వారంలోగా నివేదికివ్వండి.. | Report the week .. | Sakshi
Sakshi News home page

వారంలోగా నివేదికివ్వండి..

Published Fri, Jun 20 2014 12:34 AM | Last Updated on Sat, Sep 15 2018 7:34 PM

Report the week ..

కలెక్టరేట్: హైదరాబాద్ జిల్లాలో ఉన్న ప్రభుత్వభూములను వారంలోగా గుర్తించి వాటి పరిస్థితిని వివరిస్తూ వారంలోగా నివేదిక సమర్పించాలని హైదరాబాద్ కలెక్టర్ ఎంకే మీనా తహసీల్దార్లను ఆదేశించారు. గురువారం కలెక్టరేట్‌లో రెవెన్యూశాఖ అధికారులతో ఏర్పాటు చేసిన సమావేశంలో కలెక్టర్ మాట్లాడారు. మొదటిదశలో భాగంగా జిల్లాలో ఉన్న సీలింగ్ సర్‌ప్లస్ భూముల వివరాలను సేకరించాలంటూ..ఈ స్పెషల్‌డ్రైవ్‌లో భూముల ప్రక్రియ శాస్త్రీయపద్ధతిలో చేసేందుకు వీలుగా 20 ప్రత్యేకటీంలను ఏర్పాటు చేయడం జరిగిందని గుర్తుచేశారు. ప్రతీటీంలో ఒక సర్వేయర్, డిప్యూటీ తహశీల్దార్, వీఆర్వో ఉంటారన్నారు.

ఈనెల 26 వరకు ప్రభుత్వ భూముల గుర్తింపు కార్యక్రమం చేపట్టనున్నట్లు వెల్లడించారు. సర్వేయర్లు వచ్చిన తర్వాత వారిని సంబంధిత ఆర్డీవోలకు కేటాయించి పనులు ప్రారంభించనున్నట్లు వెల్లడించారు. మండలస్థాయిలో ప్రతీ మండలానికి తహశీల్దార్ నోడల్ అధికారిగా వ్యవహరిస్తారని, తహశీల్దార్లు తమ మండల పరిధిలో ఉన్న ప్రభుత్వభూముల హద్దులను సర్వేయర్ల సహాయంతో గుర్తించి వాటి ప్రస్తుత పరిస్థితుల నివేదికను వెంటనే పంపాలని ఆదేశించారు.

జిల్లాలోని వివాదస్పద, వివాదరహిత భూములు వేర్వేరుగా గుర్తించి వాటి సమగ్ర సమాచారాన్ని నివేదికలో పొందుపర్చాలని సూచించారు. కోర్టు కేసుల్లో భూముల స్టేటస్‌ను కూడా ఇవ్వాలని ఆదేశించారు. ఈ సమావేశంలో ఇన్‌చార్జి జేసీ సంజీవయ్య, ఎస్‌వోయూఎల్‌టీ సత్తయ్య, ఆర్డీవోలు రఘురాంశర్మ, నిఖిలతోపాటు పలువురు అధికారులు పాల్గొన్నారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement