- సీబీఐ విచారణకు కుమారస్వామి డిమాండ్
- అర్కావతి లేఔట్‌పై విచారణకు శెట్టర్ పట్టు
సాక్షి ప్రతినిధి, బెంగళూరు : రాష్ట్రంలో సుమారు రూ.ఆరు లక్షల కోట్ల విలువైన ప్రభుత్వ భూములు ఆక్రమణలకు గురయ్యాయని, ఒక్క బెంగళూరులోనే రూ.రెండు లక్షల కోట్ల విలువైన భూములు అన్యాక్రాంతం అయ్యాయని శాసన సభలో జేడీఎస్ పక్షం నాయకుడు హెచ్‌డీ. కుమారస్వామి ఆరోపించారు.
ఈ భారీ కుంభకోణంపై సీబీఐ చేత దర్యాప్తు చేయించాలని డిమాండ్ చేశారు. శాసన సభలో 69వ నిబంధన కింద దీనిపై శుక్రవారం జరిగిన స్వల్ప వ్యవధి చర్చలో ఆయన పాల్గొంటూ, నగరంలో చెరువులు కూడా ఆక్రమణకు గురయ్యాయని, 1985 నుంచి ఈ ఆక్రమణలు నిర్నిరోధంగా సాగిపోతున్నా రెవెన్యూ, బీబీఎంపీ అధికారులు నిమ్మకు నీరెత్తినట్లు వ్యవహరిస్తున్నారని ధ్వజమెత్తారు. అధికారులు భూకబ్జాదారులతో కుమ్మక్కై ప్రభుత్వ భూములకు అప్పనంగా పట్టాలిచ్చేశారని ఆరోపించారు.
ఇలాంటి అధికారులపై ప్రభుత్వం కఠిన చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు. నగరంలో గృహ నిర్మాణ సంఘాలు భూములను ఆక్రమించుకోవడంలో ప్రముఖ పాత్ర పోషించాయని విమర్శించారు. అక్రమాలకు పాల్పడిన అధికారులతో పాటు ఇతరులు తప్పించుకోవడానికి వీలు లేకుండా ఈ మొత్తం వ్యవహారంపై సీబీఐ దర్యాప్తు జరిపించడమే ఏకైక
మార్గమని ఆయన సూచించారు.
అర్కావతి లేఔట్‌పై కూడా.... : నగరంలోని అర్కావతి లేఔట్‌లో కోర్టు ఆదేశాలను ఉల్లంఘిస్తూ జరిగిన డీనోటిఫికేషన్‌లో అవినీతి చోటు చేసుకుందని ప్రతిపక్ష నాయకుడు జగదీశ్ శెట్టర్ ఆరోపించారు. శాసన సభలో 69వ నిబంధన ఆయన ఈ అంశాన్ని లేవనెత్తుతూ, కోర్టు ఆదేశాలను అడ్డం పెట్టుకుని భూసేకరణకు ఎంపిక చేసిన భూములను డీనోటిఫై చేశారని విమర్శించారు. బీడీఏ అత్యంత జాగ్రత్తగా డీనోటిఫై అని పేర్కొనకుండా, రీమాడిఫై అనే పదాన్ని ఉపయోగించిందని ఆరోపించారు.
అర్కావతి లేఔట్‌లో ఇప్పటికే సుమారు అయిదు వేల ఎకరాల నివేశనాలను పంపిణీ చేసి, రిజిస్ట్రేషన్లను కూడా పూర్తి చేశారని తెలిపారు. అలాంటి భూములను డీనోటిఫై చేశారని ఆరోపించారు. ఇలాంటి పరిస్థితుల్లో నివేశనాలను తీసుకున్న వారి గతి ఏమిటని ప్రశ్నించారు. ఈ అవకతవకలపై నిష్పాక్షిక దర్యాప్తును చేపట్టడానికి వీలుగా ఈ వ్యవహారాన్ని సీబీఐకి అప్పగించాలని ఆయన డిమాండ్ చేశారు.
భూమిని వినియోగించుకోకపోతే స్వాధీనం : పారిశ్రామికాభివృద్ధి, విద్యా సంస్థలు, పూజ మందిరాలు, గృహ నిర్మాణాలు, తోటల పెంపకానికి పొందే భూములను ఏడేళ్లలోగా సద్వినియోగం చేసుకోకపోతే తిరిగి ప్రభుత్వం స్వాధీనం చేసుకుంటుందని రెవెన్యూ శాఖ మంత్రి వీ. శ్రీనివాస ప్రసాద్ తెలిపారు. కర్ణాటక భూ సంస్కరణల సవరణ బిల్లును శుక్రవారం ఆయన శాసన సభలో ప్రవేశ పెట్టారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ నిర్ణీత గడువులోగా సద్వినియోగం చేసుకోని భూములను భూ బ్యాంకులకు అప్పగించాల్సి ఉంటుందని చెప్పారు. దీనికి ప్రభుత్వం ఎలాంటి నష్ట పరిహరం చెల్లించబోదని తెలిపారు.