భయమా.. బద్దకమా! | Why indifference to the invasion? | Sakshi
Sakshi News home page

భయమా.. బద్దకమా!

Published Tue, Oct 29 2013 5:05 AM | Last Updated on Sat, Sep 2 2017 12:04 AM

Why indifference to the invasion?

 

=ఆక్రమణల తొలగింపుపై ఉదాసీనత ఎందుకు?
 =రెవెన్యూ యంత్రాంగంపై మండిపడ్డ ప్రజాప్రతినిధులు
 =డీఆర్‌సీలో పట్టణ ప్రాంత సమస్యల ప్రస్తావన

 
సాక్షి, రంగారెడ్డి జిల్లా: ‘ప్రభుత్వ భూములు పరిరక్షించాల్సిన అధికారులే అక్రమార్కులకు సహకరిస్తున్నారు. భూ కబ్జాలపై ఎన్నిసార్లు ఫిర్యాదు చేసినా ఏమాత్రం చలనం ఉండట్లేదు. ఎందుకింత ఉదాసీనత? ఆక్రమణదారుల నుంచి ఇబ్బందులుంటున్నాయా? లేదంటే వాటిని తొలగించలేని నిర్లక్ష్యవైఖరా?’ అంటూ రెవెన్యూ, జీహెచ్‌ఎంసీ యంత్రాంగంపై జిల్లా సమీక్షా మండలి సభ్యులు తీవ్రస్థాయిలో ఆగ్రహం వ్యక్తం చేశారు. సోమవారం కలెక్టరేట్‌లో మండలి పట్టణ ప్రాంత సమావేశం జరిగింది. జిల్లా ఇన్‌చార్జి మంత్రి డి.శ్రీధర్‌బాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో మంత్రి ప్రసాద్‌కుమార్, జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్, వాటర్‌బోర్డు ఎండీ శ్యామలరావు, కలెక్టర్ బి.శ్రీధర్, అర్బన్ ఎమ్మెల్యేలు హాజరయ్యారు.
 
ఇది అధికారుల నిర్వాకమే...

శేరిలింగంపల్లి మండలం కుడికుంట సర్వేనంబర్ 188లో ని చెరువు శిఖంలో ఓ ప్రైవేటు సంస్థ రియల్ వ్యాపారం సాగిస్తున్న తీరుపై ఫిర్యాదు చేసినా యంత్రాంగం ఇప్పటివరకు స్పందించలేదని శేరిలింగంపల్లి ఎమ్మెల్యే భిక్షపతి యాదవ్ ఆగ్రహం వ్యక్తం చేశారు. కలెక్టర్ శ్రీధర్ స్పందిస్తూ.. అధికారులతో సర్వే చేయించగా ఆక్రమణలున్నట్లు గుర్తించి జీహెచ్‌ఎంసీకి నివేదిక ఇచ్చామన్నారు.

జీహెచ్‌ఎంసీ కమిషనర్ సోమేశ్‌కుమార్... సదరు సంస్థకు నోటీసులు జారీ చేశామని, పరిస్థితిని సమీక్షిస్తానన్నారు. కుత్బుల్లాపూర్ మండలంలో మైనింగ్ కోసం ఓ కంపెనీకి భూమి కేటాయిస్తే దాని చుట్టూ ఫెన్సింగ్ ఏర్పాటు చేశారని, ఇది చట్టవిరుద్ధమని ఎమ్మెల్యే కూన శ్రీశైలం అన్నా రు. మల్కాజ్‌గిరిలోనూ ఇదే తరహాలో ఆక్రమణలున్నాయంటూ ఎమ్మెల్యే ఆకుల రాజేందర్ చెప్పగా... తగిన చర్యలు తీసుకుంటామని కలెక్టర్ బదులిచ్చారు.
 
నీళ్లివ్వండి.. రోడ్లు వేయండి...

 గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో ముఖ్యంగా శివార్లలో తాగునీటి కొరత తీవ్రంగా ఉందని ఎమ్మెల్యేలు ప్రస్తావించారు. కేటాయింపులో కోతలు పెడుతుండడంతోనే సమస్య తీవ్రతరమవుతుందని ఎమ్మెల్యేలు ఎం.కిషన్‌రెడ్డి, కేఎల్లార్ తదితరులు వాటర్‌బోర్టుపై ఆగ్రహం వ్యక్తంచేశారు. దీంతో బిల్లులు చెల్లించిన మేరకు నీళ్లిస్తున్నామని వాటర్‌బోర్డు ఎండీ శ్యామలరావు స్పష్టంచేశారు. మల్కాజ్‌గిరి వాంబే కాలనీలో నిర్మాణాలు చేపట్టి ఏళ్లు కావస్తున్నా ఇప్పటికీ లబ్ధిదారులకు అందించలేదని, అక్కడి సామగ్రిని కొందరు దొంగిలిస్తున్నారని ఎమ్మెల్యేలు అన్నారు.

నీటివసతి లేకపోవడంతో అబ్దుల్లాపూర్‌మెట్ జేఎన్‌ఎన్‌యూఆర్‌ఎం కాలనీ వాసులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని, వారికి తాగునీటిని కేటాయించాలని కోరగా...పంచాయతీల పరిధిలో బిల్లులు పెండింగ్‌లో ఉండడంతో అక్కడ నీటి సరఫరా నిలిపివేశామని, చెల్లిం పులు చేసిన వెంటనే పునరుద్ధరిస్తున్నామని శ్యామలరావు చెప్పారు. వర్షాలతో గ్రేటర్ రోడ్లు అధ్వానంగా మారాయని, వెంటనే పునరుద్ధరించాలని ఎమ్మెల్యేలు డిమాండ్ చేయగా, ప్రణాళిక రూపొందించి మరమ్మతులు చేస్తామని ఆర్‌అండ్‌బీ అధికారులు సమాధానమిచ్చారు.

 విలీనంపై తేల్చండి

 ఇటీవల గ్రేటర్ హైదరాబాద్‌లో పంచాయతీల విలీనంపై స్పష్టత ఇవ్వాలని కిషన్‌రెడ్డి డిమాండ్ చేశారు. దీన్ని వీలైనంత త్వరగా పరిష్కరిస్తామని మంత్రి శ్రీధర్‌బాబు బదులిచ్చారు.
 
 నాగేశ్వర్ నిరసన
 అల్వాల్ ప్రభుత్వ పాఠశాలలో భవనం లేక విద్యార్థులు రోడ్ల పక్కన కూర్చోవాల్సి వస్తోందని ఎమ్మెల్సీ నాగేశ్వర్ ఆవేదన వ్యక్తం చేశారు. డీఈఓ సోమిరెడ్డి పరిస్థితిని వివరించే ప్రయత్నం చేయగా.. సంతృప్తి చెందని ఆయన కుర్చీలోంచి లేచి వేదిక ముందు బైఠాయించారు. గతంలో ఎన్నోసార్లు ఇలాంటి ప్రకటనలు చేశారని, అయినా ఫలితం కనిపించలేదన్నారు. ఇందుకు ఎమ్మెల్యే జేపీ మద్దతు పలికారు. వారంలోపు షెడ్లు వేయిస్తామని కలెక్టర్ హామీ ఇచ్చారు.
 

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement