత
- నాలుగు పాయింట్లతో కసరత్తు: రేమండ్ పీటర్
సాక్షి, హైదరాబాద్: కొత్త జిల్లాల ఏర్పాటు ప్రక్రియను వేగవంతం చేసిన ప్రభుత్వం మండలాల పునర్విభజనను తాత్కాలికంగా పక్కనపెట్టింది. రెండింటినీ ఏకకాలంలో చేపడితే మొత్తం ప్రక్రియ మరింత సంక్లిష్టంగా, గందరగోళంగా మారుతుందనే అభిప్రాయాలను పరిగణనలోకి తీసుకుంది. పైగా మండలాలను బాగా పెంచితే ఉద్యోగులు, కార్యాలయాలు, మౌలిక వసతులు, నిర్వహణ వ్యయమంతా తడిసి మోపెడవనుంది. కాబట్టి ముందుగా జిల్లాల పునర్ వ్యవస్థీకరణపైనే దృష్టి పెట్టాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఈ కసరత్తులో భాగంగా తప్పనిసరైతేనే కొత్త మండలాలను ఏర్పాటు చేయాలని భావిస్తోంది.
ప్రత్యామ్నాయంగా ప్రస్తుతమున్న రెవెన్యూ మండలాలను సాంకేతికంగా, సిబ్బందిపరంగా బలోపేతం చేయాలని నిర్ణయించింది. జిల్లాల ఏర్పాటుపైనే దృష్టి సారించాలని అధికారులను అప్రమత్తం చేసింది. ప్రభుత్వ ఉన్నతాధికారి ఒకరు దీన్ని ధ్రువీకరించారు. ‘‘ముందుగా జిల్లాల ఏర్పాటుపైనే మా ప్రధాన దృష్టి. అత్యవసరమైతే తప్ప మండలాల సంఖ్యను పెంచే ఆలోచన లేదు. ఇప్పటికే కొత్త జిల్లా కేంద్రాలకు సరిపడేంత సంఖ్యలో అధికారులు, ఉద్యోగులను సర్దుబాటు చేయాలి. ఇదే సమయంలో మండలాలనూ పెంచితే ఉద్యోగుల కొరత తలెత్తుతుంది’’ అని ఆయన అభిప్రాయపడ్డారు.
సిరిసిల్లతోనే చిక్కుముడి
మరోవైపు సిరిసిల్ల కేంద్రంగా రాజన్న జిల్లాను ఏర్పాటు చేయాలన్న ప్రతిపాదనను ప్రభుత్వం పరిశీలనకు స్వీకరించింది. అదే జరిగితే కరీంనగర్, ప్రతిపాదిత జగిత్యాల జిల్లాల స్వరూపాల్లో భారీ మార్పులు జరుగుతాయి. మొత్తం జిల్లాల సంఖ్య 24కు చేరుతుంది. పైగా 2, 4 కలిపితే సీఎం తన అదృష్ట సంఖ్యగా భావించే 6 వస్తుంది గనుక మొత్తం జిల్లాల సంఖ్య 24కు చేరే అవకాశాలు ఎక్కువనే ప్రచారం జరుగుతోంది.
25 నుంచి 40 ఎకరాల్లో కలెక్టరేట్లు
జిల్లాల ఏర్పాటుకు ఒక్కో జిల్లాకు రూ.100 కోట్లు అవసరమని ప్రభుత్వం అంచనా వేసింది. పాలనకు రూ.70 కోట్లు, శాంతిభద్రతల నిమిత్తం పోలీసు యంత్రాంగానికి రూ.30 కోట్లు కావాల్సి ఉంటుంది.
అన్నీ ఒకేలా ఉండవు
‘‘ప్రాంతం, జనాభాపరంగా జిల్లాలన్నీ ఒకేలా ఉండాలనే నిబంధన లేదు. ఎందుకంటే విస్తీర్ణపరంగా రంగారెడ్డి, హైదరాబాద్‌లకు పోలిక లేదు. జనాభాపరంగా వరంగల్, మహబూబ్‌నగర్ మధ్య భారీ వ్యత్యాసముంటుంది. జిల్లా కేంద్రం ప్రధానంగా ప్రజల అవసరాలకు కేంద్ర బిందువుగా ఉండాలి. పాలన, నిర్వహణ సౌలభ్యం, జిల్లా ఏర్పాటుకు అవసరమైన మౌలిక సదుపాయాలు అందుబాటులో ఉండటం, ఉద్యోగుల సర్దుబాటుకు అనుకూలత... ఈ నాలుగు నియమాలను ప్రామాణికంగా చేసుకోని కొత్త జిల్లాలపై కసరత్తు చేస్తున్నాం’’
- సీసీఎల్‌ఏ రేమండ్ పీటర్